ధరలు దిగి రావాలి!
టూరింగ్ టాకీస్ గురించి ఈ తరంవారు ఎంతమంది విన్నారో తెలియదు. ఇవి సినిమాలు ఆడించడం కోసం తాత్కాలికంగా వేసే టెంట్లు. సర్కస్ టెంట్ల లాంటివి. వీటిని ప్రజలు సినిమాలు చూడటానికి వీలుగా వివిధ పట్టణాలు, గ్రామాలలో ఏర్పాటు చేసేవారు. క్రమేణా థియేటర్లు అంతటా పుట్టుకొచ్చాయి. వాటిని మార్నింగ్, మ్యాట్నీ, ఫస్ట్, సెకండ్ షోలు అని పిలిచే ప్రదర్శనలకు నిర్ణీత సమయాలు ఉండేవి. ఇవికాక ప్రత్యేక ప్రదర్శనలు అరుదుగా వేస్తుండేవారు. థియేటర్లలో ఎయిర్ కూల్డ్, ఎయిర్ కండిషనింగ్ సౌకర్యం ఉంటే గొప్పగా చెప్పుకునేవాళ్ళం. మొదటి 70ఎంఎం స్క్రీన్, డీలక్స్ (ఆర్‌సిసి రూఫ్) థియేటర్ మనకిప్పటికీ గుర్తున్నాయి. వాటిగురించి అపురూపంగా చెప్పుకునే వాళ్ళం. థియేటర్లలో నేల, బెంచ్, బాల్కనీ తరగతులు ఉండేవి. ఇప్పుడు తరగతి భేదాలు పోయాయి. కనీసం థియేటర్ల విషయంలో అయినా వర్గరహిత సమాజం సాధించామని దేశం గర్వపడవచ్చునేమో. అప్పట్లో సినిమా టికెట్ల ధరలు 25 పైసల నుండి 2 రూపాయల వరకు ఉండేవి. ద్రవ్యోల్బణం వల్లా లేదా ఆర్ధిక స్థోమత పెరిగే కొద్దీ ధరలు నెమ్మదిగా పెరుగుతూ వచ్చాయి.
కానీ ఇప్పుడు సాధారణ థియేటర్లలో ధరలు కనీసం రూ. 150 నుండి మల్టీప్లెక్స్‌లలో రూ. 350 వరకు ఉన్నాయి. చాలా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఒక పిక్నిక్ లాంటి అనుభవం. ఇక్కడ మొత్తం కుటుంబం వెళ్లి సినిమా చూసేది. ఆ అనుభవంలో పాప్‌కార్న్, చిప్స్ లేదా సమోసా ఉన్నాయి. అప్పుడప్పుడు బోనస్‌గా సాఫ్ట్ డ్రింక్ ఉంటుంది. ప్రజలు ఈ కొద్దిపాటి డబ్బును ఏ మాత్రం బాధపడకుండా ఇష్టపూర్వకంగా ఖర్చు చేసేవారు. ఇప్పుడు పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. నలుగురు సభ్యుల కుటుంబం వేలల్లో ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంటేనే ఈ అనుభవాన్ని పొందగలదు. థియేటర్లలో అమ్మే వస్తువుల ధరలను విక్రయదారులు ఏకపక్షంగా నిర్ణయించేస్తారు. ఎన్ని కేసులు పెట్టినా, ప్రభుత్వ శాఖలు థియేటర్లలో తినుబండారాలను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే అమ్మాలని ఆదేశాలు జారీ అయినప్పటికీ అమలుకు మాత్రం నోచుకోవు. ఇటువంటి ఉల్లంఘనల మీద అధికారులు చర్యలు తీసుకోవడం ఎప్పుడయినా చూసామా?
కలర్ టీవీలు, వీసీఆర్లతో సాంకేతికత ప్రజలకు చేరువైనప్పుడు వీడియో లైబ్రరీలు తామరతంపరగా పుట్టుకొచ్చాయి. అవి కనుమరుగైపోయిన దశలో పైరసీ అనేది వచ్చింది. థియేటర్లలో దొంగచాటుగా కెమెరాలతో సినిమాలను రికార్డు చేసి బయట అమ్ముకోవడం మొదలయింది. ఎక్కువ డబ్బు ఖర్చు చేయలేని లేదా ఇష్టపడని వ్యక్తులు సినిమాలు చూడటానికి ఈ మార్గాన్ని ఉపయోగించారు. సిడీ ప్లేయర్లు, ఇంటర్నెట్, ల్యాప్‌టాప్‌లు చివరికి స్మార్ట్‌ఫోన్‌ల దాకా ఈ టెక్నిక్ మరింత అభివృద్ధి చెందింది. ఈ టెక్నాలజీతోపాటు పైరసీ కూడా అభివృద్ధి చెందింది. ఇటీవలి ఐ బొమ్మ కేసు సినీ ప్రియులను మాత్రమే కాకుండా మొత్తం సమాజం దృష్టినే ఆకర్షించింది. సమాజం, ముఖ్యంగా సోషల్ మీడియా రవికి మద్దతుగా, వ్యతిరేకంగా రెండుగా చీలిపోయింది. టీవీ, ఓటీటీలు, ప్రత్యేక ప్రదర్శనలు, ప్రీమియర్ ఈవెంట్లు, పాటల విడుదల మొదలైనవాటి ద్వారా ఇప్పుడు డబ్బు సంపాదిస్తున్న సినిమా పరిశ్రమ మళ్ళీ పాత రోజుల్లో మాదిరిగా కుటుంబం ఆటవిడుపుగా థియేటర్లకు వెళ్ళగలిగే పరిస్థితిని తీసుకురావాలి.
అలా మార్చడం ద్వారా పాత సినిమా అనుభవాన్ని పునరుద్ధరించడానికి కలిసిరావాలి. అందరూ ఆర్థ్ధిక ప్రయోజనం పొందే సహేతుకమైన ఆదాయ భాగస్వామ్య నమూనాను గురించి ఆలోచించాలి. ఒక చిన్న బడ్జెట్ సినిమా బ్లాక్‌బస్టర్‌గా మారుతుందంటే, అన్ని వినోద అంశాలతో కూడిన సినిమాలను వీక్షకులు ఎల్లప్పుడూ అభినందిస్తారనే కదా అర్ధం. కాబట్టి మంచి సినిమా నిర్మించే సృజనాత్మకతతోబాటు దాన్ని జనబాహుళ్యంలోకి ఈ పద్ధతుల్లో తీసుకుపోయే ఐ బొమ్మ వంటి చాతుర్యాలు రెండూ ఉన్నాయి మన సమాజంలో. సినిమాను వినోద మాధ్యమంగా మాత్రమే కాకుండా దాని సందేశం ద్వారా సమాజానికి సేవ చేయడానికి కూడా ఉమ్మడి కృషి జరగాలి.
– గోపిరెడ్డి మధుసూదన్ రెడ్డి
(ఇండిపెండెంట్ జర్నలిస్ట్)