న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను ఎఫెక్ట్ కారణంగా శ్రీలంకలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వరదలు పలు ప్రాంతాలను ముంచెత్తాయి. దీంతో రోడ్లు, ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈక్రమంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అకస్మక వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 123కి పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. మరో 100 మందిక పైగా గల్లంతైనట్లు తెలిపారు. ప్రస్తుతం తుఫాను శ్రీలంక తీరం నుంచి భారత్ వైపు కదులుతుందని ఐఎండి ప్రకటించింది. రేపు దిత్వా తుఫాను తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే తుఫాను ప్రభావంతో తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
నవంబర్ 30న తుఫాను తీరాన్ని తాకే అవకాశం ఉన్నందున తమిళనాడులోని తిరుచ్చి, తంజావూరు, నాగపట్నం జిల్లాల్లోని పాఠశాలలుకు సెలవు ప్రకటించారు. పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ ఇవాళ జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసింది. వాయిదాపడిన పరీక్షల కోసం సవరించిన షెడ్యూల్‌ను త్వరలో తెలియజేస్తామని పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ ప్రకటన విడుదల చేసింది.