ఇంట్లో వారితో గొడవ పడి బయటకు వెళ్లిపోయే వాళ్లని మనం చాలా మందిని చూసే ఉంటాం. కానీ, ఈ వ్యక్తి ఏకంగా దేశం దాటి వెళ్లిపోయాడు. తండ్రితో గొడవ పడి ఇంట్లో నుంచి వెళ్లిపోయి.. సరిహద్దు దాటి పాకిస్థాన్ భూభాగంలోకి ప్రవేశించాడు. అతడిని అరెస్ట్ చేసినట్లు పాక్ అధికారులు వెల్లడించారు. ఆగస్టు 16న 31 ఏళ్ల బిజె సింగ్ అనే వ్యక్తి పంజాబ్ సరిహద్దు దాటి తమ దేశంలోకి ప్రవేశించాడని పాక్ అధికారులు తెలిపారు. సరిహద్దుల్లో అనుమానంగా కనిపించడంతో అతన్ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
మూడు నెలలుగా బిజె సింగ్ తమ అధీనంలో ఉన్నాడని.. విచారణలో అతడి ప్రవర్తన అనుమానస్పదంగా కనిపించడంతో లాహోర్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాసూర్ పోలీస్ స్టేషన్‌కు అతడిని అప్పగించినట్లు పేర్కొన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో తండ్రి బర్షన్ సింగ్‌తో గొడవపడి.. ఇంటి నుంచి బయటకు వచ్చేసినట్లు విచారణలో బిజె సింగ్ తెలిపాడని వెల్లడించారు. పాకిస్థాన్‌లోకి అక్రమంగా ప్రవేశించినందుకు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని స్పష్టం చేశారు.