అమరావతి: ఒక అనధికారిక వ్యక్తి వద్దకు తుపాకీ ఎలా వచ్చిందని పోలీసులను ప్రొద్దుటూరు టిడిపి ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి ప్రశ్నించారు. పోలీసుల తీరుపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగారు వ్యాపారులను అత్యంత క్రూరంగా కొట్టిన విషయంలో విజయవాడ అడిషనల్ ఎస్పీ అని చెప్పుకున్న అనధికారిక వ్యక్తి వసంత్ ఎవరు? అని, ప్రొద్దుటూరు డిఎస్ పి ఏం చేస్తున్నారని నిలదీశారు. పోలీసు అధికారి కాని వ్యక్తి తుపాకీ గురిపెట్టి నిరపరాదులను బెదిరిస్తారా? అని పోలీసులను వరదరాజులురెడ్డి అడిగారు. ప్రొద్దుటూరు డిఎస్ పి కార్యాలయంలో వసంత్ అనే వ్యక్తి వచ్చి మాట్లాడారని మాకు సమాచారం ఉందని ఆరోపణలు చేశారు. పక్కనే ఉన్న పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారని, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసును వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు ఎందుకు బదిలీ చేశారని అడిగారు. ఇలాంటి సంఘటన జరిగిన దానికి తాము సిగ్గుపడుతున్నామని, ఇక మీదట ఇలాంటి చర్యలు జరగకుండా శాసనసభ్యునిగా చూసే బాధ్యత తనపై ఉందన్నారు. ఈ విషయాన్ని డిఐజి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తానని వరదరాజులురెడ్డి స్పష్టం చేశారు. ఉన్నతాధికారుల ప్రమేయంతో పోలీసులు ప్రైవేట్ పంచాయితీలు చేస్తున్నారన్న వరదరాజులురెడ్డి గతంలో ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. శ్రీనివాసులు అనే బంగారు వ్యాపారిని అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆరోపణ చేసిన విషయం విధితమే.