అమరావతి: కూటమి పాలనలో రైతన్నలను పట్టించుకోవడం లేదని వైసిపి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రైతుల తరపున వైఎస్ఆర్ సిపి నేతలు మాట్లాడితే.. రాజకీయాలు చేస్తున్నారంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతు సమస్యలను పట్టించుకోకుండా కేంద్రానికి లేఖలు రాస్తే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. మార్క్ ఫెడ్ ద్వారా మొక్క జొన్న ఎందుకు కొనుగోలు చేయలేదని, బడా బాబుల గురించే బాబు ఆలోచిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు భూములు రియల్ ఎస్టేట్ కు కట్టబెడుతున్నారని, ప్రజల ఆస్తులను, ప్రజాధనాన్ని కారు చౌకగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. ప్రజలు మంచి చేస్తారని అధికారమిస్తే.. కూటమి పాలకులు దోపిడీకి పాల్పడుతున్నారని, ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన కూటమి పాలకులకు లేదని ధ్వజమెత్తారు.
18 నెలల్లో కూటమి పాలకులు ప్రజలకు చేసిన మేలు ఏంటీ? అని రైతులకు సహాయం ఎప్పుడు చేస్తారో కూటమి పాలకులు చెప్పాలి? అని ప్రశ్నించారు. కూటమి పాలనలో పథకాలు పేదవాళ్ల దగ్గరకు వెళ్లడం లేదని, వైఎస్ఆర్ సిపి చరిత్రలో నిలిచిపోయే పాలనా సంస్కరణలు తెచ్చిందని, గ్రామాల్లో గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చింది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వమని కొనియాడారు. పథకాల పేర్లు మార్చడానికి కూటమి అధికారంలోకి వచ్చినట్లుందని, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడమేంటీ? అని నిలదీశారు. కూటమి ప్రభుత్వం పాలనలో వైఫల్యం చెందిందని ఎద్దేవా చేశారు. మంత్రులు, అధికారులు, సహచరుల మీద కూడా చంద్రబాబుకు నమ్మకం లేదని అన్నారు. గిరిజన విద్యార్థులకు సరైన పోషకాహారం అందక ప్రాణాలు కోల్పోతున్నారని బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.