భారతదేశంలో సాంస్కృతి పునరుజ్జీవనం మొదలైందని ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం నాడు అన్నారు. అయోధ్యలో రామాలయం నిర్మాణం, వారణాశిలో కాశీ విశ్వనాథ్ ధామ్ నిర్మాణం, ఉజ్జయిని లో మహాకాల్ మహా లోక్ విస్తరణ దేశంలో సాంస్కృతిక పునర్వైభవాన్ని, పునరుజ్జీవనాన్ని ప్రతిబింబిస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. గొవాలో ప్రపంచంలోనే అతి ఎత్తయిన 77 అడుగుల శ్రీరాముడి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత జరిగిన సభలో మోదీ ప్రసంగించారు. దక్షిణ గోవాలోని కాంకోనా లోని పర్తగలిలో శ్రీ సంస్థాన్ గోకర్ణ జీవోత్తమ్ మఠ్ మఠం 550వ వార్షికోత్సవంలో భాగంగా జరిగిన విగ్రహావిష్కరణ సభలో ప్రధాని పాల్గొన్నారు.అయోధ్యలో రామాలయ నిర్మాణం, వారణాశిలో విశ్వనాథ్ ధామ్, ఉజ్జయినిలో మహాకాల్ మహాలోక్ విస్తరణ భారతదేశపు ఆధ్యాత్మిక వారసత్వ పునరుద్ధరణ కు ప్రతిబింబమని ఈ శక్తితో దేశం పురోభివృద్ధి మార్గంలో సాగుతుందని, ఈపునరుజ్జీవనం భవిష్యత్ తరాలను వారి మూలాలతో అనుసంధానికి ప్రేరేపణగా నిలుస్తుందని ప్రధాని అన్నారు. గోవా చరిత్రను ప్రస్తావిస్తూ, గోవాలో ఎన్నో మహోన్నత దేశాలయాలు, విధ్వంసం పాలైన సందర్భాలను గుర్తు చేశారు. గోవాలోని శ్రీ సంస్థాన్ గోకర్ణ జీవోత్తమ్ మఠ్ ఎన్నో ఆటుపోట్లను, తుపానులను ఎదుర్కొందని ఆయన పేర్కొన్నారు.
యుగాలు మారాయి, తరాలు మారాయి కానీ, మఠం దాని దిశను కోల్పేలేదని,ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ప్రజలకు దిశానిర్దేశం చేసే కేంద్రంగా ఆవిర్భవించిందని ప్రధాని ప్రశంసించారు. వికసిత్ భారత్ వైపు ప్రయాణం సమైక్యత ద్వారా సాగుతుందని, సమాజం కలిసి వచ్చినప్పుడు ప్రతిప్రాంతం, ప్రతివర్గం మమేకమైనప్పుడే పురోభివృద్ధి సాధ్యమని ప్రధాని అన్నారు.దేశ సర్వతో పురోభివృద్ధికోసం దేశప్రజలు తొమ్మిది తీర్మానాలను చేసుకోవాలని ప్రధాని సూచించారు. అవి నీటి సంరక్షణ, చెట్లపెంపకం, పరిశుభ్రత, స్వదేశి వస్తువుల వాడకం, దేశ్ దర్శన్ ( దేశంలో కీలక ప్రాంతాల సందర్శన) సహజ వ్యవసాయం, ఆరోగ్యకరమైన జీవన శైలి, యోగ, క్రీడలు, పేదలకు సాయం చేయడం అనేవే ఈ తొమ్మిది తీర్మానాలు.ఈ సందర్భంగా రామాయణం ఆధారంగా ఓ థీమ్ పార్క్ ను కూడా ప్రధాని ప్రారంభించారు. ఇవి రాబోయే తరాలకు ధ్యానం, ప్రేరణ, భక్తికి శాశ్వత కేంద్రాలుగా మారతాయన్నారు. ఈ కార్యక్రమంలో గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు, ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, మఠం అధిపతి శ్రీమద్ విద్యాదీష్ తీర్థ స్వామి ఇతరులు పాల్గొన్నారు.