ఇస్లామాబాద్ : జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌ను కలుసుకోనివ్వకపోవడంపై అడియాలా జైలు సూపరింటెండెంట్, ఇతర అధికారులకు వ్యతిరేకంగా ఇమ్రాన్ సోదరి అలీమా ఖాన్ శుక్రవారం ఇస్లామాబాద్ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఖైబర్‌ఫక్తుంఖ్వాముఖ్యమంత్రి సొహాలి అఫ్రిడి , పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పిటిఐ)కి చెందిన ఇతర నేతలు వెంటరాగా ఆమె కోర్టులో పిటిషన్ వేశారు. రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్న 73 ఏళ్ల ఇమ్రాన్‌ను వారానికి రెండుసార్లు కలుసుకోవచ్చని 2024 మార్చిలో ఇస్లామాబాద్ హైకోర్టు ఉత్తర్వు జారీ చేయడాన్ని పిటిషన్‌లో ప్రస్తావించారు.
అడియాలా జైలు సూపరింటెండెంట్ అబ్దుల్ ఘఫూర్ అంజుమ్, సద్దార్ బెరోని పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఒ రాజా అయిజాజ్ అజీమ్, ఫెడరల్ ఇంటీరియర్ సెక్రటరీ కెప్టెన్ ’(రిటైర్డ్( ముహమ్మద్ ఖుర్రం, పంజాబ్ హోం విభాగం సెక్రటరీ నూరుల్ అమీన్‌లను ప్రతివాదులుగా పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇమ్రాన్ ఖాన్‌ను కలియనీయకపోవడంతో అలీమా, అఫ్రిడి 16 గంటల పాటు ధర్నా చేశారు. ఇస్లామాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను కూడా కలుసుకోవడానికి వీలు కల్పించకపోవడంతో తమ పార్టీ పార్లమెంట్ సమావేశాలను అడ్డుకుంటుందని అఫ్రిడి వెల్లడించారు.