మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పంచాయ తీ ఎన్నికలపై స్టే విధించేందుకు రాష్ట్ర హైకోర్టు నిరాకరించింది. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ మొదలైనందున ఈ దశలో స్టే విధించలేమని స్పష్టం చేసింది. ఎ న్నికలు నిర్వహించాలని మేమే చెప్పామని, మళ్లీ స్టే ఎలా ఇస్తామని హైకోర్టు ప్రశ్నించింది. నోటిఫికేషన్ విడుదలయ్యాక ఎందుకు సవాల్ చేశారని పిటిషనర్లను ధర్మాసనం అడిగింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం జీవో నెం.46ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎస్సి, ఎస్టి, బిసి వర్గాలకు కలిపి రిజర్వేషన్లు మొత్తం 50 శాతం కంటే ఎ క్కువ కాకూడదని ఆ జీఓలో ప్రభుత్వం స్పష్టం చేసిం ది. దీంతో జీవో నెం.46 ప్రకారం చట్టవిరుద్ధంగా రిజర్వేషన్లు కేటాయించారని,పంచాయతీ ఎన్నికల రిజర్వేషషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీవో 46పై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ వెనుకబడిన కులసంఘాలు వేరువేరుగా హైకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్‌ను శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ డివిజన్ ధర్మాసనం విచారించింది.
అత్యంత వెనుకబడిన వర్గాల ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది సుదర్శన్ కోర్టును కోరారు. బిసిల్లో ఏబిసిబి వర్గాల ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ దశలో ఎన్నికలపై స్టే విధించలేమని స్పష్టం చేసింది. సబ్ క్యాటగిరీ రిజర్వేషన్ లేనందుకు మీరు ఎన్నికలు రద్దు చేయాలని కోరుకుంటున్నారా..? అని పిటిషనర్‌ను ప్రశ్నించింది. బిసిలకు 42 శాతం రిజర్వేషన్ జీఓ విచారణ సమయంలో పాత పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని తామే చెప్పినట్లు హైకోర్టు గుర్తు చేసింది. దీనిపై ఇసి న్యాయవాది స్పందిస్తూ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక కోర్టుల జోక్యం ఉండకూడదని చెప్పుకొచ్చారు. దీనికి ఏకీభవించిన ధర్మాసనం తామే ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించినట్లు గుర్తు చేసింది. ఈ క్రమంలో డెడికేటెడ్ కమిషన్ రిపోర్టును బహిర్గతం చేసి కాపీ ఇవ్వాలని పిటిషనర్ న్యాయవాది కోరారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటేడ్ కమిషన్ ఇటీవల ప్రభుత్వానికి మరోసారి నివేదిక ఇచ్చిందని దాని ఆధారంగానే రిజర్వేషన్లు కేటాయిస్తూ జీఓ విడుదల చేశారన్నారు.
కానీ నివేదికలో ఏముందో బయటపెట్టడం లేదని వాదించారు. బిసిలలో కులాల జనాభా ఎంత అనే విషయం బయటికి రాలేదని ప్రభుత్వం ఏ ఆధారంతో జీఓ విడుదల చేసిందనే విషయం తెలియాల్సి ఉందన్నారు. బిసిలలో వర్గాల ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించకపోవడం వల్ల అత్యంత వెనుకబడిన కులాలు రాజకీయంగా నష్టపోతున్నాయని పిటిషనర్ న్యాయవాది వాదించారు. ఈ క్రమంలో ఎన్నికలపై స్టే విధించాలని న్యాయవాది సుదర్శన్ కోరారు. పంచాయతీ ఎన్నికల తరువాత ఎంపిటిసి, జడ్పిటిసితో పాటు పురపాలక సంఘాల ఎన్నికలు కూడా జరగనున్నాయని, ఆ ఎన్నికల్లోపు ఈ అంశం తేల్చే విధంగా వీలైనంత త్వరగా విచారణను చేపట్టాలని పిటిషనర్ న్యాయవాది కోరారు. ఈ దశలో జోక్యం చేసుకున్న సిజె ధర్మాసనం పంచాయతీ రాజ్ చట్టంలోని 285ఏ ను సవరించిన తర్వాత 2019లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి కదా అని పిటిషనర్ న్యాయవాదిని ప్రశ్నించింది. అప్పుడు లేని బిసి రిజర్వేషన్ల సమస్య ఇప్పుడు ఎందుకు తలెత్తిందని అడిగింది. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయినందును జోక్యం చేసుకోలేమని ధర్మాసనం పేర్కొంది. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఆరు వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఎనిమిది వారాలకు వాయిదా వేసింది.