అవినాశ్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా వానర. ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ‘వానర‘ చిత్రాన్ని శంతను పత్తి సమర్పణలో సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్ పై అవినాశ్ బుయానీ, ఆలపాటి రాజా, సి.అంకిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్న ‘వానర‘ సినిమా మైథలాజికల్ రూరల్ డ్రామా కథతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు రాబోతోంది. ఈ సినిమా టీజర్ ను రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో మంచు మనోజ్ మాట్లాడుతూ అవినాశ్ తిరువీధుల ఆయన టీమ్ కష్టపడి చేసిన ‘వానర‘ సక్సెస్ కావాలి అని అన్నారు. హీరో, డైరెక్టర్ అవినాశ్ తిరువీధుల మాట్లాడుతూ “వానరుడి లాంటి హీరో తనకు ఇష్టమైన బైక్‌ను రావణుడి లాంటి విలన్ తీసుకెళ్లిపోతే ఆ బైక్ ను తిరిగి తెచ్చుకునేందుకు ఎంతవరకు వెళ్లాడు, ఎలాంటి ఫైట్ చేశాడు అనేది ఈ చిత్ర కథాంశం. ఈ కథ అనేక మలుపులు తిరుగుతూ థ్రిల్ పంచుతుంది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయిమాధవ్ బుర్రా, శంతను పత్తి, సుజాత సిద్ధార్థ్, శివాజీ రాజా, విశ్వజిత్, హర్ష ఛోటా కె ప్రసాద్, జానకీరామ్ పాల్గొన్నారు.