మన తెలంగాణ / హైదరాబాద్ : పల్లెల్లో ఎన్నికల సందడి మొదలు కానుంది. రాష్ట్రంలోని పంచాయతీ ఎన్నికలకు గురువారం నుంచి నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 27 నుంచి తొలి విడత పోలింగ్‌కు సంబంధించిన నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ ఎన్నికలను మూడు విడతలుగా నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ ఓటర్లు 1.66 కోట్ల మంది ఉన్నారు. 4,200 సర్పంచ్ స్థానాలకు, 37,440 వార్డులకు మొదటి దశలో ఎన్నికలను నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వెల్లడించారు. రెండో విడత ఎన్నికలకు ఈ నెల 30 నుంచి, మూడో విడత ఎన్నికలకు డిసెంబర్ 3వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు.
రెండో విడతలో 4,333 సర్పంచ్ స్థానాలు, 38,350 వార్డులకు ఎన్నికలు జరగనుండగా మూడో విడతలో 4,159 సర్పంచ్ స్థానాలు, 36,452 వార్డులకు పోలింగ్‌ను నిర్వహించనున్నారు. ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడంతో ఎన్నికల ప్రవర్తన నియమావళి కూడా అమలులోకి వచ్చింది. రాష్ట్రంలో 31 జిల్లాల్లోని 564 మండలాల్లో గల 12,728 పంచాయతీలు, 1,12,242 వార్డులకు జరిగే ఎన్నికల్లో మొత్తం 1,66,55,186 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఎన్నికల్లో నోటా కూడా ఉండనుంది. రాష్ట్రంలో 2019 జనవరిలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించగా వాటికి 2024 జనవరిలో పదవీకాలం పూర్తి కావడంతో ఫిబ్రవరి నుంచి ప్రత్యేక అధికారులకు పాలనా బాధ్యతలు అప్పగించారు.
కలెక్టర్లు, ఎస్పీలతో ఎన్నికల కమిషనర్ సమీక్ష : గురువారం నుంచి పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎలాంటి లోటుపాట్లు లేకుండా సజావుగా నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. నామినేషన్ల ప్రక్రియ, గ్రామాల్లో భద్రత, పోలింగ్ ఏర్పాట్లపై ఆమె చర్చించారు. ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికల నిర్వహణపై చర్చించారు.
భద్రత అంశాలు, ఎన్నికల కోడ్ అమలు, సామగ్రి తరలింపు వంటి కీలక అంశాలపై కమిషనర్ పలు సూచనలు చేశారు. ఇక మూడు దశల్లో జరగనున్న సర్పంచ్ ఎన్నికలలో నవంబర్ 27న మొదటి దశకు చెందిన నామినేషన్లు మొదలు కానున్నాయి. గ్రామ పంచాయతీల ఎన్నికలు మూడు దశల్లో అనగా డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో జరగనుండగా మొత్తం 12,728 పంచాయతీలు, 1.13 లక్షల వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. 1.66 కోట్ల మంది ఓటర్లు పాల్గొననున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. ఎన్నికల అధికారులకు శిక్షణ కూడా ముగిసింది. ఇక బీసీ రిజర్వేషన్ల అంశం తేలిన తర్వాత జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు జరుగుతాయని తెలుస్తోంది.