రాంచీ: సౌతాఫ్రికాతో జెఎస్‌సిఎ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో కోహ్లీ అద్భుతమైన ఫామ్‌తో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కి దిగిన భారత్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. ఈ క్రమంలో కోహ్లీ సెంచరీతో కదంతొక్కాడు. తన వన్డే కెరీర్‌లో 52వ శతకాన్ని సాధించాడు. తొలుత రోహిత్ శర్మతో కలిసి కోహ్లీ 136 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఈ క్రమంలో రోహిత్ కూడా అర్థ శతకం సాధించాడు. అయితే ఆ తర్వాత కొంత సమయానికే రోహిత్(57) ఔట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్(8) స్వల్పస్కోర్‌కే పెవిలియన్ చేరాడు. అనంతరం వాషింగ్టన్ సుందర్ కూడా 13 పరుగులు చేసి వెనుదిరిగాడు. ప్రస్తుతం కెప్టెన్ కెఎల్ రాహుల్‌తో కలిసి కోహ్లీ 54 పరుగుల భాగస్వామ్యంతో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో అత్యధిక సెంచరీలు సాధించి మరోసారి తాను కింగ్ కోహ్లీ అనిపించుకున్నాడు. ప్రస్తుతం 40 ఓవర్లు ముగిసేసరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. క్రీజ్‌లో కోహ్లీ (132), రాహుల్ (19) ఉన్నారు.