బీసీ రిజర్వేషన్లను కాంగ్రెస్ ప్రభుత్వం 17 శాతానికి తగ్గించిందన్న కేటీఆర్ వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని, బిసి రిజర్వేషన్ల అంశంపై బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న అబద్దపు ప్రచారాన్ని ప్రజలు నమ్మరని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా.దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. గురువారం ప్రజాభవన్‌లో మంత్రి సీతక్క మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోనే కుల గణన, రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసిందని పేర్కొన్నారు. 2014లో జరిగిన స్థానిక ఎన్నికల్లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించిందని, అయితే 2019లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 22 శాతానికి తగ్గించి బీసీల గొంతు కోసిందని ఆమె స్పష్టం చేశారు.
బీసీలకు జరిగిన ఈ అన్యాయాన్ని బీసీ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని అన్నారు. 2019 స్థానిక ఎన్నికల్లో రాష్ట్రం యూనిట్ గా సర్పంచ్‌ల రిజర్వేషన్లను టిఆర్‌ఎస్ ఖరారు చేయగా, ఆ విధానాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టిందని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సర్పంచ్ రిజర్వేషన్లకు మండల యూనిట్‌గా, వార్డు సభ్యుల రిజర్వేషన్లకు గ్రామపంచాయతీ యూనిట్‌గా పరిగణలోకి తీసుకోవడం జరిగిందని చెప్పారు. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు బీసీలకు న్యాయం చేయాలనే సంకల్పంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగిందని తెలిపారు. కుల గణనను పూర్తి చేసి, అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేశామని, ఆ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే రిజర్వేషన్లు ఖరారైనట్లు తెలిపారు.