ప్రభుత్వ ప్రాధాన్యతలు ప్రజలకు ఉపయోగకరంగా లేవు అని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. .హిల్ట్ పాలసి పేరుతో మరో భూ దోపిడీ యత్నం చేస్తున్నారని, ఇది హిల్ట్ పాలసి కాదు టిల్ట్ పాలసీ అని విమర్శించారు. హిల్ట్ భావమేమి రేవంతా…? అని అందరూ అనుకుంటున్నారని అన్నారు. ఫ్యూచర్ సిటీ పేరుతో ప్రజలను భ్రమింపజేస్తున్నారని చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఉండగా కొడంగల్ ఎత్తిపోతల పథకం దేనికి..? అని ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం బిఆర్‌ఎస్ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్న వాటిని అమలు చేయకుండా లేని వాటికి ప్రాధాన్యత ఎందుకు, డబ్బుల సంపాదన కోసం కాదా..? అని అడిగారు.
నాలుగేండ్లలో 24 లక్షల ఇండ్లు కడతామన్నారని, ఇప్పటి వరకు ఎన్ని ఇండ్లు కట్టారు..విడుదల చేసిన మొత్తం ఎంత..? అని ప్రశ్నించారు. రైతుల అకౌంట్లలో డబ్బులు వేస్తే కమిషన్లు రావని కోతలు పెట్టే ఆలోచన చేస్తున్నారని ఆరోపించారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పేరుతో అంచనాలు భారీగా పెంచి లక్ష కోట్లు దాటించారని అన్నారు. విభజన చట్టం ప్రకారం ఎన్‌టిపిసి దగ్గర 2400 మెగావాట్ల విద్యుత్ తెలంగాణకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా కొత్త ప్రాజెక్టుల స్థాపన ఎందుకు..? అని ప్రశ్నించారు. ప్రతిపక్షాల విమర్శలకు విద్యుత్ శాఖ మంత్రి సమాధానం చెప్పకుండా వేరే మంత్రులు జవాబిస్తున్నారని పేర్కొన్నారు.