‘అఖండ’ మూడో భాగం కూడా వచ్చేస్తోంది.. టైటిల్ ఏంటంటే..
హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో 2021లో విడుదలైన ‘అఖండ’ చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ చిత్రానికి సీక్వెల్‌గా ‘అఖండ-2: తాండవం’ సినిమా శుక్రవారం విడుదలైంది. నిజానికి ఈ చిత్రం గత వారమే విడుదల కావాల్సింది. కానీ, ఆర్థిక ఇబ్బందుల కారణంగా సినిమా రిలీజ్‌ని వాయిదా వేశారు. కాగా, శుక్రవారం విడుదలైన ఈ సినిమాకి మంచి హిట్ టాక్ వచ్చింది. థియేటర్లలో బాలకృష్ణ అభిమానుల సందడి ఆకాశాన్ని తాకుతోంది. ముఖ్యంగా తమన్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే ఈ సినిమా చివర్లో అఖండ మూడో భాగం కూడా ఉంటుందని ప్రకటించారు. ‘జై అఖండ’ అనే టైటిల్‌తో మూడో భాగం రానుందని రెండో భాగం చివర్లో తెలిపారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి తొలి రెండు భాగాల్లాగా మూడో భాగం కూడా సూపర్ హిట్ అవుతుందో లేదో చూడాలి.