మన తెలంగాణ/హైదరాబాద్: అంతరిక్ష రంగంలో ప్రైవేటు రంగాన్ని ప్రో త్సహించినట్ల్లే, అణుశక్తి రంగంలో కూడా ప్రైవేట్ రంగానికి దారులు తెరవడానికి ప్రభుత్వం సిద్ధమవుతోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అంతరి క్ష రంగంలో పరిశోధన బలోపేతం చేస్తున్నామని, అందు కోసం నేషనల్ రీసె ర్చ్ ఫౌండేషన్ (ఎన్‌ఆర్‌ఎఫ్)ను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా హైదరాబాద్‌లోని స్కైరూట్ ఏరోస్పేస్ ‘ఇన్ఫినిటీ క్యాంపస్’ను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్కైరూట్ కంపెనీ అభివృద్ధి చేసిన తొలి ఆర్బిటల్ -క్లాస్ రాకెట్ ‘విక్రమ్- 1’ను కూడా ఆవిష్కరించారు. ఈ రాకెట్ ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టగల సామర్థ్యం కలిగి ఉంది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ వీడియో ప్రసంగిస్తూ అంతరిక్ష రంగంలో సంస్కరణలు, వృద్ధి గురించి పలు అంశాలను వివరించారు. యు వత కోసం రూ.లక్ష కోట్లు విలువైన ఆర్‌అండ్‌డి, ఇన్నోవేషన్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పది వేల అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఇప్పటికే ఏర్పాటు కాగా, త్వరలో 50,000 కొత్త ల్యాబ్స్ రానున్నాయని వివరించారు. భారతదేశంలో అద్భుతమైన అంతరిక్ష రంగ వృద్ధి జరుగుతోందని ప్రధాని పేర్కొన్నా రు. స్కైరూట్ క్యాంపస్ గురించి వివరిస్తూ భారత యువశక్తి, ఆవిష్కరణ, స్టా ర్టప్ స్పూర్తికి ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు. స్కైరూట్ వ్యవస్థాపకులు పవన్ కుమార్ చందన, భరత్ ధాకా యువ పారిశ్రామిక వేత్తలకు ఆదర్శమని అభినందించారు. రాకెట్ భాగాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లిన రోజుల నుండి, అత్యంత నమ్మకమైన ప్రయోగ వాహకాలను తయారు చేసే దేశంగా భారత్ ఎదిగిందని అన్నారు. దశాబ్దాలుగా ఇస్రో భారత అంతరిక్ష సామర్థ్యానికి వినూత్నమైన గుర్తింపును తీసుకొచ్చిందని చెప్పారు. 2022 నవంబర్‌లోనే స్కైరూట్ సబోర్టియల్ రాకెట్, విక్రమ్ ఎస్‌లను ప్రయోగించి దేశంలోనే వీటిని ప్రయోగించిన తొలి కంపెనీగా చరిత్రకెక్కిందని తెలిపారు. ప్రైవేటు అంతరిక్ష ప్రయోగాలకు అవకాశం కల్పించి వాటి ప్రయోగాలను విజయవంతం చేసేందుకు ఎన్‌డిఏ ప్రభుత్వం గత కొన్నేళ్లుగా అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని గుర్తు చేశారు.
కొత్త ఆవిష్కరణల సృష్టికర్తలు జెన్ జడ్
జెన్ జడ్ ఇంజినీర్లు, జెన్ జడ్ డిజైనర్లు, జెన్ జడ్ కోడర్సు, జెన్ జడ్ సైంటిస్టులు సాంకేతికంగా ఎన్నో కొత్త ఆవిష్కరణలు సృష్టించారని ప్రధాని కొనియాడారు. అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యం కల్పించడం ద్వారా వారు కీలక పాత్ర పోషిస్తున్నారని, ఫలితంగా స్కైరూట్ వంటి పలు ఇతర సంస్థలు కొత్త ఆవిష్కరణలతో ముందుకు వస్తున్నాయని ప్రశంసించారు. అంతే కాకుండా భారత దేశంలో ఉన్న ప్రైవేటు అంతరిక్ష రంగ నైపుణ్యం ఉన్న వారి వల్ల ప్రపంచంలోనే కొత్త గుర్తింపు తీసుకు వస్తున్నారని కొనియాడారు. దీంతో ప్రస్తుతం దేశంలో 300కి పైగా స్పేస్ స్టార్టప్లు ఉన్నాయని, వీటిలో చాలా వరకు జెన్ జడ్ యువతే ఏర్పాటు చేసినవని తెలిపారు. గత 6-7 ఏళ్లలో భారత అంతరిక్ష రంగం ఓపెన్, సహకార పూర్వక, ఆవిష్కరణతో నడిచే వ్యవస్థగా మారిందని చెప్పారు. ఇన్-స్పేస్ ఏర్పాటు ద్వారా ప్రైవేట్ స్టార్టప్లకు ఇస్రో సౌకర్యాలు, సాంకేతికత అందుబాటులోకి వచ్చిందని వెల్లడించారు. భవిష్యత్తులో భారతదేశం గురించి ఆయన వివరిస్తూ యువత, వారి ఆవిష్కరణలదేనని ప్రధాని మోదీ అన్నారు. రానున్న రోజుల్లో తన ప్రయోగ సామర్థ్యాన్ని భారీగా భారత్ భారీగా పెంచుతుందని తెలిపారు. అంతే కాకుండా 5 స్పేస్-టెక్ యూనికార్న్‌లను సృష్టిస్తుందని పేర్కొన్నారు.
భారత్ ఉపగ్రహ ప్రయోగాల్లో ప్రపంచ దిగ్గజంగా ఎదగొచ్చు
ప్రపంచవ్యాప్తంగా చిన్న ఉపగ్రహాల డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, భారత్ తక్కువ వ్యయంతో, ఉపగ్రహ ప్రయోగాల్లో ప్రపంచ దిగ్గజ దేశంగా ఎదగవచ్చని ప్రధాని మోడీ చెప్పారు. అనేక గ్లోబల్ కంపెనీలు ఇప్పుడు భారతదేశంలో ఉపగ్రహాలను తయారు చేసి, భారత ప్రయోగ సేవలకు ఉపయోగించాలనే ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్, 1.5 లక్షలకుపైగా నమోదు చేసిన స్టార్టప్లతో ముందంజలో ఉందని తెలిపారు. సరికొత్త ఆవిష్కరణలు ఇప్పుడు పెద్ద పెద్ద పట్టణాల నుంచి మాత్రమే కాకుండా చిన్న పట్టణాలు, గ్రామాల వరకు విస్తరించాయని మోడీ వివరించారు. ఇంతే కాకుండా భారత్ డీప్-టెక్నాలజీ, హార్డ్‌వేర్, తయారీ, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని వెల్లడించారు. అనేక గ్లోబల్ కంపెనీలు భారత దేశంలో శాటిలైట్లను తయారు చేయాలని వాటిని ఇక్కడి నుంచి ప్రయోగించాలని ఆకాంక్షిస్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు. అంతే కాకుండా భారత దేశంతో సాంకేతిక భాగస్వామ్యం, ప్రయోగానికి అవసరమైన సహకారాన్ని కూడా అభ్యర్థిస్తున్నాయని, ఇదో మంచి అవకాశంగా తీసుకుని భారత యువత అందిపుచ్చుకోవాలని ఆకాంక్షించారు.
…………………