రాంచీ: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జెఎస్‌సిఎ స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత బ్యాటర్లు రాణించారు. ముఖ్యంగా కింగ్ విరాట్ కోహ్లీ సెంచరీతో కదంతొక్కాడు. రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్‌లు అర్థశతకాలు సాధించారు. దీంతో సౌతాఫ్రికాకు 350 పరుగుల భారీ లక్ష్యాన్ని ముందుంచారు. ఈ మ్యాచ్‌లో 25 పరుగుల వద్దే తొలి వికెట్ కోల్పోయిన భారత్‌కి రోహిత్, కోహ్లీల జోడీ అండగా నిలిచింది. వీరిద్దరు కలిసి రెండో వికెట్‌కి 136 పరుగులు జోడించారు. ఆ క్రమంలో ఇరువురు అర్థశతకాలు సాధించారు. అంతేకాక.. ఈ మ్యాచ్‌లో మూడు సిక్సులు కొట్టిన రోహిత్ అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక సిక్సులు(351) కొట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
ఆ తర్వాత రోహిత్(57) ఔట్ కావడంతో క్రీజ్‌లోకి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్(8), వాషింగ్టన్ సుందర్(13) ఎక్కువ సేపు నిలదొక్కుకోలేకపోయారు. కానీ, విరాట్ మాత్రం పట్టువదలకుండా బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో అతడు తన వన్డే కెరీర్‌లో 52వ శతకం సాధించాడు. దూకుడుగా ఆడే క్రమంలో విరాట్(132) కూడా ఔట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో కెప్టెన్ కెఎల్ రాహుల్ స్కోర్ పెంచే ప్రయత్నం చేశాడు. మరోవైపు రవీంద్ర జడేజా కూడా అతడికి సహకారం అందించాడు. రాహుల్(60) అర్థ శతకం సాధించి ఔట్ కాగా.. జడేజా(32) ఆఖరి వరకూ పోరాడాడు. చివరి ఓవర్‌లో వరుసగా జడేజా, అర్ష్‌దీప్‌లు పెవిలియన్ చేరారు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల కోల్పోయి 349 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలింగ్‌లో యాన్సన్, బర్గర్, బోష్, బార్ట్‌మన్ తలా రెండు వికెట్లు తీశారు.