హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ ఫర్మేషన్ (హిల్ట్) పాలసీ గురించి ప్రతిపక్షాలకు అర్ధం కాలేదనడం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దివాళాకోరుతనానికి నిదర్శనమని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ విధానంలో పారదర్శకత ఉంటే, దానిపై చర్చించేందుకు అసెంబ్లీని ఎందుకు సమావేశపరచడం లేదని ప్రశ్నించారు. -హిల్ట్ పాలసీ అత్యంత పారదర్శకంగా ఉందని, ఎలాంటి కుంభకోణానికి అస్కారం లేదంటున్న మంత్రి ఉత్తమ్ ఈ విధానంపై బహిరంగ చర్చకు సిద్దమా అని మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు.
శుక్రవారం ఏలేటి మీడియాతో మాట్లాడుతూ బహిరంగ చర్చకు మంత్రి సిద్దపడితే శనివారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ మీడియా పాయింటులో జర్నలిస్టుల సమక్షంలో చర్చకు తాను సిద్దమని తెలిపారు. లేదంటే డేట్, టైమ్, వేదికను మంత్రి ఖరారు చేసినా తనకు అభ్యంతరం లేదన్నారు. ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్దమే అని సవాల్ విసిరారు. హిల్ట్ పాలసీ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తెచ్చింది కాదని, దీనిపై గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే చర్చ జరిగిందంటున్న మంత్రి ఉత్తమ్ బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అవినీతిని, అక్రమాలను ఆదర్శంగా తీసుకుంటున్నారా అని ప్రశ్నించారు.