బడికి వెళ్లి ఆయన అక్షరాలు చదవలేదు.. కానీ సమాజాన్ని ఆయన తన అంతర్‌హృదయంతో చూశారు. సమాజంలో జరుగుతున్న ప్రజల వ్యథలు, పోరాటాలను కళ్లతో చూసి.. ఆ బాధలే ఆయనను ప్రజల పక్షాన ప్రజా గొంతుకగా నిలబడేలా చేసింది. చిన్నతనం నుంచే అనాథగా బతికిన ఆయన గుండెకు తాకిన గాయాలు ఎన్ని ఉంటాయో.. గొడ్లకాపరిగా పని చేస్తూ ప్రకృతి.. మూగజీవాలతోనూ మమేకం అయ్యారు. ప్రకృతి ఎదుర్కొనే ముప్పును సైతం పదాల అల్లికతో జత కట్టి పాటలు, పద్యాలు పాడుకున్నాడు. సమాజంలో భిన్నమైన సమస్యలతో సతమతమవుతున్న ప్రజల బతుకులను చూశాడు. కన్న తల్లిదండ్రులను పట్టించుకోకుండా.. మానవ సంబంధాలకు కనీస విలువనివ్వని సమాజాన్ని కళ్లారా చూశారు. ఆయన కళ్లతో చూసిందే.. పదాల అల్లికతో గేయంగా మారి ఆ గాయాన్ని మాన్పింది. అణచివేతలమీద ఆయన పాట ఉక్కు పిడికిళ్లుగా మారాయి.
అన్యాయంపై గళమెత్తే జనగర్జన అయింది. అందెశ్రీ ఉద్యమ జన జాతర. తెలంగాణ మలివిడత ఉద్యమం ఉధృతంగా మారిన సమయంలో అందెశ్రీ పాటలు ప్రజల్లో గొప్ప పోరాట పటిమను చూపాయి. జనజాతరలో మనగీతం జయకేతనమై ఎగరాలి.. జంజవారుతా జననినాదమై సాగాలి.. అంటూ మలివిడత ఉద్యమంలో ఆయన కవిత్వాలు లక్షలాది మందిని కదిలించాయి. చిన్నతనంలోనే కష్టాలు చూసిన అందె శ్రీ ప్రజల బతుకుల్లో గుణాత్మక మార్పు, సమాజ శ్రేయస్సు కోసం ఎన్నో రచనలు చేశారు. చదువు లేకపోయినా ప్రజల అంతర్ హృదయాలను అందెశ్రీ చదివారు. రవి చేరనిచోటు ఉంటుంది కానీ కవి చేరనిచోటు ఉండదు అన్నట్లుగా ఆయన కవిత్వం, పాటల రూపంలో ప్రతీ గుండెను తాకారు. ఆవేదనల గుండెలకు బలయ్యారు. అణచివేతపై తిరుగుబాటు గళం అయ్యారు. పోరాట పిడికిళ్లకు పదునైన గీతంగా మారాడు అందెశ్రీ.
సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో అందెశ్రీ జన్మించారు. ఆయన అసలు పేరు అందె ఎల్లయ్య. అనాథగా పెరిగిన అందెశ్రీ చిన్నతనంలోనే కష్టాలు వెంటాడాయి. తన కష్టాలను ప్రజల్లో, సమాజంలో చూసిన ఆయన తన పల్లెతో, ప్రకృతితో, మనుషుల హృదయాలతో మమేకం అయ్యారు. పల్లె జీవన బతుకులు తెలిసిన వ్యక్తిగా ‘పల్లె నీకు వందనాలమ్మో… తల్లీ నీకు వందనాలమ్మో.. అంటూ పల్లెను తల్లితో పోల్చి బతుకు విలువను నేర్పిన పల్లెలలపై మమకారాన్ని చాటారు. ‘కొమ్మ చెక్కితే బొమ్మరా… కొలిసి మొక్కితే అమ్మరా’ మాయమైపోతున్నాడమ్మా మనిషిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అంటూ సమాజంలో మంట కలుస్తున్న మానవ సంబందాలపై రాసిన పాటలన్నీ అయన గుండెల నుంచి సమాజం కోసం ఉప్పొంగిన గొప్ప అక్షరాలు.. తెలంగాణ మలివిడత ఉద్యమం ఉధృతంగా మారిన తరుణంలో ఆ గేయం ఓ పోరాట తిలకంగా నిలిచింది.
జనజాతరలో మనగీతం జయకేతనమై ఎగరాలి.. ఒకటే జననం.. ఓహో ఒకటే జననం.. జీవితమంతా జనమే మననం.. కష్టానష్టాలు ఎన్ని ఎదురైనా కార్యదీక్షలో తెలంగాణ అంటూ ఉప్పొంగిన గేయం తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష సాకారానికి ఎంతో భూమిక పోషించింది. అనేక రచనలు, కవిత్వాలతో ఆయన ఎంతోమంది సాహిత్యకారులకు, ప్రజాపోరాటాలకు ఓ చైతన్య గొంతుకగా నిలిచారు. ఆయన చేసిన అనేక రచనలకు కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను సైతం ప్రదానం చేసింది. దాశరథీ పురస్కారం, వాషింగ్టన్ డిసి వారి గౌరవ డాక్టరేట్‌తోపాటు లోకకవి అన్న బిరుదు పొందారు. 2015లో డాక్టర్ రావూరి భరద్వాజ, రావూరి కాంతమ్మ ట్రస్టు వారి ఆధ్వర్యంలో జ్ఞాన పీఠ్ పురస్కార గ్రహీత ఆధ్వర్యంలో భరద్వాజ సాహితీ పురస్కారం.. దాంతో నంది అవార్డుతో పాటు ఎంతో మంది ప్రజల గుండెలను గెలుచుకున్నారు. తెలంగాణ మలివిడత ఉద్యమంలో ధూంధాంకు ఉన్న సాంస్కృతిక ఉద్యమ పాత్ర గొప్పది.
ఆ సమయంలో నాటి ఉమ్మడి పది జిల్లాలో తెలంగాణ ధూంధాం వేదికల మీద అందెశ్రీ పాటలు తెలంగాణ పల్లె బతుకులను కళ్లకుకట్టేలా చూపాయి. చూడ చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి.. నవ్వుల్లో నాగమల్లి నా ఊరు పాలవెల్లి.. మళ్లీ జనమా ఉంటే సూరమ్మో.. మళ్లీని కడుపున పుడతా మయమ్మో అంటూ తెలంగాణ పల్లె ఆత్మీయతను గొప్పగా ప్రదర్శించారు. సమాజం హితం కోసం అనేక రచనలు చేసి సాహితీ శిఖరంగా ఎదిగిన ఆయన నేడు తెలంగాణ గీతంగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలవనున్నారు. అందె శ్రీ రాసిన జయజయహే తెలంగాణ పాట నేడు రాష్ట్ర గీతంగా మారింది. సాహితీ లోకానికి, అటు గుణాత్మక సమాజం కోసం పరితపించిన అందెశ్రీ అకాల మృతి తీరని లోటు. అయినప్పటికీ ఆయన తెలంగాణ రాష్ట్ర గీతంగా ఎప్పటికీ ప్రజల గుండెల్లో తెలంగాణ ఉద్యమంలో జన జాతరను కదిలించిన సాహితీ శిఖరంగా కొలువై ఉంటాడు.
– సంపత్ గడ్డం
78933 03516