మనతెలంగాణ/హైదరాబాద్:ప్రపంచంతోనే పోటీపడేలా స్కిల్ యూత్ కొత్త రంగాల్లో, కొత్త మార్గాల అన్వేషణ చేపట్టే లా, తెలంగాణ అభివృద్ధి ప్రతిబింబించేలా తెలంగాణ రైజిం గ్- 2047 పాలసీ డాక్యుమెంట్ ఉండాలని సిఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. 2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణ ను తీర్చిదిద్దేందుకు స్పష్టమైన రోడ్ మ్యాప్ పాలసీ ఈ డాక్యుమెంట్‌లో కనిపించాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ల్ తెలంగాణ రైజిం గ్- 2047 పాలసీ డాక్యుమెంట్‌పై మంత్రులు, అధికారులతో గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ పాలసీ డాక్యుమెంట్ గురించి అధికారులకు సిఎం పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని మూడు రీజియన్లుగా విభజించి అభివృద్ధి చేసుకోవాలన్నారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకాన మి (క్యూర్), పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ (ప్యూర్), రూ రల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ (రేర్)గా మూడు రీజియన్లను విభజించుకోవాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఈ మూడు రీజియన్‌లలో ఎక్కడెక్కడ ఎలాంటి అభివృద్ధి ఉండాలో డాక్యుమెంట్‌లో పొందుపరచాలని ముఖ్యమంత్రి సూచించారు. హెల్త్, ఎడ్యుకేషన్, టెక్నాలజీ, జీసిసిలు, ఫార్మా, అగ్రికల్చర్‌తో పాటు వివిధ రంగాల్లో ఎక్కడెక్కడ ఏయే రంగం అభివృద్ధి ఉండాలో ప్రణాళిక రూపొందించాలన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్డు, పోర్ట్, కనెక్టివిటీ ముఖ్యమైనవని చెప్పారు.
ప్రతి రంగానికి సంబంధించి పాలసీ డాక్యుమెంట్‌లో స్పష్టంగా ఉండాలి
సంక్షేమం, టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, ఎనర్జీ డిపార్ట్ మెంట్ ఇలా ప్రతి రంగానికి సంబంధించి పాలసీ డాక్యు మెంట్‌లో స్పష్టంగా ఉండాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. తెలంగాణలో పాలసీ పెరాలసిస్ ఉండదని చాటి చెప్పేలా తెలంగాణ రైజింగ్ పాలసీ డాక్యుమెంట్ ఉండాలని సిఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. కొత్తగా ఏర్పాటయ్యే ఎయిర్ పోర్టుల్లో ప్రయాణికులతో పాటు కార్గో సర్వీసెస్ కూడా అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. వాస్తవిక దృక్పథం కనిపించేలా డిజైన్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సిఎం రేవంత్ పేర్కొన్నారు.
పెట్టుబడుల అవకాశాలు ప్రపంచ పెట్టుబడిదారుల ముందు
తెలంగాణలో ఉన్నఅపారమైన పెట్టుబడుల అవకాశాలను ప్రపంచ పెట్టుబడిదారుల ముందు ఉంచటంతో పాటు, ఇక్కడ పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలను ఈ రెండు రోజుల్లో ప్రదర్శించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళుతుందని సిఎం రేవంత్ తెలిపారు. అందుకే ఈవెంట్‌ను కూడా భవిష్యత్ ఫోర్త్ సిటీలో ప్రభుత్వం ప్లాన్ చేసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ రైజింగ్ విజన్ 2047 దార్శనిక భవిష్యత్ పత్రం, రాష్ట్ర భవిష్యత్‌కు సమగ్ర రూపంగా మారనుందన్నారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో ఈ డాక్యుమెంట్ తయారుచేశారన్నారు. సమాన వృద్ధి, మహిళా సాధికారత, యువశక్తి , స్థిరమైన అభివృద్ధి – ఈ మూడు ప్రధాన రంగాలపై రాష్ట్ర అభివృద్ధి వ్యూహాన్ని ప్రభుత్వం ప్లాన్ చేసిందని సిఎం రేవంత్ తెలిపారు. తెలంగాణను భారత దేశంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దడం ఈ విజన్ డాక్యుమెంట్ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
చైనా, జపాన్‌లతోనే పోటీ పడే లక్షంతో
చిన్న రాష్ట్రమైనా ఇక్కడ ఉన్న అపారమైన అవకాశాలను ప్రపంచానికి తెలియజేయాలని ప్రజా ప్రభుత్వం సంకల్పించిందని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అభివృద్దిలో పక్క రాష్ట్రాలతో కాదు చైనా, జపాన్‌లతోనే పోటీ పడే లక్షంతో ముందుకుపోతున్నామన్నారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, క్వాంటమ్ టెక్నాలజీ, కృత్రిమ మేథస్సు (ఏఐ), స్టార్టప్, ఎంఎస్‌ఎంఈలు, టూరిజం, ఎగుమతులు వంటి రంగాలు రానున్న రెండు దశాబ్దాల్లో ఆర్థిక వృద్ధికి కీలక రంగాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పారదర్శక పాలన, సులభ అనుమతులు, గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు రాష్ట్రాన్ని పెట్టుబడిదారుల మొదటి గమ్యస్థానంగా నిలబెట్టనున్నాయన్నారు. ఈ బలాలే పునాదిగా మరింత పెట్టుబడులను ఆకర్షించే విధంగా విజన్ డాక్యుమెంట్‌గా ఉండబోతోందని సిఎం తెలిపారు.
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా వ్యవసాయ కార్యాచరణ
గ్రామీణ ఆర్థికవ్యవస్థ బలోపేతం చేసేందుకు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా వ్యవసాయ కార్యాచరణ కూడా ఈ విజన్ డాక్యుమెంట్‌లో భాగమవుతోందన్నారు. రాష్ట్ర అభివృద్దిలో మహిళా సాధికారత కూడా అత్యంత ప్రధానమైన అంశంగా ప్రభుత్వం భావిస్తోందన్నారు. అందుకే కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. డెవలప్‌మెంట్ ఎకానమీలో కాలుష్యం వల్ల కలిగేనష్టాలపై కూడా ఈ విజన్ డాక్యుమెంట్ ఫోకస్ చేయనుంన్నారు. అందుకే నెట్-జీరో తెలంగాణను అవిష్కరించనుందని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. బ్లూ అండ్ గ్రీన్ హైదరాబాద్ లక్ష్యంగా తెలంగాణ 2047 డాక్యుమెంట్‌లో మూసీ పునరుజ్జీవనానికి రూపకల్పన చేశామని అందులో భాగంగా 2,959 చెరువులు, పార్కులు, అటవీ ప్రాంతాలను వాటి పూర్వ స్థితికి తీసుకురావటం లక్ష్యంగా పెట్టుకున్నామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో రీజనల్ రింగ్ రైల్, 4 ఇండస్ట్రీయల్ కారిడార్లు, 11 రేడియల్ రోడ్లు
గ్రామాల్లో స్వచ్చమైన తాగునీరు, పరిశుభ్రమైన రోడ్లు, సౌర విద్యుత్ వెలుగులతో విలేజ్ 2.0 లక్ష్యంతో పనిచేయాలని నిర్ణయించామని, మరో లక్ష్యంగా ఆధునిక రవాణ మౌలిక సదుపాయాల కల్పనను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోందని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు తరహాలో తెలంగాణకు మణిహారంలా రీజనల్ రింగ్‌రోడ్డును ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని, హై-స్పీడ్ మొబిలిటీ కారిడార్లను నిర్మించ నున్నట్టు సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రీజనల్ రింగ్ రైల్, 4 ఇండస్ట్రీయల్ కారిడార్లు, 11 రేడియల్ రోడ్లను నిర్మించనున్నట్టు ఆయన తెలి పారు. వీటితో పాటు వరంగల్, నిజామాబాద్, అదిలాబాద్, పెద్దపల్లి, కొత్తగూడెంలో కొత్త విమానాశ్రాయాలను ఏర్పాటు చేయబోతున్నట్టుగా సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి బందర్‌పోర్టు వరకు ఆధునిక హైవేను నిర్మించి సీపోర్టుకు అనుసంధానం చేయబోతున్నామని ఆయన తెలిపారు.
హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ కేంద్రాలుగా స్పోర్ట్ విలేజీలు
గ్లోబల్ వర్క్ ఫోర్స్‌తో పోటీపడేలా ప్రతి ఏడాది రెండు లక్షల తెలంగాణ యువతకు, లక్షమంది నిపుణులకు విదేశీ ఉపాధికి అవసరమైన నైపుణ్య అభివృద్ధి టార్గెట్ గా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు సిఎం రేవంత్ తెలిపారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ కేంద్రాలుగా స్పోర్ట్ విలేజీలు నిర్మిస్తామన్నారు. మానసిక ఆరోగ్యం, యోగా, ధ్యానం, క్రీడలు, సాంస్కృతిక అవగాహనతో సమతుల్య యువత అభివృద్ధి కోసం హోలిస్టిక్ వెల్ నెస్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించటమే లక్ష్యంగా టూరిజం ప్రాంతాల అభివృద్ది, నైట్ ఎకానమీ సిటీగా హైదరాబాద్ ఇమేజ్ ను క్రియేట్ చేయటం, బతుకమ్మ, బోనాలు, డెక్కన్ క్రాఫ్ట్ గ్లోబల్ పండుగలతో బ్రాండ్ తెలంగాణను విశ్వవ్యాప్తం చేయాలని సంకల్పించినట్టు సిఎం రేవంత్ పేర్కొన్నారు. ప్రపంచ సినిమా రంగాన్ని ఆకర్షిస్తూ యానిమేషన్, గేమింగ్, ఫిలిం-టెక్ పరిశ్రమలకు తెలంగాణ కొత్త గమ్యంగా రూపొందే లక్ష్యంతో పనిచేస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంతో పాటు గ్లోబల్ సిటీ హైదరాబాద్ దాకా సమాన అవకాశాలు, స్థిరమైన అభివృద్ధి అనే లక్ష్యంతో ఈ విజన్ డాక్యుమెంట్ -2047 మార్గదర్శకంగా ఉండబోతోందన్నారు. ఈ సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, అజారుద్దీన్, సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.