కెసిఆర్ దీక్ష వల్లే తెలంగాణ వచ్చిందని బిఆర్‌ఎస్ చెప్పుకుంటుందని, కెసిఆర్ దీక్ష ఎలా చేశారో, ఎలాంటి ఫ్లూయిడ్స్ తీసుకున్నారో అందరికీ తెలుసనీ, 1,200 మంది అమరవీరుల త్యాగాల కంటే కెసిఆర్ దీక్ష పెద్దదా?’ అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. శనివారం సీఎల్పీ మీడియా సెంటర్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీకాంతాచారి, యాదయ్య, ఇషాన్‌రెడ్డి, కిష్టయ్య వంటి ఉద్యమ వీరుల త్యాగాలను బిఆర్‌ఎస్ ఎందుకు గుర్తు చేసుకోవడం లేదని ఆయన ధ్వజమెత్తారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ కోసం చేసిన సేవలను గుర్తుచేస్తూ మాట్లాడితే కెటిఆర్ ఎగిరి పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హయాంలో చిన్నారెడ్డి నాయకత్వంలో సాగిన సంతకాల సేకరణలో మహేష్ గౌడ్ కీలక పాత్ర ఉందని ఆయన గుర్తు చేశారు. సాగరహారం రోజు కెసిఆర్, కెటిఆర్‌లు ఎక్కడ ఉన్నారని దయాకర్ నిలదీశారు. తెలంగాణ సాధనకు వ్యతిరేకంగా కెసిఆర్ అవకాశవాద రాజకీయాలు చేశారని, మిలియన్ మార్చ్‌ను కూడా అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ ఉదంతంలో కోదండరాం, గద్దర్, అందెశ్రీ, గూడ అంజయ్యలను కెసిఆర్ పట్టించుకోలేదన్నారు.
తెలంగాణ నిజమైన బిడ్డ రేవంత్ రెడ్డి
సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని కెసిఆర్ అన్నారని, అదే సోనియాను బజారుకీడుస్తున్నారని తర్వాత అనడం నీచ రాజకీయమేనని దయాకర్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీని చంపడానికి కెసిఆర్ ప్రయత్నించారని అద్దంకి దయాకర్ ఆరోపించారు. తెలంగాణ నిజమైన బిడ్డ రేవంత్ రెడ్డినేనని పేర్కొంటూ, కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చి సోనియాకు రేవంత్ బహుమతి ఇచ్చారని ఆయన అన్నారు. అందెశ్రీ అంత్యక్రియల్లో సిఎం రేవంత్ వ్యవహారించిన తీరును దేశం చూసి అబ్బురపడిందని ఆయన కొనియాడారు. బిఆర్‌ఎస్‌లో ఇప్పుడు 420 మాత్రమే మిగిలారని, సర్పంచ్ ఎన్నికల్లో సెంటిమెంట్ కోసం హడావిడి చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కెసిఆర్ రాజ్యాంగాన్ని మారుస్తానని చెప్పి అంబేద్కర్‌ను అవమా నించారని ఆయన ఆరోపించారు. రాజీవ్ గాంధీ విగ్రహంపై చేయి వేస్తే ఖబడ్దార్ కెటిఆర్ అంటూ అద్దంకి హెచ్చరించారు. తెలంగాణలో బిఆర్‌ఎస్ తిరిగి అధికారంలోకి రావడం కల్ల అని ఆయన ప్రకటించారు. ఉద్యమకారులను జైలులో పెట్టిన చరిత్ర కెసిఆర్‌దని, రాక్షసంగా వ్యవహారించారని అని దయాకర్ విమర్శించారు.