కొన్ని క్రికెట్ మ్యాచ్‌లు అంతగా ఆకట్టుకోకపోయినా.. కొన్ని మ్యాచ్‌లు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంటాయి. అలాంటి ఓ మ్యాచ్ మహిళల బిగ్ బాష్ లీగ్‌లో జరిగింది. విజయానికి కేవలం మూడు పరుగులు అవసరం ఉన్న నేపథ్యంలో అంపైర్లు తీసుకున్న ఓ నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. శుక్రవారం అడిలైడ్ స్ట్రైక్స్, సిడ్నీ థండర్స్ తలపడ్డాయి. వర్షం కారణంగా మ్యాచ్‌కు ఆటంకం కలిగింది. దీంతో మ్యాచ్‌ని ఐదు ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచిన సిడ్నీ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ప్రత్యర్థి అడిలైడ్‌ను 45 పరుగులకే కట్టడి చేసింది.
ఆ తర్వాత సిడ్నీ జట్టు బ్యాటర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. 2.5 ఓవర్లలో 43 పరుగులు చేశారు. కెప్టెన్ లిచీఫీల్డ్ 15 బంతుల్లో 38 పరుగులు చేయగా.. మరోవైపు జార్జియా వోల్ ఐదు పరుగులు చేసి ఇరువురు నాటౌట్‌గా ఉన్నారు. సిడ్నీ విజయానికి ఇంకా 13 బంతుల్లో 3 పరుగులు చేసి సరిపోతుంది. కానీ, ఫీల్డ్ అంపైర్లు ఎలోయిస్ షెరిడాన్, స్టీఫెన్ డియోనిసియన్‌లు చర్చించుకొని మ్యాచ్‌ని రద్దు చేశారు. ఈ నిర్ణయాన్ని సిడ్నీ జట్టు జీర్ణించుకోలేకపోయింది. బ్యాటర్లు ఇరువురు విస్మయానికి గురయ్యారు. కామెంటేటర్లు కూడా అంపైర్ల నిర్ణయాన్ని తప్పుబట్టారు. అయితే గత 15 నిమిషాలుగా వర్షం కురుస్తున్నా.. మ్యాచ్‌ని కొనసాగింలని అన్నారు. కానీ, హఠాత్తుగా సిడ్నీ జట్టు విజయానికి కేవలం మూడు పరుగులే అవసరమైన వేళ మ్యాచ్‌ని నిలిపివేయడం సరైన నిర్ణయం కాదని విమర్శించారు.