సమరోత్సాహంతో దక్షిణాఫ్రికా.. నేడు తొలి వన్డే
రాంచీ: వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్‌లో భాగంగా ఇటీవలె ముగిసిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఘోర పరాజయంపాలై క్లీన్‌స్వీప్‌కు గురైన టీమిండియా మరో సిరీస్‌కు సన్నద్ధమైంది. వన్డే ఫార్మాట్లో విజయంతో దక్షిణాఫ్రికాపై ప్రతికారం తీర్చుకోవాలని బరిలోకి దిగుతోంది.సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ జట్టులోకి రావడంతో వన్డే సిరీస్‌లో గెలుస్తామనే థీమాతో పోరుకు సిద్ధమవుతోంది. ఇక అంతకుముందు ఆస్ట్రేలియా గడ్డపై ఆఖరి వన్డేలో దంచేసిన రోకో ఇప్పుడు స్వదేశంలోనూ సత్తా చాటితే సిరీస్ గెలవడంతో సందేహమే లేదు. ఆదివారం జరుగబోయే తొలి వన్డే కోసం విరాట్ సుదీర్ఘ సమయం నెట్స్‌లో చెమటోడ్చాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధిస్తే అత్యధిక సెంచరీలతో సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ‘ఆల్‌టైమ్ రికార్డు’ను కోహ్లీ అధిగమించనున్నాడు.
ఆసీస్ పర్యటనలో రెండు డకౌట్ల తర్వాత ఆఖరి వన్డేలో అజేయ అర్ధ శతకం బాదిన కోహ్లీ.. ఇప్పుడు స్వదేశంలో చెలరేగిపోవాలనే పట్టుదలతో ఉన్నాడు. రెండేళ్ల క్రితం వన్డే ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్‌పై సూపర్ సెంచరీతో సచిన్ టెండూల్కర్ రికార్డు (49 శతకాలను) సమం చేసిన కోహ్లీ.. దక్షిణాఫ్రికాపై అలాంటి భారీ ఇన్నింగ్స్ ఆడాలని భారత క్రికెట్ కోరుకుంటోంది. సొంతగడ్డపై కోహ్లీ ఈ ఏడాది ఫిబ్రవరిలో చివరి వన్డే ఆడాడు. దాదాపు 9 నెలల విరామం తర్వాత తనదైన బ్యాటింగ్‌తో అభిమానులను హోరెత్తించనున్నాడు. కోహ్లీతో పాటు శనివారం నెట్స్‌లో అతడు అన్ని రకాల షాట్లు ఆడుతూ తన ఫుట్‌వర్క్ చాటుకున్నాడు. బ్యాక్‌ఫుట్‌లోనూ సాధన చేసిన కింగ్ కోహ్లీ.. త్రోడౌన్ బంతుల్ని సమర్ధంగా ఎదుర్కొన్నాడు. కోహ్లీతో పాటు రోహిత్ శర్మ, కుర్రాడు యశస్వీ జైస్వాల్ సైతం నెట్స్‌లో చెమటోడ్చారు. శుభ్‌మన్ గిల్ గైర్హాజరీలో హిట్‌మ్యాన్‌తో కలిసి యశస్వీ ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు.
భారత జట్టు(అంచనా): రోహిత్ శర్మ, యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్(కెప్టెన్, వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, కుల్దీప్ యాదవ్, నితీశ్ రెడ్డి, హర్షిత్ రానా, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ.