టికెట్ ధరలను పెంచి పేదలపై భారం మోపలేం: మంత్రి కోమటిరెడ్డి
రాష్ట్రంలో ఇకపై ఏ సినిమా టికెట్ ధరలు పెంచే ప్రసక్తే లేదని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. ‘అఖండ-2’ సినిమా టికెట్ల పెంపు వివాదం నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. భవిష్యత్‌లో టికెట్ రేట్లు పెంచాలని కోరుతూ నిర్మాతలు, దర్శకులు ఎవరూ తన వద్దకు రావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తమది పేదల కోసం పనిచేసే ఇందిరమ్మ ప్రభుత్వమని, సామాన్యుడికి అందుబాటులో ఉండేలా నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ‘హీరోలకు వందల కోట్ల రూపాయల రెమ్యునరేషన్లు ఇచ్చి, ఆ భారాన్ని పేదలపై మోపడం సరికాదన్నారు. టికెట్ ధరలు పెంచాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేవడాన్ని అంగీకరించమని కోమటిరెడ్డి పేర్కొన్నారు.
సామాన్య కుటుంబం థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలంటే ధరలు అందుబాటులో ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈసారి ‘అఖండ-2’ విషయంలో పొరపాటు జరిగిందని, భవిష్యత్‌లో ఇది పునరావృతం కాదని ఆయన వ్యాఖ్యానించారు. అంతకుముందు, నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘అఖండ-2’ సినిమా టికెట్ రేట్ల పెంపు, ప్రత్యేక షోలకు అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సింగిల్ బెంచ్ రద్దు చేసింది. అయితే, ఈ తీర్పును సవాలు చేయగా, డివిజనల్ బెంచ్ నేడు సింగిల్ బెంచ్ ఉత్తర్వులను కొట్టివేసింది. దీంతో ‘అఖండ-2’ సినిమాకు పెంచిన టికెట్ ధరలు రాష్ట్రవ్యాప్తంగా యధావిధిగా అమల్లో ఉండనున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే మంత్రి కోమటిరెడ్డి భవిష్యత్ విధానంపై స్పష్టత ఇచ్చారు.