admin
ఏటా దీపావళి వస్తే ఇంతేనా!
ప్రతి ఏటా దీపావళిని చెడు అనే చీకటిపై సాధించిన వెలుగుల విజయంగా భావించి దేశంలో పండగ జరుపుకోవడం సంప్రదాయ ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా బాణాసంచా కాల్పులు, టపాసుల మోతలు పండగ సంకేతాలుగా ప్రత్యేకతను సంతరించుకుంటాయి. క్లైమేట్ ట్రెండ్స్ తాజా అధ్యయనం ప్రకారం గత ఐదేళ్లలో లేని విధంగా ఢిల్లీలో గాలి నాణ్యత అత్యంత దారుణంగా పడిపోయిందని తేలింది. నిషేధాజ్ఞలు ఎన్ని ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. బాణాసంచా లేదా టపాసుల నిషేధాన్ని సంప్రదాయాన్ని ఉల్లంఘించడంగానే భావిస్తుంటారు. ఈ ఏడాది కూడా అలాగే జరిగింది. అసలే వాహన కాలుష్యంతో, పంటదగ్ధాలతో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో అనారోగ్య సమస్యలు కొనసాగుతున్నప్పటికీ, దీపావళి వచ్చే సరికి అవన్నీ మరిచిపోతుంటారు. 2018 లో కూడా ఢిల్లీలో టపాసుల అమ్మకాలు, వినియోగంపై సుప్రీం కోర్టు నిషేధాజ్ఞలు జారీ చేసినా, ఆచరణ శూన్యమైంది.
2024 నుంచి బాణాసంచా అక్రమ అమ్మకాలను నిషేధించారు. కానీ అవి పని చేయడం లేదు. సరిహద్దు లోని పట్టణాల్లో బాణాసంచా, టపాసుల అక్రమాలు విచ్చలవిడిగానే సాగుతున్నాయి. దీపావళి తరువాత ఢిల్లీలో వాయు నాణ్యత సూచిక (ఎక్యుఐ) బాణాసంచా కాల్పులతో ప్రమాదకరమైన జోన్‌గా తయారైంది. ఎక్యుఐ 050 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉన్నట్టు, 447 కు పాయింట్లు పెరిగితే తీవ్ర వాయు కాలుష్యంగా మారినట్టు కాలుష్య సూచికల సారాంశం అందరికీ తెలిసిందే. దీని ప్రకారం దీపావళి పండగ రాత్రి నుంచి మంగళవారం నాటికి వాయు నాణ్యత స్థాయిలు 400 పాయింట్లు మించి క్షీణించాయి. 38 ఎయిర్ మోనిటరింగ్ స్టేషన్లలో 36 రెడ్‌జోన్లలోనే ఉండటం విశేషం. వజిర్‌పూర 423, ద్వారకా 417, అశోక్‌విహార్ 404, ఆనంద్‌విహార్ లో 404 గా ఎక్యుఐ నమోదైంది. గత ఏడాది దీపావళి మరుసటి రోజు ఉదయం నమోదైన 235 ఎక్యుఐతో పోలిస్తే ఈసారి కాలుష్యం మరింత పెరిగిందని చెప్పవచ్చు. సోమవారం సాయంత్రం అంటే దీపావళి రోజున సాయంత్రం 4 గంటలకే ఢిల్లీలో ఎక్యూఐ 345గా ‘వెరీపూర్’ కేటగిరిలో నమోదైంది. బాణాసంచా కాల్పులవల్లనే రాత్రికి రాత్రి వాయు నాణ్యత అధ్వానంగా తయారైంది.
దీపావళికి వారం రోజుల ముందునుంచే ఢిల్లీ, తదితర ప్రాంతాల్లో గాలి నాణ్యత అధ్వాన స్థాయిలకు చేరుకున్నాయి. వారం రోజుల క్రితం ఢిల్లీలో వాయు నాణ్యత సూచిక 300 పాయింట్ల క్షీణతను సూచించింది. నోయిడా, ఘజియాబాద్‌ల్లో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. ఢిల్లీలో విషవాయువులు గాఢత 80 రెట్లు ఎక్కువగా ఉండడంతో దగ్గు, జలుబు, గొంతు ఇన్‌ఫెక్షన్లు, కంటి దురదలతో ఆస్పత్రులకు వచ్చేవారి సంఖ్య ఎక్కువవుతోంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ముందుజాగ్రత్త చర్యలుగా దీపావళి రోజున బాణాసంచా కాల్పుల విషయంలో సుప్రీం కోర్టు ఈ ఏడాది అనేక ఆంక్షలు విధించినా, ప్రజాప్రతినిధుల నుంచి వివిధ వర్గాల నుంచి గ్రీన్ కాకర్స్‌కు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉదయం 6 నుంచి 7 గంటల వరకు రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కానీ కోర్టు ఆదేశాలు పండగ సంప్రదాయం ముందు నిలువలేదు. అర్ధరాత్రి దాటినా బాణాసంచాలు కాలుస్తున్నారు. టపాసులు పేలుస్తున్నారు. బాణాసంచాలు, టపాసుల వినియోగం వల్ల వచ్చే అనర్థాలపై చాలా మందికి అవగాహన ఉండడం లేదు. వాయు కాలుష్యంతో ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండెపోటు, పక్షవాతం తదితర వ్యాధులు సంక్రమిస్తుంటాయని ప్రజల్లో చాలా మందికి తెలియడం లేదు.
కేవలం వాయు కాలుష్యం వల్లనే 2019 లో దాదాపు 1.67 మిలియన్ మంది అకాల మరణాలకు బలయ్యారని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. బాణాసంచా, టపాసుల తయారీపై లక్షలాది మంది కార్మికులు జీవిస్తున్నారు. తమిళనాడులో శివకాశిలో బాణాసంచా ఫ్యాక్టరీలు ఎన్నో ఇప్పటికీ నడుస్తున్నాయి. నిషేధం వల్ల తమకు ఉపాధి పోతుందన్న ఆందోళన వారిలో ఉంటోంది. అలాగే గ్రీన్‌కాకర్స్ ప్రయోజనం గురించి కూడా ప్రజలకు, వ్యాపారులకు పూర్తి స్థాయిలో అవగాహన లేదు. హానికరమైన రసాయనాలు వినియోగించకుండా, తయారు చేసే బాణాసంచాలనే గ్రీన్ కాకర్స్‌గా వ్యవహరిస్తారు. వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న నగరాల్లో గ్రీన్ కాకర్స్‌కు మాత్రమే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చింది. ప్రభుత్వమే సబ్సిడీపై గ్రీన్ కాకర్స్‌ను ప్రజలకు పంపిణీ చేస్తే చాలావరకు కాలుష్యాన్ని తగ్గించవచ్చన్న సూచనలు వస్తున్నాయి. వాయు నాణ్యతను పెంపొందించడానికి గత దశాబ్దకాలంగా చర్చలు జరుగుతున్నాయి.
ఢిల్లీ వంటి నగరాలు, రాష్ట్రాలు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జిఆర్‌ఎపి) సిద్ధం చేసి అమలు లోకి తీసుకొచ్చాయి. అయితే సవాళ్లకు స్పందించి చర్యలు తీసుకోవడం జాప్యం అవుతోంది. ఇప్పుడు చేయవలసిందంతా మధ్యతరహా నుంచి స్వల్పకాలిక ప్రణాళికలతో ఏడాది పొడుగునా, గాలి స్వచ్ఛంగా ఉండేలా చర్యలు కొనసాగించడం తప్పనిసరి. ఈ మేరకు నిధులు సమృద్ధిగా కేటాయించడం అవసరం. ఇందులో పౌరులకు కూడా భాగస్వామ్యం కల్పించాలి. పాలకవర్గాల జవాబుదారీతనం పెరగాలి. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (ఎన్‌సిఎపి) ప్రస్తుతం వాయు నాణ్యత పిఎం (పర్టిక్యులర్ మేటర్)ను 2.5 కంటే తగ్గించాలని లక్షంగా పెట్టుకుంది. ఈ లక్షంలో కనీసం 20 నుంచి 40 శాతం వరకైనా 2026 నాటికి సాధించవలసి ఉంది. ఈ మేరకు లక్షాలను సాధించలేకుంటే ఢిల్లీతోపాటు ఎన్‌సిఆర్ తదితర పరిసర ప్రాంతాల్లోనూ ఎవరూ నివసించలేని దుర్భర పరిస్థితి దాపురిస్తుంది.
‘జనరల్ జెడ్’ నిరసనలు
ఆండీస్ నుండి హిమాలయాల వరకు, ప్రపంచ వ్యాప్తంగా కొత్త నిరసనల తరంగం చెలరేగుతోంది. ప్రభుత్వాలపై తరతరాలుగా అసంతృప్తి, యువతలో నెలకొన్న ఆగ్రహావేశాలు ప్రభుత్వాలలో మార్పులకు దారితీస్తున్నాయి. ఇటీవల మడగాస్కర్ అధ్యక్షుడు ఆండ్రీ రాజోలినాను సైనిక తిరుగుబాటు తర్వాత అధికారం నుండి తొలగించి దేశం నుండి బయటకు పంపారు. యువ నిరసనకారులు తమను తాము ‘జనరల్ జెడ్ మడగాస్కర్’ అని పిలుచుకుంటూ వారాల తరబడి జరిగిన ప్రదర్శనల పరాకాష్ట ఇది. ఈ హిందూ మహాసముద్ర ద్వీప దేశంలో చెలరేగిన రాజకీయ నాయకత్వంపై ఆగ్రహం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో కనిపిస్తున్నది. నేపాల్, ఫిలిప్పిన్స్, ఇండోనేషియా, కెన్యా, పెరూ, మొరాకో వంటి దేశాలలో ఇటీవలి కాలంలో ఇటువంటి నిరసనలు చూసాం. ఈ నిరసనలు పేరుకుపోయిన అసంతృప్తితో చెలరేగినవే. పెరుగుతున్న అసమానతలు, ఆర్థిక అనిశ్చితి, అవినీతి, నాయకుల బంధుప్రీతి వంటి దీర్ఘకాలిక సమస్యలకు పరాకాష్టగా మారుతున్నాయి.
చెప్పుకోదగిన నాయకత్వం అంటూ లేకుండా, దాదాపు అన్ని రాజకీయ పార్టీలపై అసహనం వ్యక్తం చేస్తూ, తమను తాము ‘జనరల్ జెడ్’ అని ముద్ర వేసుకుంటూ నిరసనలకు దిగుతున్నారు. వారు సుమారుగా 1996 నుండి 2010 మధ్య జన్మించిన వారుగా, అంటే పూర్తిగా ఇంటర్నెట్ యుగంలో పెరిగిన మొదటి తరం అని చెప్పవచ్చు. ఇవ్వన్నీ దాదాపు ఒకే వరుసలో జరుగుతూ ఉండటం విస్మయం కలిగిస్తోంది. సాధారణ అంశం ఏమిటంటే ఈ యువతకు సాంప్రదాయ రాజకీయ పార్టీలు, నాయకులపై విశ్వాసం సన్నగిల్లింది. మెరుగైన పాలన అందీయగల వారి సామర్థ్యంపై తీవ్ర అసంతృప్తి నెలకొంటుంది. సాధారణ పౌర సమస్యలపై నిరసనలు ప్రారంభం కావడం, అవి చివరకు ప్రభుత్వంలో మార్పుకు దారితీయడమా, చివరకు హింసాయుత చర్యలకు సైతం పాల్పడటం జరుగుతూ వస్తున్నది.
‘ఈ యువత నేతృత్వంలోని నిరసనలను కలిపేది ఏమిటంటే, సాంప్రదాయ రాజకీయ వ్యవస్థలు తమ తరం ఆందోళనలకు, అది అవినీతి, వాతావరణ మార్పు లేదా ఆర్థిక అసమానత వంటి వాటికి ప్రతిస్పందించవు అనే ఉమ్మడి భావన. సంస్థాగత వ్యవస్థలు విఫలం భావించినప్పుడు’ అని నిరసనలు, సామాజిక ఉద్యమాలపై పరిశోధన చేసిన యుకె ఆధారిత లాభాపేక్షలేని సోషల్ ఛేంజ్ ల్యాబ్ డైరెక్టర్ సామ్ నాడెల్ పేర్కొన్నారు. వారి నిర్దిష్ట డిమాండ్లు భిన్నంగా ఉన్నప్పటికీ, ఈ నిరసనలలో ఎక్కువ భాగం ప్రభుత్వ అతిక్రమణ లేదా నిర్లక్ష్యం కారణంగా చెలరేగాయి. కొన్ని భద్రతా దళాల కఠినమైన స్పందన, క్రూరమైన అణచివేతను కూడా ఎదుర్కొన్నాయి. మొరాకోలో, మొరాకో డయలింగ్ కోడ్ పేరు పెట్టబడిన జెన్ జెడ్ 212 అనే నాయకుడు లేని సమష్టి మెరుగైన ప్రజాసేవలు, ఆరోగ్యం, విద్యపై ఖర్చు పెంచాలని డిమాండ్ చేస్తూ వీధుల్లోకి వచ్చింది.
పెరూలో, పెన్షన్ చట్టంపై నిరసనలు విస్తృత డిమాండ్లుగా చెలరేగాయి. వీటిలో పెరుగుతున్న అభద్రత, ప్రభుత్వంలో విస్తృతమైన అవినీతి తోడయ్యాయి. ఇండోనేషియాలో, చట్టసభ సభ్యుల ప్రోత్సాహకాలు, జీవన వ్యయంపై ఘోరమైన నిరసనలు చెలరేగాయి. అధ్యక్షుడు కీలకమైన ఆర్థిక, భద్రతా మంత్రులను భర్తీ చేయవలసి వచ్చింది. ‘జనరల్ జెడ్’ నిరసనగా పిలువబడే అత్యంత విస్తృతంగా గుర్తింపు పొందిన ఉద్యమం నేపాల్‌లో జరిగిన ఘోరమైన తిరుగుబాటు. ఇది సెప్టెంబర్‌లో ప్రధానమంత్రి రాజీనామాతో ముగిసింది. దక్షిణాసియాలోని ఇతర ప్రాంతాలలో విజయవంతమైన ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల నుండి నిరసనకారులు ప్రేరణ పొందారు. 2022లో శ్రీలంక, 2024లో బంగ్లాదేశ్ నిరసనలు ప్రభుత్వాల తొలగింపుకు దారితీసాయి.
మడగాస్కర్‌లో, నిరసనకారులు నేపాల్, శ్రీలంకలోని ఉద్యమాల ద్వారా తాము ప్రత్యేకంగా ప్రేరణ పొందామని చెప్పారు. సాధారణమైన నీటి సరఫరా, విద్యుత్ కోతలకు వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభమయ్యాయి. కానీ అధ్యక్షుడు, ఇతర మంత్రులు రాజీనామా చేయాలని ప్రదర్శనకారులు పిలుపునివ్వడంతో త్వరగా విస్తృత అసంతృప్తిగా మారాయి. దానితో మడగాస్కర్ సైనిక తిరుగుబాటు నాయకుడు తాను ‘అధ్యక్ష పదవిని తీసుకుంటున్నానని’ చెప్పాడు. పలు దేశాలలో, ఒక ఏకైక పాప్ సంస్కృతి చిహ్నం ఉద్భవించింది: నవ్వుతున్న పుర్రె, క్రాస్‌బోన్‌లను గడ్డి టోపీ ధరించి చూపించే నల్ల జెండా. ఈ జెండా ‘వన్ పీస్’ అనే కల్ట్ జపనీస్ మాంగా, అనిమే సిరీస్ నుండి వచ్చింది. ఇది అవినీతి ప్రభుత్వాలను ఎదుర్కొనే దొంగల బృందాన్ని అనుసరిస్తుంది. నేపాల్‌లో, నేపాల్ ప్రభుత్వ స్థావరాలైన సింఘా దర్బార్ గేట్లపై, మంత్రిత్వ శాఖలపై నిరసనకారులు అదే జెండాను వేలాడదీశారు. వీటిలో చాలా వాటిని నిరసనలలో దహనం చేశారు.
ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మొరాకో, మడగాస్కర్‌లలో కూడా జనసమూహం అదే విధంగా చేసింది. పెరువియన్ రాజధాని లిమాలో, 27 ఏళ్ల ఎలక్ట్రీషియన్ డేవిడ్ టాఫర్ శాన్ మార్టిన్ స్క్వేర్‌లో అదే జెండాతో నిలబడ్డాడు. ‘మేము అదే పోరాటం చేస్తున్నాము మా విషయంలో, హంతకులు కూడా అయిన అవినీతి అధికారులపై’ అని ఆయన గుర్తు చేసుకున్నారు. 500 కంటే ఎక్కువ నిరసనలలో 50 మంది పౌరులు మరణించినప్పటికీ అధ్యక్షుడు దినా బోలువార్టే ప్రభుత్వం డిసెంబర్ 2022 నుండి అధికారంలో ఉందని గుర్తుచేసుకున్నారు. ‘నా విషయంలో, ఇది అధికార దుర్వినియోగం, అవినీతి, మరణాలపై ఆగ్రహం’ అని టఫూర్ పేర్కొన్నారు. 2017 నుండి దక్షిణ అమెరికాను పీడిస్తున్న హత్యలు, దోపిడీల పెరుగుదలను ప్రస్తావిస్తూ, నేరాలను ఎదుర్కోవడానికి ప్రయత్నాలను బలహీనపరిచిన కొత్త చట్టాల మధ్య. 2022లో లంచం తీసుకోవడం, నిరసనకారులపై ఘోరమైన అణచివేతలో పాల్గొనడం వంటి వివిధ ఆరోపణలపై బోలువార్టే నెలల తరబడి విచారణలో ఉన్నారు.
చివరకు తాత్కాలిక అధ్యక్షుడు జోస్ జెరీ ఆమె స్థానంలోకి రాగా అది సరిపోదని టఫూర్ పేర్కొన్నారు. ‘అధ్యక్షుడు కాంగ్రెస్‌కు మిత్రుడు, ఆయన అక్కడి నుండి వెళ్లిపోవాలి’ అని స్పష్టం చేశారు. గతంలో 2011లో వాల్ స్ట్రీట్ ఆక్రమణ, 2010 నుండి 2012 మధ్య అరబ్ స్ప్రింగ్, హాంకాంగ్‌లో 2014 అంబ్రెల్లా విప్లవం వంటి అనేక ముఖ్యమైన నిరసనలకు యువత నాయకత్వం వహించారు. వారు సామూహిక సమీకరణ కోసం ఇంటర్నెట్, సోషల్ మీడియాను కూడా ఉపయోగించినప్పటికీ, జనరల్ జెడ్ నిరసనకారులు దానిని మరొక స్థాయికి తీసుకు వెళుతున్నారు. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు సమాచారాన్ని పంచుకోవడానికి, కనెక్షన్‌లను నిర్మించడానికి శక్తివంతమైన సాధనాలు. కానీ అత్యంత ప్రభావవంతమైన ఉద్యమాలు తరచుగా డిజిటల్ సమీకరణను సాంప్రదాయ వ్యక్తిగత నిర్వహణతో మిళితం చేస్తాయి. ఈ ఇటీవలి నిరసనలలో మనం చూసినట్లుగా, అని సోషల్ ఛేంజ్ ల్యాబ్ నుండి నాదెల్ పేర్కొన్నారు. నేపాల్‌లో ఉధృతమైన నిరసనలు ప్రారంభానికి కొన్ని రోజుల ముందు, రిజిస్ట్రేషన్ గడువును పాటించనందుకు ప్రభుత్వం చాలా సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్‌లపై నిషేధాన్ని ప్రకటించింది. చాలా మంది యువ నేపాలీలు దీనిని తమను నిశ్శబ్దం చేసే ప్రయత్నంగా భావించారు. గుర్తింపును తప్పించుకోవడానికి వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌ల ద్వారా సోషల్ మీడియా సైట్‌లను యాక్సెస్ చేయడం ప్రారంభించారు.
తరువాతి కొద్ది రోజుల్లో, వారు టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్‌లను ఉపయోగించి రాజకీయ నాయకుల పిల్లల విలాసవంతమైన జీవనశైలిని హైలైట్ చేశారు. నేపాల్‌లోని ధనిక, పేదల మధ్య అసమానతలను ఎత్తిచూపారు. ప్రణాళికాబద్ధమైన ర్యాలీలు, వేదికలను ప్రకటించారు. తరువాత, వారిలో కొందరు గేమింగ్ చాట్ ప్లాట్‌ఫామ్ డిస్కార్డ్‌ను ఉపయోగించి దేశానికి తాత్కాలిక నాయకుడిగా ఎవరిని నామినేట్ చేయాలో సూచించారు. అవినీతికి వ్యతిరేకంగా లేదా అన్యాయానికి వ్యతిరేకంగా ఏదైనా ఉద్యమం జరిగినా, అది డిజిటల్ మీడియా ద్వారా వ్యాపిస్తుంది. నేపాల్‌లో కూడా అదే జరిగింది. నేపాల్‌లో జనరల్ జెడ్ నిరసనల తర్వాత జరిగిన మార్పులు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాయి. ఇతర దేశాలను కూడా ప్రభావితం చేశాయి’ అని ఓ నిరసనకారుడు తెలిపారు. నేపాల్‌లో జరిగిన నిరసనలు యువతను మాత్రమే కాకుండా ఇతర తరాలను కూడా మేల్కొలిపిందని ఆయన పేర్కొన్నారు. మనం ప్రపంచ పౌరులమని, డిజిటల్ స్థలం మనందరినీ కలుపుతుందని, ప్రపంచ వ్యాప్తంగా శక్తివంతమైన పాత్ర పోషిస్తుందని మేము గ్రహించాము అని చెప్పారు.
చలసాని నరేంద్ర
98495 69050
పెంటగాన్‌పై కలాల ధిక్కారం
ఇక్కడ కాదు లెండి, అమెరికాలో. అమెరికా రక్షణ కార్యాలయ కేంద్రం పెంటగాన్‌లో ఇది సంభవించింది. స్వేచ్ఛకు ప్రతీకగా పేరొందిన అమెరికాలో ఇలాంటి బహిష్కరణలు జరగడంలో వింత ఏమీ లేదు. జర్నలిజం వృత్తి ఆ నేలపై అత్యంత గొప్ప వృత్తిగా పేరొందింది. జర్నలిజం అంతా వ్యాపారంగా మారిపోయిన తరువాత కూడా ప్రపంచంపై అమెరికా పెత్తనానికి గుండెకాయ లాంటి పెంటగాన్ విలేకరుల సమావేశం బహిష్కరించడం సాధారణ పరిణామం కాదు. ఈ కారణంగా బహిష్కరణ అనేది అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన పరిణామం అనే చెప్పాలి. అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో కంటే అమెరికాలో జర్నలిజం స్వతంత్రంగానే కొనసాగుతున్నది. కార్పొరేట్ యాజమాన్యాల గుప్పిట్లో మీడియా చిక్కుకొని సంపూర్ణ వ్యాపారంగా మారిపోయినా అమెరికాలో జర్నలిస్టులు తమ వృత్తి పట్ల ఇంకా నిబద్ధతతోనే పని చేయగలుగుతున్నారని ఈ పరిణామం చెబుతున్నది. అయితే ఇదేమీ సాధారణ బహిష్కరణ కాదు.ఒక పత్రికా సమావేశానికి మాత్రమే పరిమితమైనది కూడా కాదు.
అమెరికా రక్షణశాఖ పెంటగాన్ కార్యాలయంనుంచి నిత్యం పనిచేసే జర్నలిస్టులపై విధించిన ఆంక్షల ఫలితం ఇది. తాము చెప్పిన విషయాలను మాత్రమే రాయాలని, ఇతర విషయాలను రాయడానికి, ప్రసారం చేయడానికి ఎంతమాత్రం వీలు లేదని ప్రకటించింది అమెరికా రక్షణశాఖ పెంటగాన్. జర్నలిస్టులు స్వతంత్రించి పెంటగాన్ కార్యాలయంలో ఏ అధికారినైనా కలవడానికి వీలు లేదని, అందుకు గాను తమ అనుమతి తప్పనిసరి అని పేర్కొంటూ ట్రంప్ నేతృత్వంలోని రక్షణశాఖ జర్నలిస్టులపై చాంతాడంత పొడవైన పెద్ద ఆంక్షల జాబితానే ప్రకటించింది. అంతేకాదు, తాము విధించిన ఆంక్షలను అంగీకరిస్తూ ఒక పత్రం (అఫిడవిట్) పై జర్నలిస్టులు అందరూ సంతకాలుచేసి తీరాలని పెంటగాన్ కార్యాలయం బీట్ జర్నలిస్టులను ఆదేశించింది. పెంటగాన్ జర్నలిస్టులు దీనిని వ్యతిరేకించారు. అభ్యంతరం తెలిపారు. పెంటగాన్ యంత్రాంగం దీనినేమీ పట్టించుకోలేదు. సంతకాలుచేసిన తరువాతనే విలేకరుల సమావేశానికి అనుమతిస్తామని ప్రకటించింది. దీంతో ఆ బీట్ జర్నలిస్టులు అందరూ మూకుమ్మడిగా అమెరికా రక్షణ మంత్రి సమావేశాన్ని బహిష్కరించారు. పెంటగాన్ కార్యాలయంలో వార్తల కవరేజీకోసం తమకు జారీ చేసిన అక్రిడిటేషన్ కార్డులను జర్నలిస్టులు అందరూ మూకుమ్మడిగా ఆ యంత్రాంగానికి అప్పగించి వేశారు.
వార్తల కవరేజి కోసం అక్కడ తాము స్థిరంగా ఏర్పాటు చేసుకున్న కంప్యూటర్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తు పరికరాలు అన్నిటిని సమావేశ బహిష్కరణ సందర్భంగా కార్యాలయం నుంచి తీసుకొని వెళ్లిపోయారు. ఇకపై తాము పెంటగాన్‌కు రాబోవడం లేదని సంకేతాత్మకంగా, స్పష్టంగా నిరసన తెలిపారు అమెరికా జర్నలిస్టులు. కానీ పెంటగాన్ సమాచారాన్ని వార్తలు నివేదించే తమ వృత్తిగత కర్తవ్యాన్ని నిలిపివేయబోమని, దానికి అవసరమైన సమాచారాన్ని తాము స్వతంత్రంగా తమ స్వంత పద్ధతుల్లో సేకరిస్తామని వాళ్లు ప్రకటించారు. గత మంగళవారం నాడు ఈ పరిణామం సంభవించింది. సుమారు 250 యేళ్లక్రితం అమెరికా బ్రిటిష్ పరిపాలననుంచి స్వతంత్ర దేశం గా అవతరించింది. నాటి నుంచి నేటి వరకు అమెరికా సమాజానికి వార్తలు సమాచారాన్ని అందించడంలో ఏనాడూ రాజీపడలేదు. సర్కారుకు లొంగి పోలేదు. అమెరికా సమాజ ప్రయోజనాల పరిరక్షణకు విశేష స్థాయిలో కృషిచేసింది. ఒక్క అమెరికా మాత్రమే కాదు యూరప్‌లోని చాలా దేశాల్లో కూడా ఇండియాతో పోల్చితే జర్నలిజం స్వతంత్రంగానే పని చేస్తున్నది. అలాంటిది ఇండియాలో సంభవించి ఉంటే నిజంగా చాలా పెద్ద ఆశ్చర్యమే.
కానీ ఈ నేలపై అలాంటివి సంభవించే అవకాశాలు దాదాపుగా కనుమరుగైపోయాయి. ఇండియా కూడా 75 యేళ్లక్రితం బ్రిటిష్ వలసపాలన నుంచే స్వాతంత్య్రం పొందింది. వలస పాలనలో భారత జాతి ప్రయోజనాల కోసం భారతీయ జర్నలిజం పోషించిన పాత్ర అత్యంత ఘనమైనదే. వృత్తి నిబద్ధతలో అమెరికా, ఇండియా జర్నలిస్టుల శీలం శంకించేదేమీ కాదు. దేశంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించేవరకు చాలా భారతీయ పత్రికలు, జర్నలిస్టులు చాలా వరకు స్వతంత్రంగానే పని చేశాయని చెప్పాలి. ఇందిర నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడి జాతిని జాగృతంచేశాయి. పత్రికా స్వతంత్ర రక్షణకోసం నాడు హిందూ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికలు పోషించిన పాత్ర జర్నలిజం చరిత్రలో గర్వించదగినది. అలా పత్రికలు, జర్నలిస్టులు తమ వృత్తి నిబద్ధతను గట్టిగా చాటుకొని అసలైన పత్రికా స్వేచ్ఛను నాడు నిలబెట్టుకున్నాయి. కానీ నేడు ఆ స్థితి లేదు. స్వతంత్ర ఉద్యమం, ఎమర్జెన్సీ వరకు ఒక లెక్క. ఎమర్జెన్సీ తదనంతరం జర్నలిజంలో భారతీయ జర్నలిజంలో వ్యాపార పోకడలు ప్రవేశించాయి. అయినా కూడా జర్నలిస్టులు స్వతంత్రంగానే వ్యవహరించి పౌరుల భావస్వేచ్ఛను కాపాడే కృషిని విశేష స్థాయిలో నిర్వహించారు. నాటివరకు వాస్తవాలను సమాజానికి అందిస్తూ సాగిన కలం సాగు జర్నలిజం పూర్తిగా వ్యాపారుల చేతుల్లోకి వెళ్లడం మొదలైంది.
90లలో దేశంలో ఆర్థిక సరళీకరణ మొదలవడంతో దేశంలోని మీడియాలోకి అంతర్జాతీయ వ్యాపారుల పెట్టుబడుల ప్రవేశం పెరిగిపోయింది. మీడియాలోకి విదేశీ పెట్టుబడులను అనుమతించే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోవడంతో మొత్తం భారతీయ జర్నలిజం తీరుతెన్ను సంపూర్ణంగా వ్యతిరేక దిశ మళ్లింది. క్రమంగా పత్రికలు, టెలివిజన్ రంగంలోకి విదేశీ పెట్టుబడుల వాటా పెరిగిపోయింది. దీంతో పత్రికల ఎడిటోరియల్ విధానం పూర్తిగా భిన్నరూపం సంతరించుకుంది. దీంతో యథాతథంగా వార్తలు, సమాచారం అందించడంలో మీడియా ఎడిటోరియల్ విధానం జోక్యం పెరిగింది.ఫలితంగా జర్నలిస్టు కలం స్వేచ్ఛకు పరిమితులు, ఆంక్షలు మొదలయ్యాయి. విదేశీ పెట్టుబడులు ప్రవేశించకముందు అనేకమంది జర్నలిస్టులే పత్రికలను సామాజిక సేవ లక్ష్యంతో నిర్వహించేవారు. భారతీయ కార్పొరేట్లు, విదేశీ పెట్టుబడుల ప్రవేశంతో పత్రికలను జర్నలిస్టులు నడిపించగల పరిస్థితులు దాదాపుగా అంతరించిపోయాయి. అలాంటి ఒకటీ, అర పత్రికలు అక్కడక్కడా ఉన్నప్పటికీ జర్నలిజం వ్యాపారుల ఆర్థిక శక్తియుక్తుల ముందు అవి మనుగడ సాగించగల స్థితి లేదిప్పుడు. ఇంటర్నెట్ అందుబాటులోకి రావడం అది సామాన్యులకు కూడా చవకగా లభిస్తూ ఉండడంతో మాస్, సోషల్ మీడియా విస్తృతి విపరీతంగా వ్యాపించింది. ప్రపంచంలోని ఏ మూలన జరిగిన పరిణామమైనా క్షణాల్లో అందరికీ తెలిసే వెసులుబాటు కలిగింది. దీంతో సోషల్ విస్తృతి విపరీతంగా పెరిగిపోయింది. ఫలితంగా సమాచారంకోసం మీడియాపై ఆధారపడడం తగ్గిపోయింది. ఫలితంగా మీడియా ప్రభావం, ప్రాధాన్యత సమాజంపై కొంత తగ్గింది. పదేళ్లుగా దేశంలో మీడియా స్వేచ్ఛ బలహీనపడడం మొదలైంది.
జర్నలిస్టుల వృత్తి నిర్వహణకు అనేక రకాల ఒత్తిళ్లు మొదలయ్యాయి. ఫలితంగా భారతీయ జర్నలిజం విశ్వసనీయత క్షీణ దశ మొదలైంది. ఈ క్రమంలో పత్రికాస్వేచ్చ, పౌరుల భావస్వేచ్ఛ ప్రమాదంలో పడిపోయాయి. ఈ ఒత్తిళ్లు ఇలాగే కొనసాగితే భావస్వేచ్ఛ అనేది ఈ నేలపై ఒక చరిత్రగా మాత్రమే మిగిలి పోయే ప్రమాదం కనిపిస్తున్నది. ఇక్కడ పత్రికలు, వార్తా చానెళ్లు, డిజిటల్ మీడియా సంస్థలు, వార్తా సంస్థలకు కొదవ ఏమీ లేదు. రాశిలో వాటి సంఖ్య ఘనమైనదే. కానీ వాస్తవాలను వెలుగులోకి తేవడంలో జర్నలిస్టులకు అడుగడుగునా అనేక ఇబ్బందులు, ఒత్తిళ్లున్నాయి, భయాలున్నాయి. ఇటీవలి కాలంలో వృత్తి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టులు జాబితాకూడా పెద్దదే. ఈ సంఖ్య జర్నలిజం ఎదుర్కొంటున్న ప్రమాద పరిస్థితులకు ఒక నిదర్శనంగా చూడాలి. ఇలాంటి అనేక సవాళ్ల మధ్య కూడా భారతీయ జర్నలిస్టులు కత్తిమీద సాములాగా తమ వృత్తిని కొనసాగిస్తున్నారు.
పత్రికా రచన ఈ దేశంలో ఒకనాడు అత్యంత గౌరవనీయ వృత్తి. నాడు పత్రికల్లో వచ్చే వార్తలకు ఎంతో విశ్వసనీయత ఉండేది.ఇప్పుడు మాత్రం ఆ స్థితి లేదు. ఇప్పుడు ఆ విశ్వసనీయతను వెదుక్కోవాలి. ఇప్పుడు ఈ దేశంలో మీడియాకు సమాంతరంగా మాస్, సోషల్ మీడియా విస్తరించిపోయింది. కానీ ప్రచురించే, ప్రసారం చేసే వార్తలు, కథనాల్లో నిజానిజాలను బేరీజు వేసుకోవడం పాఠకుడు, వీక్షకుడికి చాలా కష్టమైన పనిగా మారిపోయింది. పెంటగాన్ జర్నలిస్టుల బహిష్కరణ ఇప్పుడు మొత్తం జర్నలిజానికి ఒక స్ఫూర్తిగా నిలవదగ్గ పరిణామంగా చెప్పాలి. ఈ బహిష్కరణనుంచి స్ఫూర్తి పొందగలిగితేనే ఏ దేశ జర్నలిజం అయినా నిలదొక్కుకొని ఆయా దేశాల్లో ప్రజాస్వామిక వ్యవస్థలు మనుగడ సాగిస్తుస్తాయి. అలా కాకుంటే తిరిగి పూర్వపు క్రూరమైన రాచరిక వ్యవస్థలు నియంతృత్వాల పునరుద్ధరణ ప్రమాదం పొంచి ఉంటుంది. అది ఆయా పౌర సమాజాల చైతన్యస్థాయిపై ఆధారపడి ఉంటుంది.
గోవర్ధన్ గందె
93470 56621
జోడేఘాట్ సాయుధ యోధుడు
(నేడు రౌట కొండల్ జయంతి)
నేటి కుమ్రంభీమ్ ఆసిఫాబాద్‌లోని రౌట సంకేపల్లి గ్రామంలో పుట్టిన రౌట కొండల్ కుమురంభీం చిన్ననాటి స్నేహితుడు. కుమ్రంభీమ్ తండ్రి చిన్ను ఆ గ్రామాన్ని స్థాపించాడు. చిన్నప్పటి నుంచి కలసిమెలసి ఉండే ప్రాణ స్నేహితులు వీరు. తమ మేనమామలు పాడిన గోండ్ రాజుల వీరోచిత గాథలను వింటూ ప్రేరణ పొందేవారు. ఒకప్పుడు స్వతంత్ర రాజులుగా ఉన్న గోండులు ఇప్పుడు కటిక పేదరికంలో ఉండటమేమిటి అని యువకుల మనసులకు అర్థం కాలేదు. ఓ సందర్భంలో… మీ కళ్ల ముందు జరుగుతున్న దారుణాలను ఇప్పుడు విశ్లేషించి చూస్తే మీకే అర్థమవుతుంది’ అని పెద్దలు గోండీ భాషలో చెప్పినారు. ఇది అక్కడి యువజనులకు స్ఫూర్తినిచ్చింది. నిజాం అధికారుల దౌర్జన్యాలను తట్టుకోలేక గోండులు, స్వజాతి తెగలవారు వలసబాటపట్టారు. ఆ పరిస్థితిని ఎలాగైనా ఎదుర్కోవాలని భీమ్, కొండల్ భావించేవారు.
పోలీసు బలగాలు, అధికారులకు మద్దతుగా, వారి చేతుల్లో తుపాకులు ఉన్నాయి. కాబట్టి భీమ్ సైన్యం పోలీసులను వారి తుపాకులను ఎదుర్కోవటానికి మార్గాలను ఆలోచించింది. తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పోలీసులను ఎదుర్కొనే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించారు. భీమ్, అతని అనుచరులు కూడా బర్మర్ తుపాకులు, వాటి మందుగుండు సామగ్రి తయారీని నేర్చుకున్నారు. ఈ ప్రయత్నాలతో, కొండల్ మంత్రవిద్య శక్తులకు, భీమ్ భౌతిక పరాక్రమానికి మారుపేరైనారు. వారి శక్తియుక్తులు, విశ్వాసాలపై నమ్మకంతో 12 కుగ్రామాల నుండి వందలాదిగా యువకులు తమ ప్రైవేట్ దళంలోకి లాగబడ్డారు. తద్వారా భూస్వాములు, జంగ్లాతు అధికారులు, పోలీసు బలగాలను ఎదిరించారు. తమ పూర్వపు సంప్రదాయ జీవన విధానాలకు పదును పెట్టాలని ఆలోచించారు. ఈలోగా నిజాం అధికారుల అకృత్యాలు పెచ్చుమీరుతున్నాయి. భీమ్, మరికొందరు వాటిని భరించలేక సమీపంలోని సుర్గాపూర్ గ్రామానికి వలస వచ్చారు. గిరిజనుల పంటలు కోతకు సిద్ధమైన తర్వాత సిద్దిక్ అనే భూస్వామి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులు వాటిని దోచుకున్నారు. కుమ్రం భీమ్ వాటిని ఎదుర్కొన్నాడు. తదనంతర పోరాటంలో భీమ్ ఒక దారితప్పిన దుంగతో సిద్దిక్ తలపై కొట్టాడు. సిద్దిఖ్ కింద పడిపోయాడు. సిద్దిఖ్ చనిపోతే తీవ్ర పరిణామాలు ఏర్పడవచ్చని భీమ్ పారిపోయాడు.
మహారాష్ట్ర మీదుగా అస్సాంకు పోయిన భీమ్ తేయాకు తోటలలో పనిచేశాడు. 1930 36 లలో బ్రిటీష్ దురాగతాలు తమ ప్రాంతాలలో ఎలా జరుగుతున్నాయో తెలుసుకుని బాబేఝరి జోడేఘాట్ ప్రాంతానికి తిరిగి వచ్చాడు. భీమ్ తండ్రి సోదరులు, కొండల్ ఆదివాసీలతో కలిసి బాబేఝరి నుండి జోడేఘాట్ వరకు గుట్టల వెంబడి పన్నెండు కుగ్రామాలను స్థాపించారు. ప్రభుత్వ అధికారులు దాడికి వచ్చినప్పుడు, గోండు వీరులు తమ దుస్తులను బాబేఝరి- జోడేఘాట్ లోయ ఒడ్డున చెట్ల మధ్య వేలాడదీసి, అధికారులను అటువైపు ఆకర్షించి, వెనుక నుండి గెరిల్లా యుద్ధంలో గాయపరిచారు. తిరుగుబాటు చేసిన గోండులను, ఇతర గిరిజన వీరులను పట్టుకునే మార్గాలు తెలియకుండానే నిజాం ప్రభుత్వ దళాలు భీమ్-కొండల్, వారి బదనిక తంత్రం ఆచూకీ తెలిసిన గోండును కనుగొన్నాయి.
భీమ్, కొండల్ వారి అనుచరులతో కలిసి జోడేఘాట్లో ‘అవ్వల్ పేన్’ (తల్లి దేవత)ని ఆరాధిస్తున్నారని, వారి యుద్ధ సాంకేతికతను స్త్రీ ఋతు రక్తంతో తడిసిన గుడ్డ ముక్కతో పరిష్కరించవచ్చని గోండ్ ఇన్ఫార్మర్ వారికి చెప్పాడు. అప్పుడు నిజాం ప్రభుత్వ దళాలు భీమ్ -కొండల్, వారి అనుచరులను అక్కడికక్కడే పట్టుకుని వారిపై బాంబులు విసిరారు. కొండల్ పేలుడు నుండి తప్పించుకున్నప్పుడు భీమ్, అతని అనుచరులలో 13 మంది 1940 సెప్టెంబరు 10వ తేదీన బలిదానం చేయబడ్డారు. భీమ్ వీరోచిత మరణానికి లొంగిపోయిన స్వజాతి గోండు కుర్దుపటేల్ కారణం కాకపోతే, ఆదివాసీలకు జల్- జంగిల్ -జమీన్‌పై ఆ కాలంలోనే హక్కులు వచ్చేవి. అయితే వారి పోరాటం తెలంగాణ రైతాంగ పోరాటానికి, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి స్ఫూర్తినిచ్చింది.
గుమ్మడి లక్ష్మీనారాయణ
91822 96576
రోహిత్, కోహ్లీ వైఫల్యానికి కారణం అదే.. : బ్యాటింగ్ కోచ్
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో జరిగిన తొలి వన్డేలో టీం ఇండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఘోరంగా విఫలమయ్యారు. దాదాపు ఏడు నెలల తర్వాత భారత జట్టు తరఫున ఆడిన ఇరువురు అత్యంత చెత్త ప్రదర్శన చేశారు. రోహిత్ 8 పరుగులు చేసి ఔట్ కాగా, విరాట్ ఏకంగా డకౌట్ అయ్యాడు. దీంతో వీరిద్దరి ప్రదర్శనపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. తాజాగా ఈ విషయంపై టీం ఇండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ స్పందించారు. రో-కోల వైఫల్యానికి వాతావరణమే కారణం అని ఆయన అన్నారు.
వాళ్లిద్దరు ఒక్క మ్యాచ్‌లో రాణించకపోతే ఆందోళన అవసరం లేదని సితాన్షు పేర్కొన్నారు. ‘‘తొలి వన్డేకు వర్షం పలుమార్లు ఆటంకం కలిగించింది. దాని వల్ల ఏకాగ్రత కోల్పోయే అవకాశం ఉంది. ఒకవేళ ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసినా.. వాళ్ల టాపార్డర్ కూడా ఇలాగే కుప్పకూలిపోయేది. రోహిత్-కోహ్లీలు ఆటకు దూరం అయ్యారని అనుకోవడం లేదు. వాళ్లిద్దరూ ఐపిఎల్‌లో ఆడారు. ఇప్పుడు ఈ సిరీస్ కోసం అత్యుత్తమంగా సన్నద్ధమయ్యారు. సీనియర్లుగా వాళ్ల గొప్ప అనుభవం ఉంది. ఇప్పుడు ఒక్క మ్యాచ్‌లో సరిగ్గా ఆడనంత మాత్రాన జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. తప్పకుండా రెండో వన్డేలో అదరగొట్టేస్తారని భావిస్తున్నా’’ అని సితాన్షు వెల్లడించారు.
మేడ్చల్ లో తండ్రిని చంపి… చెరువులో పడేశాడు
హైదరాబాద్: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తుర్కపల్లిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో గొడవపడి తండ్రిని కన్న కొడుకు హత్య చేశాడు. స్థానికుల వివరాల ప్రకారం… సిద్దిపేట జిల్లా ములుగు మండలం అచయిపల్లి గ్రామానికి చెందిన నిజాముద్దీన్ తన కుటుంబంతో కలిసి మేడ్చల్ జిల్లాలోని తుర్కపల్లిలో నివసిస్తున్నారు. నిజాముద్దీన్ కుమారుడు షేక్ సాతక్ మద్యానికి బానిసగా మారాడు. అతడు తన స్నేహితుడు రాజుతో కలిసి ప్రజయ్ వాటర్ ప్లాంట్ వద్ద మంగళవారం రాత్రి మద్యం సేవించారు. అనంతరం ఇంటికి వచ్చిన తరువాత మద్యం మత్తులో తండ్రితో కొడుకు గొడవకు దిగాడు. దీంతో కుమారుడు షేక్ సాతక్ బండ రాయితో తండ్రిని దారుణంగా కొట్టి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని మలక చెరువులో పడేశాడు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుమారుడితో పాటు స్నేహితుడు రాజును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
రాష్ట్రపతి హెలికాప్టర్ ల్యాండవుతుండగా కుంగిన హెలిప్యాడ్
తిరువనంతపురం: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ద్రౌపదీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండవుతుండగా హెలిప్యాడ్ ఒక్కసారిగా కుంగిపోయింది. వెంటనే అధికారులు అప్రమత్తమై రాష్ట్రపతిని హెలికాప్టర్ నుంచి బయటకు తీసుకొచ్చారు. కొచ్చిలోని ప్రమదం స్టేడియంలో ల్యాండింగ్ తర్వాత హెలికాప్టర్ ఓ వైపు ఒరిగింది. హెలిప్యాడ్ కుంగిపోవడంతో హెలికాప్టర్ ఒక వైపు ఒరగడంతో భద్రతా సిబ్బంది ఆందోళన చెందారు. పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది అక్కడికి చేరుకొని హెలికాప్టర్ ను ముందుకు తోశారు. అనంతరం రాష్ట్రపతిని బయటకు తీశారు.
ప్రపంచకప్ ఫైనల్‌పై అప్‌డేట్.. మ్యాచ్ ఇండియాలోనే..
మహిళల వన్డే ప్రపంచకప్ టోర్నమెంట్‌లో లీగ్ స్టేజీ ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి. గురువారం న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే.. సెమీఫైనల్‌కు చేరే అవకాశం సులభమవుతుంది. అయితే ప్రపంచకప్ ఫైనల్ గురించి ఏర్పడిన గందరగోళం తొలగిపోయింది. లీగ్ దశలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయిపోయాయి. దీంతో ఐసిసికి వెసులుబాటు దొరికింది. ఒకవేళ పాకిస్థాన్ ఫైనల్‌కు చేరుకుంటే.. ఆ మ్యాచ్‌ను కొలంబోలో నిర్వహించాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు లీగ్ స్టేజీలోనే పాకిస్థాన్ ఎలిమినేట్ కావడంతో ఆ మ్యాచ్‌ను భారత్‌లోనే నిర్వహిస్తారు. ఇక తొలి సెమీ ఫైనల్ (అక్టోబర్ 29)కు ఇంకా వేదిక ఖరారు కాలేదు. ఈ మ్యాచ్ ఇండోర్‌లో జరిగే అవకాశం ఉంది. రెండో సెమీస్ (అక్టోబర్ 30) నవీ ముంబైలో జరుగుతుంది. నవంబర్ 2న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
ఇక ఈ టోర్నమెంట్‌ని విజయాలతో ప్రారంభించిన భారత్.. ఆ తర్వాత వరుస ఓటములు చవి చూసింది. దీంతో గురువారం న్యూజిలాండ్‌తో మ్యాచ్ భారత్‌కు ఎంతో కీలకం. ఎందుకంటే సెమీ ఫైనల్‌లో బెర్త్ కోసం కివీస్, శ్రీలంక, భారత్ పోటీ పడుతున్నాయి. ఒకవేళ కివీస్‌తో మ్యాచ్ ఓడిపోతే.. భారత్ సెమీ ఫైనల్‌కి చేరడం కష్టమవుతుంది. ఒకవేళ గెలిస్తే.. ఎటువంటి ఇబ్బంది లేకుండా సెమీస్‌కి అర్హత సాధించవచ్చు.
వీధి వ్యాపారులపైకి దూసుకెళ్లిన వాహనం: ఒకరు మృతి… 9 మంది పరిస్థితి విషమం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జికె వీధి మండలం రింతాడ వద్ద కూరగాయాలు అమ్ముతున్న వీధి వ్యాపారుల పైకి వాహనం దూసుకెళ్లడంతో ఒకరు మృతి చెందగా 15 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.