ఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే లోక్ సభ వాయిదాపడింది. లోక్ సభలో సిఐఆర్, ఢిల్లీ పేలుడుపై చర్చ జరపాలని కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. లోక్‌సభలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. విపక్షాల ఆందోళనతో లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలి రోజే మాటల యుద్ధం జరిగింది. విపక్షాలు బీహార్ ఓటమితో నిరాశలో ఉన్నాయని ప్రధాని మోడీ విమర్శించారు. బీహార్ వైఫల్యానికి పార్లమెంట్ను వేదికగా చేసుకోవద్దని, విపక్షాల డ్రామాలను దేశ ప్రజలు నమ్మడం లేదని ప్రధాని మోడీ ప్రతిపక్షాలకు చురకలంటించారు. ప్రధాని మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ మండిపడ్డారు. ప్రజా సమస్యలు ప్రస్తావించడం డ్రామానా?, కీలకమైన అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని, చర్చలు జరగకుండా డ్రామాలు ఆడేది మోడీ ప్రభుత్వమేనని ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజ్యసభ ఛైర్మన్ సిపి రాధాకృష్ణన్కు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. పెద్దల సభ గౌరవాన్ని కాపాడేలా సభ్యులు వ్యవహరించాలని, రాధాకృష్ణన్ సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చారని, రాధాకృష్ణన్ జీవితాన్ని ప్రజాసేవకేఅంకితం చేశారని ప్రశంసించారు. తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్గా రాధాకృష్ణన్ పని చేశారని, అనుభవం అనేది సభకు ఉపయోగపడుతుందని భావిస్తున్నామని మోడీ పేర్కొన్నారు.