భారత రాజకీయ వ్యవస్థలో అతి పెద్ద వర్గం ఎవరు? అనడిగితే క్షణం ఆలస్యం లేకుండా చెప్పాల్సిన సమాధానం -బిసిలు. జనాభాలో 56 శాతం ఉన్నప్పటికీ హక్కుల్లో ఆరు శాతం కూడా రానివ్వని రాజకీయ జాలంలో బిసిలు చిక్కుకున్నది ఏ రోజునో ఎవరికీ గుర్తు లేదు. స్వాతంత్య్రం వచ్చిన 1947 నుంచీ 2025 వరకూ 78 సంవత్సరాలుగా దేశం ఎన్నో మార్పులు చూసింది. ఎన్నో ప్రభుత్వాలు మారాయి, లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లు ప్రవహించాయి, శాసనాలు వచ్చాయి, రాజ్యాంగ సవరణలు జరిగాయి, కానీ బిసి వర్గం మాత్రమే అన్యాయం అనే శబ్దానికి ప్రతీకగా మారిపోయింది. జనాభాపరంగా అతిపెద్ద వర్గమై ఉండటం రాజకీయ పార్టీలకు ఒక వరమైతే, వారి హక్కులు ఇవ్వకపోవడం అదే పార్టీలకు ఒక విధానంగా మారిపోయింది. బిసిల పరిస్థితి గంగలో ఆచమనం చేసినట్టు, గొప్ప మాటలతో ఆశలు చూపిస్తూ, కానీ అసలు హక్కుల వద్దకు రానీయకుండా, ఓట్లను మాత్రం కట్టిపడేసేలా చేస్తున్న అత్యంత వ్యవస్థీకృత రాజకీయ మాయాజాలానికి నిదర్శనం. దేశంలో ప్రతి ఐదుగురిలో ముగ్గురు బిసిలు.
వారు వ్యవసాయంలో పనిచేస్తారు, శిల్పకళల్లో పనిచేస్తారు, వృత్తుల్లో పనిచేస్తారు, పట్టణాల కార్మిక శక్తిలో పనిచేస్తారు. దేశంలోని ఉత్పత్తి వ్యవస్థలో వీరే వెన్నెముక. అయినా దేశపాలనలో వీరి స్థానమేంటి? శూన్యం. ఈ శూన్యం సాదాసీదా సంఖ్య కాదు, ఇది రాజకీయ, సామాజికంగా సద్దుమణిగించిన వర్గం చరిత్ర. ఎవరైనా బిసి నాయకుడు ఎదిగితే అది అతని వ్యక్తిగత పోరాటం, భగవద్గీతలో చెప్పిన స్వధర్మ యుద్ధం వంటిదే తప్ప, వర్గం మొత్తం ఎదిగిన కథ కాదు. ఎందుకంటే రాజకీయం ఈ వర్గాన్ని ఎప్పుడూ వ్యక్తుల వరకు పరిమితం చేసింది, వర్గం వరకు ఎప్పుడూ వెళ్లనీయలేదు. కారణం ఒకటే 56 శాతం వర్గం ఒక్కటైతే దేశ రాజకీయ సమీకరణం మొత్తం తలకిందులవుతుంది. జనగణన విషయంలోనే బిసిలపై ఎంత ఘోరమైన మోసం జరిగిందో భారత చరిత్రలో పెద్ద అధ్యాయమే. 1931లో చివరిసారిగా కులగణన జరిగి, 1941 లో యుద్ధ కారణంగా జరగక, ఆ తర్వాత స్వతంత్ర భారత్ ఒక శతాబ్దం జరిగిన దాకా కులగణన చేయించకుండా అడ్డుపడింది. ఎవరు అడ్డుపడ్డారు? రాజ్యాంగాన్ని కాపాడతామనే మాటలు చెప్పే జాతీయ పార్టీలు, వర్గ అభివృద్ధే తమ సిద్ధాంతమని చెప్పే ప్రాంతీయ పార్టీలు.
ఎందుకు అడ్డుపడ్డారు? ఎందుకంటే నిజమైన సంఖ్య బయట పడితే, అంటే బిసిలు నిజంగా 56 శాతమని అధికారిక గణాంకం వెలువడితే వెంటనే రాజకీయ సమానత్వం కోరి ఒక మహాఉద్యమం వస్తుంది. ఇది పార్టీలు భరించలేవు. అందుకే బిసిల అసలు బలం గుప్తంగానే ఉంచారు. పార్లమెంట్‌లో బిసిల ప్రాతినిధ్యం ఇప్పటికీ 6-7 శాతం చుట్టూ తిరుగడం ఈ దేశ ప్రజాస్వామ్యానికి ఎంత పెద్ద అపహాస్యమో చెప్పడానికి మాటలు చాలవు. స్వభావంలో బిసిలను అన్ని పార్టీలూ ఓటు బ్యాంకుగా చూసినప్పటికీ, అధికార పథానికి మాత్రం వీరిని దగ్గరకు రానీయలేదు. ప్రధానమంత్రి పదవి, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి, హోం మంత్రి, విదేశాంగ మంత్రి, రక్షణ మంత్రి వంటి కీలక పదవుల్లో బిసిలు అరుదైన అతిథులు. ఇది యాదృచ్ఛికం కాదు. ఇది నిర్మిత వ్యవస్థ. ఎస్‌సి, ఎస్‌టిలకు రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చారు, ఎందుకంటే వారిని ప్రాతినిధ్యం కల్పించకపోతే రాజ్యాంగమే ప్రశ్నార్థకమవుతుంది. కానీ బిసిలకు మాత్రం రాజకీయ రిజర్వేషన్ గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. ఎందుకు? ఎందుకంటే బిసిలకు రాజకీయ రిజర్వేషన్ ఇచ్చిన రోజు దేశ రాజకీయ భూకంపం తప్పదని ప్రతి పార్టీకి తెలుసు. 56 శాతం వర్గానికి సీట్లలో 50 శాతం కూడా వస్తే ఇక పార్టీలు, నాయకులు, పోలిటికల్ ఇంజినీరింగ్ అన్నీ మారిపోతాయి. జాతీయ పార్టీలు తమ తమ విధానాలతో బిసిలను మాయచేశాయి. కాంగ్రెస్ స్వాతంత్య్రం నుంచి 1990 వరకు బిసి అంశాన్ని పక్కనపెట్టింది. మండల్ కమిషన్‌ను ఏర్పాటు చేసి కూడా దాని సిఫార్సులను అమలు చేయలేక సిగ్గుపడిపోయారు.
అది అమలు అయినది కూడా కాంగ్రెస్ వల్ల కాదు, రాజకీయ ఒత్తిడితో, ఓటు సమీకరణాలతో. బిజెపి 2014 తర్వాత బిసిలను పెద్ద వర్గంగా సంకలనం చేసుకున్నా, బిసిలకు రాజ్యాంగ హక్కులు ఇవ్వడంలో, రాజకీయ రిజర్వేషన్ విషయంలో, కులగణన విషయంలో అడుగులు వేయలేదు. బిసిలు పార్టీకి ముఖ్యమైన వర్గం, కానీ నిర్ణయ ప్రక్రియలో ప్రభావం చూపే వర్గం కావడం మాత్రం అనుమతించలేదు. ఇది మరో రూపంలోని మాయాజాలం. ప్రాంతీయ పార్టీల ఆట అయితే మరింత సుతిమెత్తగా, మరింత చురుకుగా సాగింది. ప్రతి రాష్ట్రంలో బిసి అనే నినాదం పెద్దగా వినిపిస్తుంది. టిక్కెట్లు ఇస్తామని, కుర్చీలు ఇస్తామని, కమిషన్లు వేస్తామని పెద్ద ప్రచారం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత బిసిలు సాధారణంగా మూడో, నాలుగో వరుసలో ఉంటారు. ముఖ్యమంత్రి పదవి బిసికి దక్కడం భారతదేశంలో ఓ అరుదైన సూర్యగ్రహణంలా మారిపోయింది. రాష్ట్రాల్లో కేబినెట్ శాఖల్లో ముఖ్య పదవులు సాధారణంగా ప్రాధాన్యత గల వర్గాలకు మాత్రమే. బిసిలకు లభించేది తక్కువ ప్రాధాన్యత గల శాఖలు, అదీ రాజకీయ అవసరాల కోసం మాత్రమే.
ఒకసారి ఎన్నికల వరకు కావలసినట్లుగా బిసిలను పెద్ద ఎత్తున వాడుకుంటారు. ఎన్నికలు ముగిసిన వెంటనే బిసిల సమస్యలు, వారి అభివృద్ధి, వారి విద్య, వారి ఉద్యోగాలు అన్నీ పార్టీలు మరచిపోతాయి. ఇకపైనా బిసిలకు నినాదాల కంటే హక్కులు కావాలి. మాటల కంటే అవకాశాలు కావాలి. కార్పొరేషన్ రుణాల కంటే రాజ్యాంగ హక్కులు కావాలి. బిసిలు ఈ దేశానికి వెన్నెముక అయితే, దేశ పాలనలో కూడా వెన్నెముకలా ఉండాలి. 56 శాతం వర్గానికి 6 శాతం హక్కులు సరిపోవు, సమానత్వానికి, ప్రజాస్వామ్యానికి, న్యాయానికి ఇది అవమానం. ఈ అన్యాయాన్ని సరిదిద్దబోయే శక్తి పార్టీలలో లేదు, ఆ శక్తి బిసిలలోనే ఉంది. వారు తమ శక్తిని గుర్తించాలి, తమ హక్కులను స్వయంగా డిమాండ్ చేయాలి, తమను మాయచేసే రాజకీయ భాష్యాలను చీల్చి పారేయాలి. 78 ఏళ్ల మాయాజాలానికి ముగింపు పలకాలంటే బిసిల చేతుల్లో ఉన్న ఓటు శక్తి చైతన్యవంతమవాలి. మాకు హక్కులు ఇవ్వాలి అన్న స్వరం ఒక రాష్ట్రంలో కాదు, దేశమంతటా ఒకటిగా వినిపించాలి. అప్పుడే బిసిల 56 శాతం సంఖ్య కేవలం ఓటు సంఖ్య కాదు, రాజకీయ, సామాజిక ఆర్థిక, సమానత్వానికి బలమైన ఆజ్ఞగా మారుతుంది. ఇక దేశం బిసిలను ఓటుగా కాదు, పాలనా భాగస్వాములుగా గుర్తించాల్సిన కాలం వచ్చింది అనేది నగ్నసత్యం.
– మన్నారం నాగరాజు, 9550844433