స్పష్టమైన విధివిధానాలతో ముందుకెళ్తున్నాం: సిఎం రేవంత్
హైదరాబాద్: ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిందని.. రెండేళ్లలో కొన్ని విజయాలు సాధించాం.. ప్రణాళికలు రూపొందించుకున్నాం అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. సచివాలయంలో అన్ని విభాగాల కార్యదర్శులతో సిఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సమావేశానికి సిఎస్ రామకృష్ణారావు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. గతంలో ఎనర్జీ, ఎడ్యుకేషన్, ఇరిగేషన్, హెల్త్ పాలసీలు లేవని అన్నారు. అందువల్ల అనేక సమస్యలు వచ్చాయని పేర్కొన్నారు. ముఖ్యమైన విభాగాలకు పాలసీలు తీసుకొచ్చామని తెలిపారు. తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ విడుదల చేశామని అన్నారు.
రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్‌గా విభజించి ప్రణాళికలు రూపొందిస్తున్నామని సిఎం తెలిపారు. స్పష్టమైన విధి విధానాలతో ముందుకెళ్తున్నామని.. గొప్ప కార్యాచరణ అమలుకు అధికారుల సహకారం ఉండాలని అన్నారు. అధికారులు జవాబుదారీతనంతో పని చేయాలని సూచించారు. ప్రతి నెల కార్యదర్శుల పని తీరుపై సిఎస్ సమీక్ష నిర్వహిస్తారని.. ప్రతి నెల కార్యదర్శులు.. సిఎస్‌కు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ప్రతి 3 నెలలకోసారి కార్యదర్శుల పని తీరుపై తానే స్వయంగా సమీక్షిస్తానని అన్నారు. అధికారులు సమన్వయం చేసుకొని పని చేయడం కీలకమని.. అభివృద్ధి విషయంలో సమన్వయం కోసం మెకానిజం ఉండాలని తెలిపారు.