ఢిల్లీ: ప్రజాస్వామ్య దేశంలో అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. దేశాభివృద్ధి మాత్రమే తమ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఈ సమావేశాల్లో 10 బిల్లులను, కాలం చెల్లిన 120 రద్దు చేసే బిల్లు కూడా పార్లమెంటు సభ ముందుకు కేంద్రం తీసుకరానుంది. కాసేపట్లో పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పార్లమెంటు సమావేశాలకు ముందు మోడీ మీడియాతో మాట్లాడుతూ.. ఈ సమావేశాల్లో అన్ని అంశాలపై సానుకూల చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నానని, చట్టసభల్లో సమయానుకూలంగా చర్చలు తప్పని సరి అని తెలియజేశారు. వికసిత్ భారత్ లక్ష్యం సాధించేందుకు ప్రయత్నిస్తున్నానని, దేశ ప్రగతి కోసం పార్లమెంటులో మంచి చర్చలు కొనసాగాలని అన్నారు. దేశాభివృద్ధి కోసం విపక్షాలు కూడా తమతో కలిసి రావాలని, పరాజయం కూడా ఒప్పుకునే మనసు విపక్షానికి లేదని చురకలంటించారు. తాము మాత్రం విపక్షాలను కలుపుకొని ముందుకెళ్తామని, దేశప్రగతి కోసం మంచి సూచనలు, సలహాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. కొత్త ఎంపిలకు స్ఫూర్తి కలిగించేలా మన ప్రవర్తన ఉండాలని, చట్ట సభల్లో డ్రామాలు వద్దు అని, మంచి చర్చలు జరగాలని మోడీ పేర్కొన్నారు. నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలకు అడ్డు తగలవద్దని కోరుతున్నానని, జిఎస్టి సంస్కరణల తర్వాత ప్రజలు సంతోషంగా ఉన్నారని మోడీ స్పష్టం చేశారు.