ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో ఎన్నికల కమిషన్ అనుసరిస్తున్న విధానాలపై తీవ్ర అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. ఈమేరకు దాఖలైన పిటిషన్లపై రెండు రోజులపాటు సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణ నిర్వహించి తదుపరి విచారణ డిసెంబర్ 2కు వాయిదా వేసింది. బీహార్ రాష్ట్రంలో ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత ఇప్పుడు 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సవరణ నిర్వహిస్తున్నారు. ఎన్నికల నిర్వహణ పేరుతో చట్టసభల విధులను ఎన్నికల కమిషన్ తనకు తాను చేపట్టినట్టుగా ఈ కసరత్తు సాగుతోందని, రాజ్యాంగ పరిమితులను దాటి నిర్హేతుకమైన నిబంధనలతో పౌరులపై తీవ్ర భారాన్ని ఎన్నికల కమిషన్ మోపుతోందన్న అభ్యంతరాలు తలెత్తుతున్నాయి. ఓటర్ల అర్హతను నిర్ణయించడానికి 11 పత్రాలు సమర్పించాలని ఎన్నికల కమిషన్ నిబంధన విధించింది. ఏ చట్ట ప్రకారం ఆ నిబంధన విధించారని పిటిషనర్లు నిలదీస్తున్నారు. అటువంటి చట్టాన్ని పార్లమెంట్, లేదా అసెంబ్లీలు మాత్రమే చేయాలని, వాటికి అతీతంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు. ఈ ప్రక్రియ ఫోటో ధ్రువీకరణ కోసం కాకుండా పౌరసత్వ తనిఖీ కోసం చేపట్టినట్టు కనిపిస్తోందని ఆక్షేపిస్తున్నారు. బూత్‌స్థాయి అధికారులుగా ఉపాధ్యాయులను నియమిస్తున్నారు. వారి ద్వారానే పౌరసత్వాన్ని నిర్ధారించడం, ఆ తరువాత ఓటరుగా చేర్చాలో లేదో నిర్ణయించడం జరుగుతోంది.
ఈ విధంగా పౌరసత్వాన్ని నిర్ధారించే హక్కు, లేదా రాజ్యాంగపరమైన విధి బూత్‌లెవెల్ ఆఫీసర్లుకు కట్టబెట్టడం తీవ్ర చర్చనీయాంశంగా సాగుతోంది. మరోవైపు గత ఓటర్ల జాబితాలతో ఇప్పటి నమోదు ఫారాలను పోల్చిచూస్తున్నారు. అప్పటి జాబితాల్లో ఓటరు ఏవైనా పొరపాట్లు చేస్తే ఆ కారణాలతో అతని సంతానానికి ఇప్పుడు ఓటు తిరస్కరించడం ఏమిటని పిటిషనర్లు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు పౌరసత్వానికి ఆధార్‌కార్డు మాత్రమే ప్రామాణికం కాదని సుప్రీం కోర్టు స్పష్టం చేయడం కూడా సమస్యగా మారింది. చొరబాటుదారులు కానీ, ఇక్కడ పనిచేస్తున్న విదేశీయులు కానీ రేషన్ కోసం ఆధార్ కార్డు సంపాదిస్తే వారు మన పౌరులేనని ధ్రువీకరించాలా అని సుప్రీం కోర్టు ప్రశ్నించడం సమంజమే.కానీ చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆధార్ కార్డు ఒక్కటే ప్రామాణికంగా ఓటర్లు భావిస్తుంటారు. వారు తమ పౌరసత్వాన్ని నిరూపించుకునే మరే అధికారిక పత్రాలు వారి వద్ద ఉండవు. చాలామంది నిరక్షరాస్యులు కావడంతో ఈ నిబంధనలు వారికి తెలియడం లేదు. ఇవన్నీ క్షేత్రస్థాయిలో ఓటర్ల జాబితాల తయారీకి ప్రతిబంధకాలవుతున్నాయి. ఓటరు నమోదు ఫారం 6 లో పేర్కొన్న వివరాలు సరైనవో, కావో నిర్ధారించుకునే అధికారం ఇసికి ఉందని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. కానీ ఆ నిర్ధారణే సరిగ్గా జరగడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి.
బీహార్‌లో ఏ విధంగా అనేక లోపాలతో ఈ ప్రక్రియ సాగిందో ఇప్పుడు మిగతా రాష్ట్రాల్లోనే అదే తీరులో సాగుతుండటం గమనార్హం. బ్లాక్ లెవెల్ ఆఫీసర్లు (బిఎల్‌ఒ) అందజేసిన ఎన్యూమరేషన్ ఫారాలను ఓటర్లు నింపిన తరువాత ఆ వివరాలను 2002 2005 ఓటర్ల జాబితాలతో పోల్చిచూడడంలోనే చిక్కులు ఏర్పడుతున్నాయి. బీహార్ డేటా అక్కడి ఎన్నికల ఫలితాలను నాటకీయంగా మార్చలేకపోయినప్పటికీ ఓటర్ల లింగ నిష్పత్తిలో గణనీయమైన తగ్గుదల చూపింది. నిజమైన ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాల కోసం పెనుగులాడుతూనే ఉన్నారు. ఓటర్ల వివరాల నమోదుకు డాక్యుమెంటేషన్ ఈ 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వచ్చే నెలలోగా పూర్తి చేయవలసి ఉంది. బిఎల్‌ఒలు ఇంటింటికీ వెళ్లి పరిశీలించాలన్న నిబంధన కాగితాలపైనే కనిపిస్తోంది. ఓటర్లు స్థానికంగా నివాసం ఉంటున్నట్టు ఇప్పుడు నిరూపించుకోవలసి వస్తోంది. గతంలో ఓటు వేసినా, అప్పటి ఓటర్ల జాబితాలో తన పేరు ఉన్నా సరే ఇప్పుడు పాత రికార్డులతో పనిలేకుండా తాను స్థానికుడిననే చట్టబద్ధతగా నిర్ధారించుకోడానికి రుజువు చూపించక తప్పడం లేదు. ఎన్నికల కమిషన్ చేయవలసిన ఈ బాధ్యతలన్నీ పౌరులపైనే నెట్టేయడం విమర్శలకు దారి తీస్తోంది. ఈ పరిస్థితి వల్ల చివరకు ఓటరు ప్రధాన హక్కులను తొలగించడమే అవుతుంది. ముఖ్యంగా వివాహితులైన మహిళలకు, వలసదారులకు ఇది అగ్నిపరీక్షే. స్థానిక నివాసిని గుర్తించడంలో కఠినంగా నిబంధనలు అమలు చేయాల్సిందేనని కోర్టు కూడా స్పష్టం చేయడంతో గుర్తింపు సమస్య జటిలంగా మారింది. దీన్ని గమనించి నిజమైన ఓటర్లను రక్షించే బాధ్యత పార్టీల ప్రతినిధులపైన, అధికారిక వాలంటీర్లపైన ఉందని కోర్టు సూచించింది.
అసలు ఎన్యూమరేషన్ విధానం రాజ్యాంగ సమ్మతి పొందిందా లేదా? సవరించిన జాబితాల్లో తప్పులు సవరించారా లేక అలాగే కొనసాగుతున్నాయా అన్నది కోర్టు వరకు రావడం లేదు. అలాగే ఎన్నికల కమిషన్ కూడా పట్టించుకోవడం లేదు. ఎన్నికల కమిషన్ సహనంతో ఇంటింటికీ వెళ్లి పరిశీలించే పకడ్బందీ విధానం అనుసరిస్తే కానీ పొరపాట్లు తొలగిపోవు. అలా చేస్తేనే సార్వత్రిక వయోజన ఓటు హక్కును కాపాడగలుగుతారు. అంతేకాకుండా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నకిలీ ఓటర్లను కూడా గుర్తించవచ్చు. ఈ విధంగా ఓటర్ల ప్రాథమిక హక్కును కాపాడడానికి బదులు ఓటర్ల జాబితాలను శుద్ధి చేయడమే ప్రధాన బాధ్యతగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తోంది. ‘సర్’ ప్రక్రియ విస్తరిస్తున్న కొద్దీ విధానపరమైన పర్యవేక్షణకు మించి కోర్టు ఈ ప్రక్రియ రాజ్యాంగ బద్ధత పునాదులను పరిశీలించడం చాలా ముఖ్యం. అదే విధంగా గత కొన్నేళ్లుగా తాము ఓటర్ల జాబితాల్లోనే ఉన్నామని ఓటర్లే స్వయంగా నిరూపించుకోవాలన్న నిబంధన అనుసరించకుండా ఎన్నికల కమిషనే ఆ బాధ్యతను మళ్లీ తీసుకునేలా సుప్రీం కోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలి.