మహాత్మ అనే బిరుదు ఎవరికి పూర్తిగా సరిపోతుంది అని వెతికితే ఈ దేశంలో మొట్టమొదట కనిపించే పేరు జ్యోతిరావు ఫూలేది. ఆయన ఎందుకోసం మహాత్ముడయ్యాడు? ఎవరినైతే ఈ సమాజం హీనంగా చూసిందో ఫూలే వారిని అక్కున చేర్చుకున్నాడు. ఎవరికైతే చదువుకునే హక్కులేదని పండితులు గగ్గోలుపెట్టారో ఆ జాతికి చదువు చెప్పాడు. ఎవరినైతే ఇంటినుంచి బయటకు రారాదని శాసించి హింసించారో వాళ్లకు బయట ప్రపంచమేమిటో ఎలా ఉంటుందో చూపించాడు. ఆనాడు ఏ హక్కులూలేని మనుషులను మనుషులుగా చూసాడు. స్త్రీ పురుషులిద్దరికీ సమాన హక్కులు ఉంటాయని భావించటం ఆనాడు ఒక పెద్ద నేరం. అలాంటి సందర్భంలో స్త్రీ హక్కుల కోసం గొంతు విప్పినవాడు ఫూలే. ప్రాచీనకాలంలో బుద్ధుడు, మధ్యయుగాల్లో వేమనల తరువాత ఒక జాతి మరొక జాతిమీద పడితింటూ వారినే అణచిఉంచే దుర్మార్గాన్ని ఎత్తిచూపిన ఆధునిక తొట్టతొలి భారతదేశపు విప్లవకారుడు ఫూలే. ఈ పని ఆయన కాలానికి ఎంత గొప్పదో ఆనాటి చరిత్రను చదివితే తెలుస్తుంది. ఫూలే అసమతుల్యమైన ఆనాటి చరిత్రను మార్చటానికి అనేక వ్యవస్థలు ఏర్పాటు చేసుకొని పోరాడాడు. ప్రజలజీవితాలను శాసించేవి మతవిశ్వసాలు అని గుర్తించి వాటి మూలాలను అన్వేషించాడు. ఈ అన్వేషణా ఫలితంగానే గులాంగిరి, తృతీయ రత్న లాంటి విలువైన గ్రంథాలు పుట్టాయి.
జనాభాలో సగానికిపైగా ఉన్న స్త్రీలు చదువు లేకపోవటం వల్ల, చైతన్యం లేకపోవటం వల్ల వెనుకబడిన సంగతిని గుర్తించి వారికోసం పాఠశాలలు నడిపాడు. ఈ దేశంలో ఆడపిల్లల కోసం మొట్టమొదటిసారిగా 1848 లోనే పాఠశాలలు పెట్టినవాడు ఫూలే. ఆడపిల్లలకు చదువు చెప్పటానికి మహిళా ఉపాధ్యాయులు అందుబాటులో లేరు. ఎందుకంటే ఆడపిల్లలు చదివితే కుటుంబానికే కాకుండా ఊరికే అరిష్టమని ప్రచారం చేశారు ఆనాటి మతపెద్దలు. అందుకే మొదట తన భార్యకు చదువు చెప్పి ఆమెను ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్ది ఆడపిల్లలకు చదువు చెప్పించాడు. దీంతో ఆగ్రహించిన ఆనాటి పండిత లోకం ఫూలే దంపతులమీద అనేక రకాల దాడులకు తెగబడ్డారు. ఆయన తండ్రి ద్వారానే ఇంట్లో నుంచి గెంటివేయించారు. 1856 లోనయితే ఆయనను చంపే కుట్ర కూడా చేసారు. ఇవేవీ ఆయన దృఢ సంకల్పం ముందు నిలబడలేకపోయాయి. కిందికులాలు అన్ని రకాలుగా పీడింపబడటానికి కారణాలు కనిపెట్టాడు. కులం గురించి ఆనాటికే శాస్త్రీయమైన అవగాహనను ఆయన కలిగి ఉన్నాడు.
మతం గురించి కూడా హేతుబద్ధంగా ఆలోచించాడు. సెప్టెంబర్ 24, 1873 నాడు సత్యశోధక్ సమాజాన్ని స్థాపించాడు. పండితులు చెప్పే సత్యానికి అసలు సత్యానికి తేడా ఏమిటో ఈ సంఘం ద్వారా ప్రజలకు వివరించి చెప్పే ప్రయత్నం చేసాడు. సామాజిక సంస్కరణను ప్రధాన కర్తవ్యంగా స్వీకరించామని చెప్పుకున్న ఆనాటి కొన్ని సంస్థల అసలు స్వరూపాన్ని ఆయన బట్టబయలు చేసాడు. తన‘సత్ సార’ గ్రంథంలో వాళ్ళ మీద సహేతుక విమర్శలను ఎక్కుపెట్టాడు. తాను రాసిన ‘సార్వజనిక్ సత్యధర్మ’ అనే పుస్తకంలో ఆయా సంఘాలలో శూద్రులను, అంటరాని కులాల్ని ఎందుకు భాగం చేయటం లేదన్న ప్రశ్నలు వేసాడు. ఆయన రచనలన్నీ అనేక ప్రశ్నలతో నిండి ఉంటాయి. సంభాషణా శైలిలో రచనలు చేసి తన సమకాలీన ప్రజల హృదయాలలోకి వెళ్లగలిగాడు. భాష కూడా పండిత భాష కాకుండా ఆనాటి ప్రజలభాషను పట్టుకొని రచనలు చేసాడు. సాహిత్య లోకానికి సంబంధించి అది కూడా ఒక విప్లవమే. అంబేద్కర్, ఫూలే వేసిన ఇదే తోవలో మరింత సమర్థవంతంగా పనిచేసి ఈ దేశంలో ప్రజలందరికీ న్యాయం చేయగలిగాడు. సాహిత్య రంగంలోను, సామాజిక రగం లోను ఫూలేకి అసలైన వారసుడు ఈ దేశంలో అంబేద్కర్ మాత్రమే.
ఈ క్రమంలోనే అంబేద్కర్ ఫూలేను తన గురుత్రయంలో ఒకనిగా గౌరవించాడు. తాను రాసిన ‘కులనిర్మూలన’ అన్న పరిశోధనాగ్రంథాన్ని ఫూలేకి అంకితమిచ్చాడు. జి.పి.దేశ్‌పాండే చెప్పినట్టు ఫూలే మొట్టమొదటి శూద్ర మేధావి. శూద్రులలో(బిసి) అతిశూద్రులలో (ఎస్‌సి) చైతన్య కోసం తన జీవితాన్ని ధారపోసిన మహనీయుడు.అంబేడ్కర్‌ను కేవలం దళితులకే నాయకుణ్ణి చేయటం ఎంత పొరపాటో, ఫూలేను కేవలం బిసిలకు మాత్రమే అంటగట్టడం అంతే పొరపాటు. ఫూలే ఈ రెండు వర్గాలకోసం పని చేసాడు. ఈ వర్గాలలోని కార్మికులు, రైతుల హక్కుల కోసం ఆలోచించాడు. ఈ నేపధ్యంలో వాళ్ల జీవితాలలో మెరుగుదల కోసం అప్పటి బ్రిటీషు ప్రభుత్వానికి విలువైన ప్రతిపాదనలు చేసాడు. అయితే మెజారిటీ ప్రజల జీవితాలు ఇలా ఎందుకు అణగారిపోయాయో అన్నదానిమీద ఆయనకు స్పష్టత ఉంది. బ్రాహ్మనిజం (ఈ పదం ఆయన వాడాడు) దీనికి కారణమని ఆయన అనేక రచనల్లో చెప్పాడు. కార్ల్ మార్క్ పాలకవర్గం, పాలిత వర్గం అని విభజించినట్టుగా ఫూలే కూడా దేశప్రజలను రెండు జాతులుగా విభజించాడు. ఒక వర్గం ఇంకొక వర్గాన్ని దోచుకుతింటున్న క్రమాన్ని గుర్తించి పీడిత వర్గం వైపు నిలబడి జీవితాంతం పోరాటం చేసాడు. ఈ పీడనను ధర్మబద్ధం చేస్తున్న మతవిశ్వాసాల పట్ల, ఆ సాహిత్యం పట్ల శత్రుత్వంతో నిలబడ్డాడు. కానీ అవన్నీ వదిలేసి ఫూలేను బిసి నాయకునిగా మాత్రమే చూడటంవల్ల జరిగే లాభం శూన్యం. ఆనాడు ఆయన ఏ అసమ వ్యవస్థతోనయితే పోరాడాడో అదే అసమ వ్యవస్థ ఈనాడు అనేక కొత్తరూపాల్లో కొనసాగుతూనే ఉంది. అది అలాగే కొనసాగినంత కాలం బిసిలకయినా, ఎస్‌సిలకయినా ఒనగూరేది శూన్యం.
– తోకల రాజేషం, 9676761415
– నేడు మహాత్మ జ్యోతిరావు ఫూలే వర్థంతి