న్యూఢిల్లీ: గురువారం బంగారం 10 గ్రాములకు రూ.640 వంతున తగ్గి రూ.1,29,460కు ధర చేరుకోగా, వెండి అన్ని పన్నులు కలుపుకుని కిలోకు రూ.5100 పెరిగి రూ.1,68,200 కు చేరింది. ప్రపంచ బులియన్ మార్కెట్‌లో బలహీనమైన పరిణామాల కారణంగా గురువారం బంగారం ధరలు 10 గ్రాములకు రూ.640 వంతున తగ్గి దేశ రాజధానిలో ధర రూ.1,29,460 కి చేరింది. స్టాకిస్టులు, రిటైలర్లు కొనుగోలులో అంతగా చొరవ చూపకపోవడమే దీనికి కారణమని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది. 99.5 శాతం స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములకు రూ.640 వంతున తగ్గి ( అన్ని పన్నులు కలుపుకుని) రూ.1,28,860 కు తగ్గింది. రేంజి బౌండ్ ట్రేడింగ్‌లో తక్కువ స్థాయిలో బంగారం చేరింది.
రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం కుదురుతున్న దిశలో భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు సడలుతున్నందున బంగారం, వెండి ధరలపై ఆ ప్రభావం కనిపించిందని హెచ్‌డిఎఫ్‌సి కమొడిటీస్ సీనియర్ విశ్లేషకులు సౌమిల్ గాంధీ పేర్కొన్నారు. వెండి మూడు దఫాలుగా రూ.13,200 వంతున పెరిగి సోమవారం నాటికి కిలో కు రూ. 1,55, 000కు చేరింది. ప్రపంచ మార్కెట్‌లో బంగారం ఔన్సుకు 0.13 శాతం వంతున తగ్గి అంటే 5.60 డాలర్ల వంతున తగ్గి ఔన్సు 4158.38 డాలర్లకు చేరింది.
అమెరికాలో హాలీడే సీజన్ కూడా బంగారం ధరలపై ప్రభావం చూపించాయని సౌముల్ గాంధీ పేర్కొన్నారు. ప్రపంచ మార్కెట్‌లో వెండి ఔన్సు ధర 53.39 డాలర్లకు చేరింది. చైనా నుంచి తాజాగా వెండి సరఫరా కావడమే వెండి తిరిగి బలం పుంజుకుందన్నారు. గత దశాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా చైనాలో వెండి నిల్వలు తగ్గిపోవడంతో ప్రపంచ సిల్వర్ మార్కెట్ ఒడిదుడుకులకు గురైంది. ఇటీవల సరఫరా మెరుగుపర్చడం కోసం చెప్పుకోదగిన స్థాయిలో వెండి నిల్వలు లండన్‌కు ఎగుమతి అయ్యాయి. దీంతో ధరలు రికార్డు స్థాయిలో చేరాయి.