రష్యా నుంచి భారత్ వంటి దేశాలు చమురు కొనుగోలు పూర్తిగా మానేస్తేనే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతుందని, రష్యా దిగివచ్చి శాంతి ఒప్పందం కుదురుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గట్టిగా ఒత్తిడి తెస్తున్న సంగతి తెలిసిందే. చమురు నుంచి వచ్చే పుష్కలమైన ఆదాయ వనరులతోనే ఆర్థికంగా బలం పెంచుకుని రష్యా ఉక్రెయిన్‌పై ఎడతెగని యుద్ధాన్ని కొనసాగిస్తోందని ట్రంప్ బాహాటంగా వెల్లడిస్తున్నారు. అంతేకాదు రష్యా లోని ప్రముఖ చమురు సంస్థలపై ఆంక్షలు కూడా విధించారు. ఈ ఆంక్షల ప్రభావం ఎంతవరకు యుద్ధాన్ని ఆపగలుగుతుందో చెప్పలేం. కానీ భారత్ మాత్రం ఈ ఆంక్షలతో చమురు సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వస్తోంది. మాస్కో లోని రోస్‌నెఫ్ట్, లుకోయిల్ అనే భారీ చమురు ఉత్పత్తి సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించడంతో రష్యా నుంచి చవకగా చమురు కొనుగోలు చేయడం భారత్‌కు కష్టమవుతోంది. రష్యా కన్నా చవకగా మరే దేశం భారత్‌కు చమురు సరఫరా చేయడం లేదన్నది వాస్తవం. రష్యా నుంచి అందే చమురు సరఫరాలు భారత్ చమురు అవసరాల్లో 36 శాతం తీరుస్తున్నాయి.
2023 నుంచి రోజుకు అయిదు బిలియన్ల బ్యారెళ్ల ముడి చమురు భారత్‌కు సరఫరా అవుతోంది. దీనివల్ల భారత్‌కు అదనపు ఖాతాలపై భారం చాలా వరకు తగ్గుతోంది. అయితే తాజాగా రష్యా నుంచి భారత్‌కు ముడి చమురు దిగుమతులు రోజుకు 47 శాతం వంతున తగ్గిపోయాయి. అంటే అక్టోబర్‌లో రోజుకు 1.86 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు దిగుమతి కాగా, ఈ నవంబరులో రోజుకు 9,82,000 బ్యారెళ్ల ముడి చమురు మాత్రమే దిగుమతి అయింది. దీన్ని బట్టి డిసెంబర్ జనవరి నాటికి దిగుమతులు మరింత ఎక్కువగా తగ్గిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. భారత్ స్వంత రిఫైనరీలు, రిలయన్స్ వంటి ప్రైవేట్ రిఫైనరీలు రష్యా నుంచి నేరుగా చమురు కొనుగోళ్లను తగ్గించి వేస్తున్నాయి. రిలయన్స్ రష్యా నుంచి ముడి చమురు దిగుమతిని దాదాపు నిలిపివేసిందని చెప్పవచ్చు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వంటి ప్రభుత్వ సంస్థలు అమెరికా ఆంక్షల పరిధి లోకి రాని కంపెనీల నుంచి డిస్కౌంట్ ధరలకు చమురు సరఫరా చేస్తే కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి.
అమెరికాతోపాటు పాశ్చాత్య దేశాల ఆంక్షల నేపథ్యంలో భారతీయ కంపెనీలు రష్యాకు బదులుగా పశ్చిమాసియా, లాటిన్ అమెరికా, పశ్చిమాఫ్రికా, అమెరికా, కెనడా తదితర దేశాల వైపు తమ దృష్టిని మరల్చుతున్నాయి. ఏదేమైనా చమురు కోసం ఇతర దేశాలపై ఆధారపడడం మాత్రం మనకు తప్పడం లేదు. ఈ దిశలో రష్యాయేతర ఇంధన వనరుల సంస్థలతో చమురు వాణిజ్య సంబంధాలు మరింత బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫలితంగా ప్రపంచ చమురు మార్కెట్ ఇంధన నిల్వలతో సమృద్ధిగా ఉండటమే కాక, ధరలు కూడా తగ్గుముఖం పడతాయన్న అంచనా వస్తోంది. బ్రెంట్ ముడి చమురు ధరలు గత జనవరిలో బ్యారెల్‌కు 79 డాలర్లు ఉండగా, అక్టోబర్ నాటికి 64 డాలర్లకు పడిపోయాయి. అప్పటి నుంచి ధరలు నిలకడగా ఉంటున్నాయి. అక్టోబర్ డిసెంబర్ క్వార్టర్‌కు బ్యారెల్‌కు 62.5 డాలర్లకు, 2026 మొదటి మూడు నెలల్లో 54 డాలర్లకు చమురు ధరలు ఇంకా పడిపోతాయని అమెరికా ఎనర్జీ ఇన్‌ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఇఐఎ) ముందస్తు అంచనా వెలువడింది. పెట్రోలు ఎగుమతి దేశాల ఆర్గనైజేషన్, అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ, ఇఐఎ వంటి సంస్థలు ధరలపై వేటికవే అస్పష్టమైన అంచనాలు అందిస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ధరలు తగ్గితేనే రష్యా దారి లోకి వస్తుందన్న దృఢ నమ్మకంతో ఉంటున్నారు. కానీ ఆయన ప్రయత్నాలు బెడిసికొట్టి ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఇంకా కొనసాగితే రష్యా చమురు సంస్థలపై మరిన్ని ఆంక్షలు అమెరికా విధించే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రపంచ చమురు మార్కెట్ మరింత కట్టుదిట్టమై ధరలు అమాంతంగా పెరిగిపోవచ్చు. అలాంటప్పుడు భారత్ పరిస్థితి ఏమిటన్నదే ప్రశ్న. అందుకని భారత్ ముందుచూపుతో ఒక్క రష్యాయే కాకుండా వేరే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోక తప్పదన్న హెచ్చరికలు వస్తున్నాయి. భౌగోళిక రాజకీయాలు చమురు ధరలపై విపరీత ప్రభావం చూపిస్తాయి. 88 శాతం వరకు పూర్తిగా ఇంధన దిగుమతులపై ఆధారపడే భారత ఇంధన భద్రతకు ఇదో పెద్ద సవాలు. దేశీయ చమురు ఉత్పత్తిలో వివిధ కారణాల వల్ల ఏర్పడుతున్న క్షీణతను గమనించి ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు భారత్ ముమ్మరం చేయవలసిన అగత్యం ఏర్పడుతోంది.
చమురు ఉత్పత్తికోసం పెట్టుబడి పెట్టడంలో అవరోధకరమైన నిబంధనలు, అత్యధిక పన్నుల భారం, ఇవన్నీ సహజ చమురు క్షేత్రాలనుంచి ఉత్పత్తికి ఆటంకాలుగా పరిణమిస్తున్నాయి. ఈ అవాంతరాలను తొలగించుకోక తప్పదు. చమురు కోసం సముద్రగర్భ అన్వేషణ సాగించడంలో మనకు తగినంత సాంకేతిక పరిజ్ఞానం లేదు. ప్రపంచ చమురు దిగ్గజం చెవ్రాన్ అత్యంత ఆధునిక సాంకేతికతను ఉపయోగించి అల్ట్రా హై ప్రెజర్‌తో చమురు తవ్వకాలను కొనసాగిస్తోంది. ఇదివరకు ఉపయోగించే సామర్థం కన్నా మూడింతలు ఎక్కువతో అన్వేషణలో దూసుకెళ్తోంది. మెక్సికో జలసంధిలో గతంలో చమురు లభ్యం కాని క్షేత్రాలనుంచి ఇప్పుడు సమృద్ధిగా చమురును సేకరించగలుగుతోంది. అలాంటి మార్గదర్శకత్వంతో మనదేశ సముద్ర తీర చమురు పరిపక్వ క్షేత్రాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చమురు నిల్వలను వెలికి తీయగల ప్రముఖ చమురు సంస్థల దిగ్గజాలను ప్రోత్సహించే ప్రణాళికలను ప్రభుత్వం చేపడితేనే చమురు సంపాదనలో స్వయం సామర్థం పెరుగుతుంది. స్వయం సామర్థం పెరిగితేనే రష్యా వంటి దేశాలపై చమురు కోసం ఆధారపడవలసిన గతి తప్పుతుంది.