న్యూఢిల్లీ: తన స్నేహితురాలు స్మృతి మంధానకు మద్దతుగా భారత మహిళా జట్టు స్టార్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. తన ప్రియుడు పలాశ్ తో జరగాల్సిన వివాహాన్ని మంధాన వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన స్నేహితురాలి పెళ్లి కోసం వచ్చిన జెమీమా రోడ్రిగ్స్..మంధానకు మద్దతుగా నిలిచింది. ప్రస్తుతం WBBL (మహిళల బిగ్ బాష్ లీగ్)లో ఆడుతున్న జెమీమా.. మంధాన పెళ్లి వేడుకకు హాజరైయ్యేందుకు ఇండియాకు వచ్చింది. ఇప్పుడు పెళ్లి క్యాన్సిల్ అయిన బాధలో ఉన్న మంధానకు అండగా ఉండేందుకు జెమీమా.. WBBL నుండి వైదొలిగింది. ఈ విషయాన్ని జెమీమా ప్రాతినిథ్యం వహిస్తున్న బ్రిస్బేన్ హీట్స్ ప్రకటించింది. బిగ్ బాష్ లీగ్ 2025 సీజన్‌లోని చివరి నాలుగు మ్యాచ్ లు ఆడేందుకు జెమీమా తిరిగి రావడం లేదని తెలిపింది.
కాగా, తెల్లారితే పెళ్లి జరగాల్సి ఉండగా.. సడెన్ గా తన పెళ్లిని మంధాన వాయిదా వేయడం సంచలనంగా మారింది. మొదట అనారోగ్యం కారణంగా మంధాన తండ్రిని ఆస్పత్రిలో చేర్పించారని.. అయన కోలుకున్న తర్వాతనే పెళ్లి చేసుకోవాలని స్మృతి తన వివాహాన్ని వాయిదా వేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత తన కాబోయే భర్త పలాశ్ కూడా అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతలో పలాశ్, మరో అమ్మాయితో డేటింగ్ చేస్తున్నట్లు తెలియడంతోనే స్మృతి, అతనితో పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ప్రీవెడ్డింగ్ ఫోటోలు, వీడియోలను మంధాన తన అకౌంట్ నుంచి డిలీట్ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే, ఈ వివాహం ఎందుకు ఆగిపోయిందో ఇప్పటివరకు ఎవరి నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో సోషల్ మీడియాలో రకరకాల వర్తాలు ప్రచారం జరుగుతున్నాయి.