ఓట్ల కోసం ఖజానాకు తూట్లు
బీహార్ రెండో దశ పోలింగ్‌కు సిద్ధమైంది. 1.30 మిలియన్ మంది జనాభా కలిగిన బీహార్‌లో ఓట్లను కొల్లగొట్టడానికి ఎన్‌డిఎ ప్రభుత్వం అపారమైన సంక్షేమ ప్యాకేజీని ప్రకటించింది. ఇది తీవ్రమైన ఆర్థిక పరిణామాలతో కూడుకుని ఉంటోంది. అత్యంత ప్రధానమైన ప్రస్తుత ప్రధాన రెండు పథకాలు ఇప్పటికే రాష్ట్ర ఆదాయంలో 10 శాతం వరకు హరించి వేస్తున్నాయి. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు ఓట్లు వేయడానికి వెళ్లక ముందే 1.5 కోట్ల మంది మహిళలు ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన (ఎంఎంఆర్‌వై) పథకం కింద నేరుగా తమ బ్యాంకు ఖాతాల్లో నుంచి రూ. 10 వేలు వంతున నగదు అందుకోగలిగారు. ఎక్కువ మంది మహిళలు నమోదు కావడంతో అసలు వ్యయం ఇంకా పెరగవచ్చు. మరో 1.1 కోట్ల మంది ముఖ్యంగా వితంతువులు, వృద్ధమహిళలు, వికలాంగులు వీరందరికీ నెలవారీ పెన్షన్ రూ. 400 నుంచి రూ. 1100 వరకు మూడు రెట్లు పెరిగింది. ఫలితంగా ఏటా పెన్షన్ కింద ప్రతి పెన్షనర్‌కు రూ. 8400 వంతున పెరిగింది. ఈ మొత్తం అంతా రూ. 9420 కోట్ల వరకు అదనపు భారాన్ని పెంచింది.
ఈ రెండు పథకాలకు కలిపి 2025 26 రాష్ట్ర బడ్జెట్ ఆదాయంలో పదో వంతు వ్యయాన్ని కేటాయించవలసి వస్తోంది. ఇవి కేవలం హామీలు మాత్రమే కాదని గుర్తించడం అవసరం. ఎంఎంఆర్‌వై పథకం నిధులు ఇప్పటికే పంపిణీ అయ్యాయి. పెన్షన్ నిధుల కేటాయింపు కూడా జులై నుంచి మొదలైంది. ఇంత భారీ మొత్తాన్ని ఎవరు భరిస్తారు? ఎంఎంఆర్‌వై పథకం నిధులు రుణం నుంచి లభిస్తాయా? లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా అందుతాయా? సామాజిక భద్రత కింద పెరిగిన ఈ మొత్తం అంతా రాష్ట్ర ఖజానా నుంచే భరిస్తారని నివేదించడమైంది. కానీ దీని ప్రభావం ఇతర అభివృద్ధి కార్యక్రమాల నిధులపై ఎంతవరకు పడుతుంది? రాష్ట్ర ప్రభుత్వం తన మూలధన వ్యయాన్ని తగ్గిస్తుందా? అంటే దీని అర్థం కొత్తగా రోడ్లు, స్కూళ్ల నిర్మాణానికి, విద్యుత్ ఉత్పత్తికి, ఇతర అభివృద్ధి పథకాలకు కావలసిన పెట్టుబడుల్లో కోత విధిస్తుందా? ఈ మేరకు పెరిగిన ద్రవ్యలోటు ఫలితంగా రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు వేతనాల చెల్లింపుల్లో ఆలస్యం జరుగుతుందా? ఇవన్నీ తలెత్తుతున్నాయి. ముక్తసరిగా చెప్పాలంటే ఎన్‌డిఎ సంక్షేమ ప్యాకేజీ దేశంలోని అత్యంత నిరుపేద, కనీస అభివృద్ధి కూడా లేని బీహార్ రాష్ట్రంలో ఆర్థిక వినాశనానికి విత్తనాలు నాటిందా? గత ఏడాది బీహార్ ఆర్థికలోటు రాష్ట్ర జిడిపిలో 9.2 శాతంగా ఉంది. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలకు మూడు సార్లు ఆర్థిక లోటును భరించడానికి వీలుంటుంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను గత మార్చిలో ప్రవేశ పెట్టినప్పుడు ఆర్థిక లోటును 3 శాతానికి తగ్గిస్తానని రాష్ట్ర ప్రభుత్వం ధైర్యంగా హామీ ప్రకటించింది. అయితే అది ఇప్పుడు జరిగే అవకాశం లేకుండా సంక్షేమ ప్యాకేజీ ఆశలను చెల్లాచెదురు చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ భారీ సంక్షేమ ప్యాకేజీ ప్రకటనకు ఓటర్లు సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి ఆర్థిక బాధ్యతారాహిత్యానికి విపక్షాలు ఏ విమర్శలు చేయకుండా దూరంగా ఉంటున్నాయి. దీనికి పోటీగా అవి కూడా భారీ హామీలతో తమ స్వంత సంక్షేమాన్ని ప్రకటించాయి. క్షేత్రస్థాయిలో ఈ రాజకీయ క్రీడ చాలా తేడాగా ఉంటోంది. ఎందుకంటే నితీశ్ ప్రభుత్వం ఇప్పటికే తమ హామీలను అమలు చేస్తుండడంతో విపక్షకూటమి కేవలం హామీలు ఇస్తుందనే భావనతో ఓటర్లు ఉన్నారు. దళారుల ప్రమేయం కానీ, అవినీతి కానీ చోటు చేసుకోకుండా ఓటర్ల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేయడం నితీశ్‌కు ప్లస్ పాయింట్‌గా కనిపిస్తోంది. గతంలో ఇలాంటి నగదు పంపిణీ, తదితర పథకాల్లో కేవలం 15 శాతం వరకే ప్రయోజనాలు లబ్ధిదారులకు అందేవి. సాధారణంగా పాలనలోఉన్న ముఖ్యమంత్రులపై ఎంతో కొంత వ్యతిరేకత ఉండడం సహజం. రాష్ట్రాల్లో పాలన సరిగ్గా లేకుంటే ఎన్నికలు వచ్చినప్పుడు వ్యతిరేకంగా ఓట్లు వేసి తమ కోపం తీర్చుకుంటుంటారు. ఈ విషయంలో నితీశ్ ముందుగానే జాగ్రత్త పడ్డారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను గమనించి దాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్నారు.
మోడీ ప్రభుత్వంతో జతకట్టి అధికారంలో ఉండడంతో ఓటర్లలో ఉన్న కొద్దిపాటి వ్యతిరేకతను అధిగమించడానికి ప్రయత్నించారు. భారీ సంక్షేమ పథకాలతో ఓటర్లను ఊరించే పనిచేశారు. ఈ పరిస్థితుల్లో భారీ సంక్షేమ పథకాలు గేమ్ ఛేంజర్ అవుతాయా? మరోవైపు ప్రధాన విపక్షకూటమి ‘మహాఘట్‌బంధన్’ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన 20 రోజుల్లోనే కుటుంబానికి ఓ ఉద్యోగం కల్పిస్తామని హామీ ప్రకటించింది. బీహార్‌లో 2.97 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. నెలకు రూ.15,000 నుంచి రూ. 20,000 వంతున ప్రతి కుటుంబానికి ఖర్చు పెట్టవలసి వస్తుందని లెక్క వేసినా మొత్తం వ్యయం రూ. 5.35 లక్షల కోట్లు నుంచి రూ.7.13 లక్షల కోట్ల వరకు వ్యయం కాక తప్పదు. ఇది ఉద్యోగ వాగ్దాన అసంబద్ధతను తెలియజేస్తుంది. ఈ సరళమైన గణాంకం మహాఘట్‌బంధన్ ఆలోచన లోని శూన్యతను తెలియజేస్తుంది. ఇది కాక ఐదేళ్ల పాటు వడ్డీ లేని నగదు రూ. 5 లక్షల వరకు అందజేస్తామని, పంటల సేకరణ గ్యారంటీ, 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా ఇవన్నీ మహాఘట్‌బంధన్ మేనిఫెస్టోలో చేర్చిన ప్రధాన అంశాలు. అయితే ఆర్థిక నిపుణులు, రాజకీయ పరిశీలకులు ఈ ఉచిత హామీలు వచ్చే ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపించవని వాదిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బ్యాంకు ఖాతాల ద్వారా రూ. 10 వేలు అందుకుంటున్న మహిళలు కూడా చాలామంది ప్రభుత్వం మార్పును కోరుతుండడం గమనార్హం.