సింగరేణి కార్యాలయం ముట్టడికి బిజెపి యత్నం
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మెస్సీతో ఫుట్ బాల్ ఆడేందుకు వంద కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని సింగరేణి కార్యాలయం ముట్టడించేందుకు బిజెపి నాయకులు, కార్యకర్తలు చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. బిజెపి శాసనసభాపక్షం నాయకుడు ఏలేటి మహేశ్శర్ రెడ్డి నాయకత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున లక్‌డీకాపూల్ లోని సింగరేణి భవనం వద్దకు చేరుకున్నారు. అయితే సింగరేణి భవనం చుట్టూ పోలీసులు వలయాకారంగా నిలబడి వారిని ముందుకు రానీయకుండా అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులుకు కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. చివరకు ఏలేటి మహేశ్వర్ రెడ్డిని పోలీసులు చుట్టుముట్టి అరెస్టు చేసి పోలీసు వాహనం ఎక్కించారు. ఈ సమయంలో ఏలేటిని అరెస్టు చేయకుండా కార్యకర్తలు ప్రయత్నించగా, పోలీసులు వారిని అరెస్టు చేసి వాహనం ఎక్కించి బేగంబజార్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.
ఎవడబ్బ సొమ్ము: ఏలేటి మండిపాటు
ఇదిలాఉండగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎవడబ్బ సొమ్మని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఫుట్ బాల్ సరదా కోసం వంద కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రజాధనంతో ఫుట్ బాల్ ఆడుకుంటున్న ముఖ్యమంఅతి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే ప్రజలు ఆయనను ఫుట్ బాల్ ఆడుకుంటారని ఆయన ధ్వజమెత్తారు. సిఎం రేవంత్ రెడ్డి టీంను సింగరేణి స్పాన్సర్ చేస్తున్నదని తెలిసి సింగరేణి భవన్ ముందు ధర్నా చేసేందుకు వచ్చామని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు. సిఎం ఫుట్ బాల్ సరదా కోసం వంద కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ప్రజాధనం దుర్వినియోగం కాదా?
అని ఏలేటి ఎదురు ప్రశ్నించారు. ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో మెస్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడడానికి ప్రభుత్వం ఎన్ని కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమైందో, ఇంకా ఏయే శాఖల నుంచి ఎంత విడుదల చేసిందో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇవే డబ్బులను సింగరేణిలో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వినియోగిస్తే బాగుంటుందని ఆయన సూచించారు. గతంలో బిఆర్‌ఎస్ ఈ-కార్ రేసింగ్ నిర్వహించి ప్రజాధనం దుర్వినియోగం చేసినట్లు కాంస్ ప్రభుత్వుం ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నదని ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు.