పైరసీ.. ఎందరికో ప్రేయసి
ఇమంది రవి అలియాస్ ఐబొమ్మరవి అరెస్ట్ కన్నా చాలా ముందు నుంచే సినిమా పైరసీ గురించిన విస్తృత చర్చ జరుగుతోంది. పైరసీ సీడీల రోజులనుంచీ ఆన్ లైన్ పైరసీ రోజుల్లోకి ప్రవేశించాం. పైరసీ నా ప్రేయసీ అనే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది కానీ తగ్గడం లేదు. పైరసీకి కారణం కూడా సినిమా పరిశ్రమే. సీడీల పైరసీ రోజుల్లో సింగిల్ స్క్రీన్స్ విస్తృతంగా ఉన్నాయి. జనాలు పైరసీ సీడీల వైపు పెద్దగా చూసేవాళ్లు కాదు. కారణం సీడీ కొంటే అది చూడడానికి పరికరాలు కావాలి. అందుకని కొద్దిమంది మాత్రమే వాటివైపు చూసేవారు. ఈ గోల కన్నా హాయిగా సినిమా హాలుకు పోయి సినిమా చూడడమే బెటర్ అనుకునేవారు జనం. ఆన్‌లైన్ పైరసీ వచ్చిన తర్వాత జస్ట్ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎక్కడ పడితే అక్కడ ప్రశాంతంగా చూసుకోవచ్చు అనే అభిప్రాయం కలిగాక సీడీల కన్నా ఇది జనామోదం పొందింది. కోవిడ్ తర్వాత రోజుల్లో సింగిల్ స్క్రీన్స్ మూసివేత వేగంగా పెరిగింది. అదే సమయంలో ఓటీటీ అనే సినిమా ప్లాట్ ఫామ్ మన జీవితాల్లోకి ప్రవేశించింది. లాక్ డౌన్ పుణ్యమా అని బాగా దగ్గరయ్యింది. సినిమా హాళ్లకు టీవీ అనే ప్లాట్ ఫామ్ ఇబ్బందికరం అనుకున్నాం ఒకప్పుడు.. నిజానికి ప్రైవేటు ఛానల్స్ మొదలయ్యాక చాలా ఊళ్లల్లో సినిమా హాళ్లు ముఖ్యం సింగిల్ స్క్రీన్స్ కళ్యాణ మండపాలుగా మారాయి. దాన్ని మించిన స్థాయిలో ఓటీటీ వచ్చాక సినిమా హాలు నిలబడడం కష్టసాధ్యంగా మారిపోయింది.
ఒకప్పుడు సినిమా మీద ఇన్‌కమ్ అంటే బుకింగులో అమ్ముడయ్యే టిక్కెట్ల నుంచి మాత్రమే వచ్చేది. ఇప్పుడు అలా కాదు రకరకాలుగా డబ్బులు వస్తున్నాయి. ఒకటి డిజిటల్ అమ్మకం. అంటే సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ ఈవెంట్ దగ్గర నుంచీ జరిగే అన్ని ప్రీరిలీజ్ ఈవెంట్స్ ప్రసార హక్కులూ డిజిటల్ గానూ, శాటిలైట్ గానూ, ఓటీటీగానూ కూడా అమ్మేసుకుంటున్నారు. అక్కడ నుంచీ వ్యాపారం మొదలు. ఫైనల్ గా సినిమా తయారయ్యాక థియేట్రికల్ రైట్స్ అమ్ముతారు. ఓటీటీ హక్కులు అమ్ముతారు. శాటిలైట్ హక్కులు అమ్ముతారు. యుట్యూబ్ లాంటి ప్లాట్‌ఫామ్ లకు కూడా అమ్ముతారు. ఇప్పుడు థియేట్రికల్ రైట్స్ అనేది సినిమా వ్యాపారంలో ఓ భాగం మాత్రమే. పైరసీ వల్ల నష్టపోయేది ఈ థియేట్రికల్ హక్కుల కొనుగోలుదారులే. ఈ పైరసీ కంటెంట్ చూసేవాళ్లల్లో ప్రధాన వాటా ఎవరూ? అంటే సింగిల్ స్క్రీన్ ఆడియన్సే. నిజానికి ఈ సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ వాళ్ల వినోద కేంద్రాలైన సింగిల్ స్క్రీన్స్ మాయం అయిపోయాక ఎక్కడకిపోవాలి? వెళ్తే మల్టీప్లెక్సులకు పోవాలి.
లేకపోతే ఓటీటీలకు పోవాలి. వీళ్లు ఆర్థిక స్తోమత సహకరించక మల్టీ ప్లెక్సులకు పోవడం లేదు. కారణం సినిమా టిక్కెట్ల రేట్లు కాదు. అక్కడ అమ్మే స్నాక్స్ రేట్లు. అవి జనాన్ని భయపెట్టేస్తున్నాయి. అలా భయపడిన సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ ఓటీటీలకు పోకుండా మధ్యలో ఐబొమ్మ వైపు ప్రయాణం అవుతున్నారు. జనాలు థియేటర్లకు రావడం లేదూ అని గగ్గోలు పెడతారు. వచ్చిన ప్రేక్షకులనేమో స్నాక్స్ రూపంలో దోచుకుంటారు. పాప్ కారన్, కూల్ డ్రింకు కలిపి ట్రే తీసుకుంటే పదిహేడు వందల వరకూ వసూలు చేస్తున్న పరిస్థితి. బైట లీటర్ మంచినీళ్ల సీసా ఇరవై రూపాయలైతే మల్టీ ప్లెక్సుల్లో అరలీటర్ అరవై రూపాయలు. ఇక్కడ అమ్మే నీళ్లు మల్టీప్లెక్స్ వారి బ్రాండే. బైట బ్రాండులు అయితే అలా అమ్మడానికి అవకాశం ఉండదు కనుక వారే అమ్ముతారు. పిల్లలతో సినిమాకు వెళ్లాలంటే మధ్య తరగతివారు బ్యాంకు లోనుకు పోవాల్సిన పరిస్థితి. దీంతో వారు సినిమా చూడాలంటే కుదిరితే ఓటీటీలో చూస్తున్నారు. లేకపోతే ఐ బొమ్మ వైపు కదులుతున్నారు. యుఎఫ్ వో క్యూబ్ లాంటి సినిమా వాహకాల సర్వర్లు హ్యాక్ చేయడం ద్వారా క్వాలిటీ సినిమాలు పైరసీదారుల చేతుల్లోకి వస్తున్నాయనేది చాలా మంది అభిప్రాయం. సరే పైరసీ ఎలా జరిగినా క్వాలిటీ కంటెంట్ సినిమా విడుదలైన ఓ రెండు గంటల్లో ఈ పైరసీ వెబ్ సైట్లలో దర్శనం ఇస్తోందనేది వాస్తవం. మల్టీప్లెక్సులకు వెళ్లలేని, ఓటీటీలకు వెళ్లాల్సిన మధ్య తరగతి దిగువ మధ్య తరగతి అంతకన్నా కింద ఉన్న ఇతర తరగతులు ఇవన్నీ కూడా పైరసీ కాంపౌండ్ లో చేరి సినిమా చూసేస్తున్నాయి.
సినిమా అద్దిరిపోయింది థియేటర్లో చూస్తే తప్ప కిక్కు రాదు లాంటి టాక్ వస్తే మాత్రమే మల్టీ ప్లెక్సులకు వెళ్లడానికి ఉత్సాహపడుతున్నారు. నిర్మాతలు అమ్ముకున్న ప్లాట్ ఫామ్స్ మీదే జనం సినిమా చూస్తే ఆ కొనుక్కున్నవాడికి డబ్బులు వస్తాయి. అలా కాక జనం ఇంకెక్కడో సినిమా చూస్తే మరి నిర్మాత దగ్గర హక్కులు కొనుక్కున్న వాళ్లకు నష్టం వస్తుంది. దీంతో నిర్మాతలు డబ్బులు వెనక్కి ఇవ్వాల్సి వస్తుంది. అందుకని చేయాల్సినదేమిటి? ఒకటి మల్టీ ప్లెక్సులను కూడా ఆడియన్ ఫ్రెండ్లీగా మార్చడం. అలా మార్చలేని పరిస్థితిలో కమ్యూనిటీ థియేటర్లను ప్రమోట్ చేయడం. అం బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వాలు కట్టి ఇస్తున్న గృహసముదాయాల్లో కమ్యూనిటీ థియేటర్ల నిర్మాణం చేయవచ్చు. అలాగే అపార్ట్ మెంట్స్ లోనూ గేటెడ్ కమ్యూనిటీల్లోనూ కూడా ఏర్పాటు చేయవచ్చు. వాంబే కాలనీల్లాంటి బడుగు బలహీన వర్గాల కాలనీల్లో క్ట కమ్యూనిటీ థిటయేర్లలో సినిమా టిక్కెట్టు ధర యాభై రూపాయలుగా నిర్ణయించి మీ ఇంట్లో వండుకున్న వస్తువులే తెచ్చి ఇక్కడ కూర్చుని తింటూ సినిమా చూడండి అని చెప్పొచ్చు.
అలాగే అపార్ట్ మెంట్లలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ థియేటర్లలో టిక్కెట్ల ధర వంద నూటయాభై చేయవచ్చు. అక్కడ కూడా వారి వారి తినుబండారాలు వారే తెచ్చుకుని వచ్చి కూర్చుని తింటూసినిమా చూసి పోతారు. గేటెడ్ కమ్యూనిటీ లాంటి రిచ్ ఏరియాల్లో రెండు వందల వరకూ టిక్కెట్ రేట్లు పెట్టి అక్కడ కూడా ఎవరి తిండి వారే తెచ్చుకుని తినండి అనొచ్చు. అలా కొత్తసినిమా నేరుగా క్యూబ్ యుఎఫ్ ఓ ల ద్వారా ఆ కమ్యూనిటీ హాళ్లకు పంపిణీ చేస్తాం. ఒక రోజు రెండు రోజుల్లో అక్కడి జనం అంతా సినిమా చూసేస్తారు. డబ్బులు వచ్చేస్తాయి. ఇంత చేసినా జనం పైరసీ అం మాత్రం అప్పుడు కొరడా పట్టుకోవడమే మార్గం. పైరసీ సినిమా చూసేవాళ్లపై కేసులు పెడతాం డ్రంక్ అండ్ డ్రైవ్ లాగా అన్నారు మొన్న హైద్రాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జన్నార్. అలా కేసులు పెట్టుకోవచ్చు. ఈ ఏర్పాట్లు చేయకుండా అరెస్టులు చేస్తాం అం మాత్రం కుదరదు. టిక్కెట్ రేట్ లో కనీసం సగానికన్నా తక్కువే స్నాక్స్ రేట్లు ఉండాలి అనే నిబంధన తీసుకురాగలిగితే మంచిదే. ఏమి ఏమైనా థియేటర్లను ఆడియన్స్ ఫ్రెండ్లీగా మార్చాలి. లేదా కమ్యూనిటీ థియేటర్ల నిర్మాణానికి కదలి ముందుకువెళ్లిపోవాలి. అది ఒక్క పైరసీని అడ్డుకునే మార్గం.
– భరద్వాజ రంగావఝల
(సీనియర్ జర్నలిస్ట్)