గ్రూప్ -2 పరీక్షల 2019 ర్యాంకర్లకు రాష్ట్ర హైకోర్టులో ఊరట లభించింది. గ్రూప్ 2 ర్యాంకర్లకు సంబంధించి హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ రద్దు చేస్తూ హైకోర్టు మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్ 2 పరీక్షలకు సంబందించి 2019 సెలెక్షన్ లిస్ట్‌ను రద్దు చేస్తూ ఈ నెల 18న సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన విషయం విధితమే. ఈ క్రమంలో సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ టిజిపిఎస్‌సి పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన సిజె అపరేష్ కుమార్ సింగ్ డివిజన్ ధర్మాసనం మెరిట్ జాబితా చెల్లదు అంటూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేసింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.కాగా, గ్రూప్-2 పరీక్షల ఫలితాలను 2019 అక్టోబర్ 24న టిజిపిఎస్‌సి విడుదల చేసింది. ఈ ఫలితాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ భీమపాక నగేష్ సింగిల్ బెంచ్ అప్పటి సెలక్షన్ లిస్ట్‌ను రద్దు చేస్తూ తీర్పు చెప్పింది. సాంకేతిక కమిటీ సిఫారసులకు అనుగుణంగా పునఃమూల్యాంకనం చేయాలని,
తరువాతనే అర్హులైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసి నియామకాలు చేపట్టాలని, ఈ ప్రక్రియను ఎనిమిది వారాల్లో పూర్తి చేయాలని టిజిపిఎస్‌సిని సింగిల్ బెంచ్ ఆదేశించింది. టిజిపిఎస్‌సి 2015,-16లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో కొందరు వైట్‌నర్ ఉపయోగించారంటూ అభ్యంతరం తెలుపుతూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. అయినా టిజిపిఎస్‌సి 2019లో నియామకాలు చేపట్టింది. ఈ నియామకాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. వైట్‌నర్, దిద్దుబాటు ఉన్న ప్రశ్నప్రత్రాలను మూల్యంకనం చేయడంపై హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ అసహనం వ్యక్తం చేసింది. ట్యాంపరింగ్ జరిగినట్టు తెలిసినా మూల్యంకనం చేయడం చట్టవిరుద్ధమని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. సాంకేతిక కమిటీ సూచన ప్రకారం అప్పటి ప్రశ్నపత్రాలను తిరిగి మూల్యంకనం చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. సాంకేతిక కమిటీ, హైకోర్టు తీర్పుకు విరుద్దంగా వ్యవహరించే అధికారం టిజిపిఎస్‌సికు లేదని తేల్చిచెప్పారు.