సుప్రీం కోర్టు ఇటీవల బాలల ట్రాఫికింగ్ అంశంపై వ్యక్తం చేసిన ఆందోళన ఎంతో కీలకం. ప్రతి 8 నిమిషాలకో చిన్నారి తప్పిపో తున్నారు అని వార్తాపత్రికల శీర్షికలను ఉటంకిస్తూ న్యాయమూర్తు లు జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఆర్. మహదేవన్ బెంచ్ కేంద్రాన్ని తప్పిపడింది. జిల్లాకు ఒక నోడల్ అధికారి నియామకం, వారి వివరాలను ‘మిషన్ వాత్సల్య’ పోర్టల్లో ప్రజలకు అందుబాటులో ఉంచడం, డిసెంబర్ 9లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయడం ఇవన్నీ కోర్టు ఆదేశాలే. కానీ ఇవి కేవలం మొదటి అడుగులు మాత్రమే.
భారతదేశంలో చిన్నారుల అదృశ్యం కేసుల పెరుగుదల ఒక పెను సామాజిక సమస్యగా, మానవ హక్కుల ఉల్లంఘనగా పరిణమిస్తోంది. అందుబాటులో ఉన్న గణాంకాలు, ఇటీవలి న్యాయస్థానం వ్యాఖ్యలు ఈ సమస్య తీవ్రతను స్పష్టంగా ఎత్తిచూపుతున్నాయి. భారతదేశంలో ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక చిన్నారి తప్పిపోతున్నారు. ఈ గణాంకం కేవలం సంఖ్య మాత్రమే కాదు, ఒక దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద మానవీయ సంక్షోభం. జాతీయ నేర గణాంక బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) గణాంకాల ప్రకారం ఏటా సగటున 65 నుంచి 70 వేల మంది బాలలు మిస్సింగ్ కేసులుగా నమోదవుతున్నారు. వీరిలో 40- 50 శాతం మంది ఆచూకీ ఎప్పటికీ లభించడం లేదు. అంటే ప్రతి రోజూ సగటున 75 నుంచి 100 మంది పిల్లలు శాశ్వతంగా కుటుంబాల నుంచి తెగిపోతున్నారన్నమాట. అదృశ్యమవుతున్న వారిలో దాదాపు 70 శాతం బాలికలే. ఇది లైంగిక వేధింపులు, బలవంతం పెళ్లిలు, గృహ బానిసత్వం, వేశ్యా వృత్తి ముఠాలకు సరఫరా ఇలాంటి దారుణ గమ్యస్థానాలను సూచిస్తోంది. బీహార్‌లో గత ఐదేళ్లలో మిస్సింగ్ కేసులు 252 శాతం, పంజాబ్‌లో 142 శాతం పెరగడం ఈ సమస్య ఎంత తీవ్రతరమైందో చెబుతోంది. ఉతరప్రదేశ్ మధ్యప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కూడా ఈ బాలల ట్రాఫికింగ్ నెట్‌వర్క్ బాగా వ్యవస్థీకృతంగా పని చేస్తున్నాయని ఎన్‌జిఒలు, సుప్రీం కోర్టు వేదికల మీద ఆధారాలు సమర్పించాయి.
సుప్రీం కోర్టు ఇటీవల ఈ అంశంపై వ్యక్తం చేసిన ఆందోళన ఎంతో కీలకం. ప్రతి 8 నిమిషాలకో చిన్నారి తప్పిపోతున్నారు అని వార్తాపత్రికల శీర్షికలను ఉటంకిస్తూ న్యాయమూర్తులు జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఆర్. మహదేవన్ బెంచ్ కేంద్రాన్ని తప్పిపడింది. జిల్లాకు ఒక నోడల్ అధికారి నియామకం, వారి వివరాలను ‘మిషన్ వాత్సల్య’ పోర్టల్లో ప్రజలకు అందుబాటులో ఉంచడం, డిసెంబర్ 9లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయడం ఇవన్నీ కోర్టు ఆదేశాలే. కానీ ఇవి కేవలం మొదటి అడుగులు మాత్రమే. సమస్య లోతు చాలా ఎక్కువ. క్షేత్రస్థాయిలో ఎక్కువ మంది పోలీస్ స్టేషన్లలో మిస్సింగ్ ఫిర్యాదును కూడా స్వీకరించడానికి నిరాసక్తత, ముఖ్యంగా కౌమార బాలికల కేసుల్లో ప్రేమించి పారిపోయింది అని తేల్చేయడం, ఫిర్యాదు నమోదు చేసినా వెంటనే దర్యాప్తు మొదలుపెట్టకపోవడం -ఇవన్నీ బాలల ట్రాఫికింగ్ ముఠాలకు బంగారు అవకాశం కల్పిస్తున్నాయి. మొదటి 24- 48 గంటలు (గోల్డెన్ అవర్స్) కీలకమైనప్పటికీ, ఆ గడువులో చర్య జరిగేది మీడియా ఒత్తిడి ఉన్న కేసుల్లో మాత్రమే. తెలుగు రాష్ట్రాల పరిస్థితి కూడా ఆందోళన కలిగిస్తోంది. 2019 లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో రోజుకు సగటున 7మంది, తెలంగాణలో 9 మంది బాలలు మిస్సింగ్ అవుతున్నారు. దేశవ్యాప్త జాబితాలో తెలంగాణ 7వ స్థానం, ఆంధ్రప్రదేశ్ 12వ స్థానంలో ఉండడం స్థానికంగా కూడా ఈ సమస్య తీవ్రమేనని తెలియజేస్తోంది.
ఈ సమస్యకు పరిష్కారంలో భాగంగా.. ప్రతి జిల్లాలో ప్రత్యేక ‘మిస్సింగ్ చిల్డ్రన్ యూనిట్’ ఏర్పాటు చేయాలి. దీనికి స్వతంత్ర సిబ్బంది, వాహనాలు, ఫోరెన్సిక్ సపోర్ట్ ఉండాలి. మొదటి 24 గంటల్లోనే ఎఫ్‌ఐఆర్ నమోదు తప్పనిసరి చేయాలి, ఆలస్యం చేసిన అధికారులపై క్రిమినల్ చర్య తీసుకోవాలి. ‘ఖోయా-పాయా’, ‘ట్రాక్ ఛైల్డ్’, ‘మిషన్ వాత్సల్య’ పోర్టల్స్‌ను ఒకే జాతీయ డేటాబేస్‌లో విలీనం చేసి రియల్ టైమ్ షేరింగ్ చేయాలి. ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్త్మ్రల్ లాంటి కార్యక్రమాలను ఏడాది పొడవునా నిరంతరం నడపాలి. బాలల ట్రాఫికింగ్ కేసులకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి, కనీసం 6 నెలల్లో తీర్పు వచ్చేలా చేయాలి. బాలల హక్కుల ఉల్లంఘనలకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలి. పిఒసిఎస్‌ఒ, జెజె యాక్ట్ లో మరింత కఠోర సవరణలు చేయాలి. పాఠశాలలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీల ద్వారా పిల్లల భద్రతపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి.
చిన్నారుల అదృశ్యం అనేది కేవలం పోలీసు శాఖ సమస్య మాత్రమే కాదు.- ఇది మన సమాజ సామూహిక వైఫల్యం. ఒక పిల్లవాడు ఇల్లు దాటి బయటకు వెళ్తే వారు సురక్షితంగా ఉండాలనే నమ్మకం లేనప్పుడు ఆ దేశం ఎలా అభివృద్ధి చెందగలదు? సుప్రీంకోర్టు హెచ్చరికలు, ఎన్‌జిఒల ఆందోళనలు, బాధిత తల్లుల కన్నీళ్లు ఇవన్నీ ఒక్కటే చెబుతున్నాయి. తక్షణ చర్యలు తప్పనిసరి. ప్రతి చిన్నారి సురక్షితంగా ఉండే దేశం కావాలంటే, ప్రతి పౌరుడూ బాధ్యత వహించాలి. ఇది ప్రభుత్వం ఒక్కటే పరిష్కరించే సమస్య కాదు. ఇది మనందరి సమస్య. మన పిల్లల భవిష్యత్తు కోసం ఇప్పుడే మేలుకోవాలి.
ఎక్కులూరి నాగార్జున్ రెడ్డి
+91 90320 42014