హైదరాబాద్: నగరంలోని కూకట్‌పల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. చెట్లకు నీళ్ళు పోస్తున్న మున్సిపల్ కార్మికుడిని వేగంగా దూసుకొచ్చిన ఓ కారు కంట్రోల్ తప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మున్సిపల్ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన శనివారం ఉదయం కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతి చెందిన వ్యక్తి బాడీని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ మద్యం మత్తులో కారు నడపడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.