అమరావతి: దేవతల రాజధాని.. రైతుల త్యాగం.. అమరావతి అని ఎపి విద్యాశాఖ మంత్రి లోకేష్ కొనియాడారు. గత వైసిపి ప్రభుత్వం విధ్వంసం చేయాలని చూసిందని అన్నారు. 15 బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణాలకు కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. మూడు రాజధానులని చెప్పి ఒక్క ఇటుక కూడా వేయలేదని, ఒక వ్యక్తి నివాసానికి రూ. 700 కోట్లు పెట్టి విశాఖలో ప్యాలెస్ కట్టారని విమర్శలు గుప్పించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా జై అమరావతి నినాదంతో ముందు కెళ్లామని తెలియజేశారు. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని అని ఆనాడు పోరాటం చేశామని, జై అమరావతి అన్నందుకు వైసిపి ప్రభుత్వం రైతులపై కేసులు పెట్టారని మండిపడ్డారు. 631 రోజులు అమరావతి ఉద్యమం నడిపించిందని, 270 మంది రైతులు ప్రాణాలు కోల్పోవడం చూశామని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారుగా 3 వేల మంది రైతులపై ఆనాడు కేసులు పెట్టారని, కూటమి ప్రభుత్వంలో అమరావతి పనులు వేగంగా సాగుతున్నాయని లోకేష్ పేర్కొన్నారు. స్త్రీశక్తి అంటే తనకు గుర్తొచ్చే మొదటి వ్యక్తి నిర్మలా సీతారామన్ అని ప్రశంసించారు.పార్లమెంట్ లో ప్రతిపక్ష సభ్యులకు సరైన సమాధానం చెబుతారని, వరుసగా 8 కేంద్ర బడ్జెట్ లు నిర్మలాసీతారామన్ ప్రవేశ పెట్టారని అన్నారు. నిర్మలా సీతారామన్ జీవితం మనకు ఒక పాఠం అని లోకేష్ గుర్తుచేశారు.