హెచ్ ఎన్ జి సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై ఉదయ్ శర్మ రచన దర్శకత్వంలో మహదేవ్ గౌడ్, నాగరత్న నిర్మాతలుగా డిసెంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం సఃకుటుంబానాం. రామ్ కిరణ్, మేఘ ఆకాష్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో నటకిరీటి రాజేంద్రప్రసాద్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్, సత్య, రాజశ్రీ నాయర్, రచ్చ రవి, గిరిధర్, తాగుబోతు రమేష్, భద్రం తదితరులు కీలకపాత్రలో పోషిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సనా చేతుల మీదగా సఃకుటుంబానాం చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బుచ్చిబాబు సనా మాట్లాడుతూ సఃకుటుంబానాం చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ… ‘సఃకుటుంబానాం వంటి కథ 48 సంవత్సరాలలో నేను ఎప్పుడూ వినలేదు, చేయలేదు. ఈ సినిమా అంత ప్రత్యేకంగా ఉండబోతుంది. ఒక మనిషికి కుటుంబం ఎంత అవసరం అనేది తెలియజేస్తూ, కుటుంబ నేపథ్యంలో కుటుంబ గొప్పతనాన్ని, ప్రాముఖ్యతను తెలుపుతూ రానున్న చిత్రం సఃకుటుంబానాం. కచ్చితంగా ఈ చిత్రం ప్రేక్షకులు అందరికీ నచ్చుతుంది‘ అని తెలిపారు. బ్రహ్మానందం మాట్లాడుతూ ఈ సినిమాలో నా పాత్ర చాలా చిత్రంగా ఉండబోతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో నిర్మాత మహదేవ్ గౌడ్, దర్శకుడు ఉదయ్ శర్మ, హీరో రామ్ కిరణ్ పాల్గొన్నారు.