హైదరాబాద్: వరంగల్ విమానాశ్రయం నిర్మాణం వేగవంతం చేయాలని నిర్ణయించామని బిజెపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. వరంగల్ విమానాశ్రయం నుంచి ముందుగా ఎటిఆర్ విమానాలు నడపాలని నిర్ణయించామని అన్నారు. ఈ సందర్భంగా హనుమకొండలో మీడియాతో మాట్లాడుతూ.. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు కూడా వేగంగా సాగుతున్నాయని, కాజీపేట రైల్వేస్టేషన్ ఆధునికరణ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు చెప్పామని తెలియజేశారు. అమృత్ పథకం కింద వరంగల్ జిల్లాకు రూ.874 కోట్లు మంజూరు చేసిందని, హృదయ్ పథకం కింద పురాతన ఆలయాల పునరుద్ధరణకు కేంద్రం నిధులు ఇచ్చిందని అన్నారు. రామప్ప ఆలయం అభివృద్ధి కోసం కేంద్రం రూ. 146 కోట్లు ఖర్చు చేస్తోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.