రామ్‌చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘పెద్ది’. ఈ చిత్రంపై రామ్‌చరణ్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ చిత్రం రూపొందుతోంది. కొన్ని నెలల క్రితం వచ్చిన పెద్ది ఫస్ట్ షాట్ నుంచి ఈ మధ్యే వచ్చిన ‘చికిరి చికిరి’ అంటూ సాగే తొలి సింగిల్ వరకూ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ని సొంతం చేసుకున్నాయి. అయితే విడుదలకు ముందే పెద్దికి వచ్చిన బజ్‌తో పలు ఒటిటి సంస్థలు దీని డిజిటల్ రైట్స్ కోసం పోటీ పడుతున్నాయి.
ముఖ్యంగా రెండు ప్రముఖ ఒటిటి సంస్థలు ఈ పోటీలో ఉన్నాయి. అందులో నెట్‌ఫ్లిక్స్ సంస్థకు రైట్స్ దక్కినట్లు సమాచారం. దాదాపు రూ.130 కోట్లతో పెద్ది డిజిటల్ రైట్స్‌ని నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అన్ని భాషలకు గాను ఈ మొత్తాన్ని చెల్లించనుందట. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో స్పోర్ట్స్ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో చరణ్‌కి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుండగా.. కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దివ్యేందు శర్మ, జగపతి బాబు తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది.