తెలంగాణ భవిష్యత్‌కు మూడంచెల అభివృద్ధి విజన్
4 లక్షల మందితో ప్రజాభిప్రాయ సేకరణ
ఐఎస్‌బి, నీతి ఆయోగ్ సంస్థల సహకారంలో డాక్యుమెంట్ రూపకల్పన
విజన్..స్ట్రాటజీ ప్రాతిపదికన భవిష్యత్ ప్రణాళిక
రోడ్‌మ్యాప్ సిద్ధం..జాతికి పాలసీ అంకితం
ప్రజాభవన్‌లో వార్ రూమ్ ఏర్పాటు
ఆర్థిక రాష్ట్రంగా నిలదొక్కుకునేలా విజన్ డాక్యుమెంట్ తయారీ
2034 నాటికి 1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దుతాం
2047 నాటికి 3 ట్రిలియన్ల డాలర్ల ఎకనమీ లక్షం
దేశంలో తెలంగాణ వాటా 10 శాతానికి పెంచేలా ప్రణాళిక
రోల్‌మోడల్‌గా చైనా, జపాన్, జర్మనీ, సింగపూర్, సౌత్ కొరియా
డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సు –
డిసెంబర్ 9న విజన్ డాక్యుమెంట్ విడుదల
తెలంగాణ రైజింగ్ 2047లో పాలసీ డాక్యుమెంట్‌ను ప్రకటిస్తాం
విలేకర్ల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ భవిష్యత్ అభివృద్ధికి 2047కు సంబంధించి మూడంచెల ప్రణాళికను రూపొందించినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ఇందుకోసం కొత్తగా కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ( క్యూర్), పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ(ప్యూర్), రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ (రేర్) గా విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేసినట్టు చెప్పారు. ఆదివారం సాయంత్రం సచివాలయంలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రికను సీఎం మంత్రివర్గ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మూడు అంశాలతో తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్‌ను తయారు చేస్తున్నామన్నారు. పాలసీ/స్ట్రాటజీ ప్రాతిపదికన ఈ డాక్యుమెంట్‌ను రూపొందించామని చెప్పారు. రాష్ట్రాన్ని సమగ్ర సమీకృత అభివృద్ధి దిశగా పయనింపచేసి ఆదాయం పెంచి పేదలకు పంచడమే లక్షంగా బలమైన ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తయారు చేస్తున్నామని వివరించారు.
ప్రణాళికబద్ధమైన అభివృద్ధికి పారదర్శక పాలసీలు ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పాలసీలకు పెరాలసిస్ వస్తే పెట్టుబడులకు రక్షణ లేకుండా పోతుందన్నారు. విజన్ డాక్యుమెంట్‌లో లక్షలాది మందిని భాగస్వాములను చేస్తున్నట్లు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌లో 4 రకాలుగా స్థానిక సంస్థల పాలన జరిగేదని,. దీంతో తెలంగాణను 3 విభాగాలుగా విభజించుకున్నట్లు తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతాలపై ప్రణాళికబద్ధమైన అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నగరం ఓఆర్‌ఆర్ వరకు కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీగా , ఓఆర్‌ఆర్ నుంచి త్రిబుల్ ఆర్ వరకు పెరీ అర్బన్ రీజియన్ ఎకనామీగా, త్రిబుల్ ఆర్ నుంచి తెలంగాణ సరిహద్దు వరకు రూరల్ అగ్రికల్చర్ ఎకానమీ రీజియన్‌గా మూడంచెల వ్యవస్థగా అభివృద్ధి పరచనున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా నెట్ జీరో సిటీ, కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్‌ను మార్చాలని ఆయన పేర్కొన్నారు. కోర్ అర్బన్ రీజియన్‌లో సంక్షోభాల నివారణకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ కింద (క్యూర్) : వాహనాల కాలుష్యం తగ్గించడం, నెట్ జీరో సిటీగా కాలుష్య రహిత నగరంగా మార్చాలంటే క్యూర్ చేయాల్సిందే అని రేవంత్ రెడ్డి చెప్పారు. కోర్ అర్బన్ రీజియన్‌లో పారదర్శకమైన నిర్ణయాల ద్వారా భవిష్యత్‌లో సంక్షోభాలను అధిగమించేలా 2170 చదరపు సర్వీస్ సెక్టార్‌గా మారుస్తున్నామని చెప్పారు. కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలను బయటలకు తరలించడంతోపాటు కుంటలు, నాలాలను ప్రక్షాళన చేయడం ద్వారా మెట్రో విస్తరణ, మూసీ రివర్ డెవలప్‌మెంట్ పై ప్రణాళిక తయారు చేసుకున్నామన్నారు. 162 కిలోమీటర్ల ఔటర్ రింగ్‌రోడ్ అవతల రీజనల్ రింగ్ రోడ్లును 360 కిలోమీటర్లతో రెండో మణిహారంగా తయారు చేసుకుంటున్నాం
పెరీ అర్బన్ రీజియన్ ఎకనామీ (ప్యూర్) : భారత్ ఫ్యూచర్ సిటీ, రేడియల్ రోడ్లు, మెట్రో విస్తరణ ఇలా పెరీ అర్బన్ రీజియన్ అకానమీ తయారవుతోందని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. అమరావతి నుంచి చెన్నై వరకు గ్రీన్‌ఫీల్డ్ రోడ్లు, బుల్లెట్ రైళ్ల ద్వారా రవాణాను సులభతరం చేస్తున్నామని చెప్పారు. మచిలీపట్నం పోర్టుకు కూడా కనెక్టివిటీ తీసుకువస్తున్నామని, పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా మరింత అభివృద్ధి చెందుతామన్నారు. అదనంగా నాలుగు ఎయిర్‌పోర్టులు అందుబాటులోకి తీసుకురానున్నామని, సులభతరమైన రవాణా కోసం వరంగల్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, రామగుండంలో కొత్త విమానాశ్రయాలు నిర్మాణం కానున్నాయని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి బుల్లెట్ రైళ్లు తీసుకువస్తున్నామని, వస్తువుల రవాణాకు సముద్ర మార్గం అవసరం కావడంతో మచిలీపట్నంకు గ్రీన్‌ఫీల్డ్ డెడికేటెడ్ హైవే నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని, పెరీ అర్బన్ మాన్యుఫాక్చరింగ్ జోన్ లో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచనున్నట్లు వివరించారు.
రూరల్ అగ్రికల్చర్ ఎకానమీ రీజియన్ (రేర్) :
వ్యవసాయాన్ని, గ్రామీణ ప్రాంతాలను, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను నిర్లక్షం చేయకుండా రూరల్ అగ్రికల్చర్ ఎకానమీ రీజియన్ తీసుకురానున్నట్లు చెప్పారు. అగ్రికల్చర్ పార్కులు, పండ్లు, కూరగాయల పరిశ్రమలతో పాటు మన భూములు విత్తనాలను ఉత్పత్తి చేయడానికి అనుకూలమైన ప్రాంతం అని, సేంద్రీయ వ్యవసాయ భూములు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. మూడు రకాల వ్యవస్థలను, ప్రణాళికలను క్రోడీకరించి విజన్ డాక్యుమెంట్ తీసుకురానున్నామని వివరించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేస్తున్నామని, ఆదాయం పెంచి పేదలకు పంచేలా నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నామన్నారు. ఎడ్యుకేషన్, ఇరిగేషన్‌లో జవహర్‌లాల్ నెహ్రూ తీసుకువచ్చిన పాలసీల ద్వారా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ముందున్నామన్నారు. ప్రజలకు ఇవ్వాల్సిన ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందించలేకున్నామని, ప్రజలకు న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.
విద్య తండాలకు కూడా చేరినా సాంకేతిక పరమైన, నాణ్యమైన విద్యను ఇవ్వాలని చూస్తున్నామన్నారు. సింగిల్ టీచర్ స్కూల్ నుంచి మహానగరం వరకు విద్యావ్యవస్థలో ప్రణాళికలు తీసుకువచ్చి నాలెడ్జ్ హబ్‌గా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించాం. తద్వారా పెట్టుబడులు వచ్చేందుకు అవకాశం ఉంటుందని, ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగు పరుస్తామని స్పష్టం చేశారు. దేశం వందేళ్ల ఉత్సవాలు జరుపుకునేలాగా భవిష్యత్‌లో తెలంగాణలో 10 శాతానికి పెరిగేలా ఫ్యూచరిస్టిక్ పాలసీ రూపొందింమన్నారు. దార్శనికతే భవిష్యత్ ప్రణాళికలు అని, తెలంగాణను బలమైన ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు ముందుకు వెళుతున్నామని చెప్పారు. ఆరోగ్యవంతమైన తెలంగాణ అందించాలని నిర్ణయించామని, ఉత్సవాల్లో అతిధులకు భవిష్యత్ ప్రణాళికలు వివరిస్తామన్నారు. ఉత్సవాల నిర్వహణ కోసం ప్రజాభవన్‌లో వార్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. తమకు రోల్ మోడల్ చైనా, జపాన్, జర్మనీ, సౌత్ కొరియా, సింగపూర్ అని, వాటినే ఆదర్శంగా తీసుకుంటున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు తమకు పోటీ కాదని, ప్రపంచ దేశాలతో పోటీ పడనున్నామని, వారితో పోటీ పడి ఆయా దేశాలనుంచి పెట్టుబడులను ఆకర్షిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌కు కేంద్రం అంగీకారం :
హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వరకు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే కోసం కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని అన్నారు. హైవేలు, పోర్టులు, ఎయిర్‌పోర్టు కనెక్టివిటీ ద్వారా పెట్టుబడులను ఆకర్షించనున్నట్లు తెలిపారు. తెలంగాణ అభివృద్ధిలో రైతులను భాగస్వాములను చేస్తామని చెప్పారు. అభివృద్ధి చెందిన రాష్ట్రంగా రూపొందించడమే తమ లక్షమన్నారు. అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలను భవిష్యత్ ప్రణాళికగా మార్చుకుని అభివృద్ధి చెందిన రాష్ట్రంగా అందించాలన్న ఆలోచనతో భవిష్యత్ కోసం పారదర్శకమైన పాలసీలు తీసుకువచ్చి జాతికి అంకితం చేయబోతున్నామని చెప్పారు. ఇందుకుగాను ప్రపంచ దేశాల్లో ఉన్న దిగ్గజ కంపెనీలను, సాంకేతిక నిపుణులను, మన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడంతో పాటు బలమైన ఆర్థిక రాష్ట్రంగా నిలదొక్కుకునేలా ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు.
రాష్ట్ర భవిష్యత్‌కు నష్టం జరగకుండా విజన్ డాక్యుమెంట్‌లో లక్షలాదిమందిని భాగస్వాములను చేశామని వివరించారు. ఐఎస్‌బి, నీతి ఆయోగ్ సహకారం తీసుకుని పాలసీ డాక్యుమెంట్‌ను తయారు చేస్తున్నామని, చాలా నిశితంగా ప్రతి అంశాన్ని విశ్లేషించి భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామని తెలిపారు. హైదరాబాద్‌కు మణిహారంగా ఔటర్ రింగ్ రోడ్డు ఉందని, అంతర్జాతీయ విమానాశ్రయాన్ని గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభించుకున్నామని గుర్తు చేశారు. గతంలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉండడంతో అభివృద్ధిలో అనేక సమస్యలు ఎదురయ్యాయని, వీటన్నింటినీ ఒక తాటిపైకి తీసుకురావడం ద్వారా కొత్త నగరం నిర్మాణమవుతుందని స్పష్టం చేశారు.
ఇదీ ప్రభుత్వ కార్యాచరణ
* నేడు, రేపు రైజింగ్ విజన్ డాక్యుంట్‌పై మంత్రులు, సంబంధిత విభాగాల అధికారులు తమ శాఖల పరిధిలోని ప్రతి అంశాన్ని చర్చించి క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి.
* 2వ తేదీ రాత్రికి నివేదక సమర్పించాలి.
* 3,4 తేదీల్లో అన్ని శాఖలు ఇచ్చిన నివేదికలను సీఎస్, స్పెషల్ సీఎం, సిఎంఓ అధికారులు పరిశీలించి అవసరమైన మార్పులు, చేర్పులు చేసి తుది ప్రతి సిద్ధం చేయాలి.
* 6వ తేదీ సాయంత్రం వరకు తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ సంపూర్ణంగా సిద్ధం కావాలి.
* అన్ని విభాగాల అధికారులు తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ రూపకల్పన కోసం పూర్తి సమయం కేటాయించాలి
* గ్లోబల్ సదస్సు ఏర్పాట్ల నిర్వహణలో శాఖల మధ్య సమన్వయం ఉండాలి.