లాహోర్ : మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై అధికారిక స్పందన వెలువడింది. ఆయన ఖైదీగా ఉంటున్న అడియాలా జైలు అధికారుల నుంచి గురువారం ఓ ప్రకటన వెలువరించారు. జైలులో ఆయన ఆరోగ్యం బాగా ఉందని, ఆయన పరిస్థితిపై వెలువడ్డ వార్తలు వదంతులే అని తెలిపారు. పాకిస్థాన్ తెహరీక్‌ఏ ఇన్సాఫ్ నేత ఇమ్రాన్ ఖాన్ జైలులోనే చిత్రహింసల పాలయ్యి , మృతి చెందాడనే వార్తలు పాకిస్థాన్‌లో భగ్గుమన్నాయి. ఆయన జైలులోనే బాగా ఉన్నారని, ఫిట్‌గా ఉన్నారని తెలిపారు. అయితే దీనికి సంబంధించి ఫోటోలు ఏమీ పొందుపర్చలేదు. పార్టీ వర్గాలకు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలియచేశామని, వదంతులు నమ్మవద్దని తెలియచేస్తున్నామని పేర్కొన్నారు. రావల్పిండిలోని జైలు వద్ద పిటిఐ కార్యకర్తలు పెద్ద ఎత్తున రెండు రోజులుగా తమ నేత ఇమ్రాన్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయనను తమకు చూపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో జైలు అధికారులు స్పందించారు. ఆయన జైలులోనే ఆరోగ్యంగా ఉన్నారు. వేరే చోటికి తరలించారనే వాదన సరికాదని పేర్కొన్నారు.