కోనసీమ పచ్చదనానికి తెలంగాణ నేతల దిష్టి తగిలిందన్న ఎపి డిప్యూటీ సిఎం పవన్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్‌వి తెలివితక్కువ మాటలని, మెదడుకు పనిచెప్పకుండా మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. తమ దిష్టి వాళ్లకు తగలడం కాదు, ఇన్నేళ్లుగా వాళ్ల దిష్టే మా తెలంగాణకు, హైదరాబాద్‌కు తగిలిందని కౌంటర్ ఇచ్చారు. ప్రతిరోజూ వందలాది మంది ఎపి నుంచే హైదరాబాద్‌కు వస్తున్నారని, అలాంటప్పుడు తమ దిష్టి ఎలా తగులుతుందని ప్రశ్నించారు. ఒకవేళ దిష్టి తగులుతుందని అంత భయంగా ఉంటే, ఓ దిష్టిబొమ్మ పెట్టుకోవాలని, దాన్ని తామేమీ ఆపలేదని అన్నారు. ఇంత తెలివిలేని వాళ్లు కూడా ఉప ముఖ్యమంత్రులు అవుతున్నారంటే ఆశ్చర్యంగా ఉందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో గురువారం బిఆర్‌ఎస్ నేతలతో జగదీష్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తరువాత ప్రజలు చిత్ర, విచిత్రాలు చూడాల్సిన పరిస్థితి వస్తుందని, పాలసీల పేరు మీద స్కాములు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ భూములను ఇష్టం వచ్చినట్లు కట్టబెడుతున్నారని మండిపడ్డారు.10 వేల ఎకరాల విలువైన భూములను కారు చౌకగా, రేవంత్ రెడ్డి ఆత్మీయ బంధువులు అప్పగించేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు.
త్వరలోనే వారి వివరాలు బయట పెడతామని, అందులో రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు 40 మంది ఉన్నారని అన్నారు. హైదరాబాద్ ప్రజలనే కాదు, తెలంగాణ ప్రజలను మోసం చేయడమే ఈ హిల్ట్ పి పాలసీ అని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పెరిగిందని చెప్పుకుంటూ ఒఆర్‌ఆర్ దగ్గర ఎకరం 137 కోట్లు పలికిందనీ చెప్తున్న ప్రభుత్వం హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న భూములని కారు చౌకగా కట్టబెడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పారిశ్రామిక భూములను ఒక పథకం ప్రకారం తక్కువ ధరకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. నాచారం, బాలానగరంలో గజం లక్ష యాభై వేలు మార్కెట్ ధర ఉంటే,10వేల రూపాయలకే కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఎకరానికి ప్రభుత్వానికి కట్టిదే 3 కోట్ల ఆదాయం వస్తే, రేవంత్ రెడ్డి బంధువులకు 30 కోట్లు లాభం చేకూరుతుందని ఆరోపించారు. ప్రజల అవసరాల కోసం ప్రభుత్వ భూములు ఉపయోగపడాలని కెసిఆర్ అన్నారని, పార్కులు, ఆసుపత్రులు కట్టేందుకు ఉపయోగపడాలని ఆయన చెప్పేవారని గుర్తు చేశారు. కేవలం రియల్ ఎస్టేట్ దందా మాత్రమే తెలిసిన రేవంత్ రెడ్డి హిల్ట్ పి పాలసీకి తెరలేపారని, మంత్రులకు వాటాలు ఏర్పాటు చేసి నోర్లు మూయించారని ఆరోపించారు. పారిశ్రామిక వాడలోనీ భూములను ఎవరికీ కేటాయించారో వారి పేర్లు బయట పెట్టాలని డిమాండ్ చేశారు.