గత బీఆర్‌ఎస్ పాలనలో ఆడబిడ్డల పొదుపు అయిన రూ.1500 కోట్ల అభయహస్తం నిధులను, రూ.3 వేల కోట్ల వడ్డీలను కూడా బీఆర్‌ఎస్ పాలకులు దోచుకున్నారని మంత్రి సీతక్క ఆరోపించారు. ఇందిరమ్మ ఇండ్లు 4.5 లక్షలు మంజూరు చేయడం, 74 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం, లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు జారీ చేయడం, నాణ్యమైన ఇందిరమ్మ చీరలు పంపిణీ, ఏకకాలంలో రెండు లక్షల పంట రుణమాఫీ, సన్నబియ్యం పంపిణీ, సన్న వరిబియ్యం బోనస్ వంటి ఎన్నో కార్యక్రమాలు తమ ప్రభుత్వం చేపట్టిందని వివరించారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం స్థానిక ఎన్నికలను రెండేళ్లు వాయిదా వేయాల్సి వచ్చిందని అన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.3 వేల కోట్లు ఆలస్యం అవుతున్నాయని తెలిపారు. 2026 మార్చి 31 నాటికి ఆర్థిక సంఘం గడువు ముగియనున్న నేపథ్యంలో ఇప్పటికైనా ఎన్నికలు జరపకపోతే రాష్ట్రానికి నష్టం తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు. రిజర్వేషన్ పెంపునకు అవసరమైన అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయని, కానీ బీజేపీ-, బీఆర్‌ఎస్ కలిసి కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. కులగణనలో బీఆర్‌ఎస్ పెద్దలు పాల్గొనకపోవడమే దీనికి నిదర్శనమని చెప్పారు. రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పే బీజేపీ నాయకులు, బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం దొంగ దీక్షలు చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. రిజర్వేషన్ పెంపు అనేది ఢిల్లీలో పెండింగ్‌లో ఉన్న అంశమని అన్నారు. నిజంగా ప్రధాని మోడీ బీసీ అయితే వెంటనే నిర్ణయం తీసుకోవాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల పెంపుపై కేంద్రం ఆలస్యం చేస్తున్నందున, పార్టీ పరంగా బీసీలకు 42 శాతం సీట్లను కేటాయిస్తామని మంత్రి ప్రకటించారు.