మన తెలంగాణ / హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైనా చేస్తే అందులో ఒక మిషన్ ఉంటుందని, అదే ‘కమీషన్’ అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఎద్దేవా చేశారు. బుధవారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు రూ.50 వేల కోట్ల పవర్ స్కామ్‌కు తెర లేపిందని ఆరోపించారు. ఇందులో పవర్ ప్లాంట్ల ఏర్పాటుతో 30, 40 శాతం కమిషన్లు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కమిషన్లు ఎలా కొల్లగొట్టాలని మాత్రమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచన చేస్తోందని విమర్శించారు. వాటాల పంపిణీ విషయంలో మంత్రులు ఘర్షణ పడుతున్నారని వ్యాఖ్యానించారు. మంత్రుల కుటుంబ సభ్యులే బయటకు వచ్చి వాటాల అంశంపై మాట్లాడుతున్నారని, రాష్ట్రాన్ని అరాచకాలకు కేంద్రంగా కాంగ్రెస్ ప్రభుత్వం మారుస్తోందని అన్నారు. స్కాంలకు సమాధానం చెప్పకుండా ఎదురు దాడికి దిగుతున్నారని, 50వేల కోట్ల స్కామ్ బయటపెట్టామని, దమ్ముంటే రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు.
సీఎం రేవంత్ రెడ్డి స్కామ్‌లను వరుసగా ఆధారాలతో సహా బయటపెడతామని, త్వరలో హైదరాబాద్ అండర్ గ్రౌండ్ కేబుల్ స్కామ్, పంపుడ్ స్టోరేజీ, బ్యాటరీ స్టోరేజీ స్కామ్ బయటపెడతామన్నారు. రేవంత్‌రెడ్డి చేసిన ఇంటర్ స్టేట్ స్కాంను ఆధారాలతో సహా బయటపెడుతానని, 90శాతం సమాచారం సేకరించామని, ఇంకో 10శాతం రెండు మూడు రోజుల్లో వస్తుందని, వెంటనే మీడియా సాక్షిగా రేవంత్ రెడ్డి ఇంటర్ స్టేట్ స్కాంను బయటపెడుతామని చెప్పారు. కేబినెట్‌లో స్కాముల గురించి తప్ప స్కీముల గురించి చర్చించడం లేదని హరీష్ రావు విమర్శించారు. ఒక్క రామగుండం ప్రాజెక్టులోనే రూ.5-6 వేల కోట్ల కమీషన్ దండుకునేలా ప్లాన్ చేశారన్నారు. మంత్రులకు కమిషన్ల పంపకాల కోసమే మంత్రివర్గ సమావేశాలు జరుగుతున్నాయని, ప్రజల సమస్యలు, అమలు చేయాల్సిన పథకాలపై చర్చించడం లేదని దుయ్యబట్టారు. ఎన్టీపీసీ ఒప్పందంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వీడియోను ప్లే చేసి చూపించారు. ఎన్టీపీసీ ఒప్పందంపై మాట్లాడిన మాటలనే ఉదహరిస్తూ రామగుండం 800 మెగావాట్ల ప్రాజెక్టుకు యూనిట్ కు రూ.8 చొప్పున రూ.10,880 కోట్లు ఖర్చవుతుందని చెప్పారని,
ప్రాజెక్టు పూర్తయ్యేసరికి రూ.15 వేల కోట్ల వరకూ ఖర్చు అవుతుందన్నారు. అప్పుడు ఒక యూనిట్ కు రూ.10 ఖర్చవుతుందని, రూ.5కే యూనిట్ విద్యుత్ అందిస్తామన్న సీఎం రామగుండం యూనిట్ ను అంత ఖర్చుతో ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. పాల్వంచ, రామగుండం, మత్కల్ మూడు ప్రాంతాల్లో ఒక్కో చోట 800 మెగావాట్ల చొప్పున 2,400 మెగావాట్ల పవర్ ప్లాంట్లు పెడతానని సీఎం అంటున్నారని, అందుకు సుమారుగా రూ.50 వేల కోట్లు ఖర్చవుతుందని హరీష్‌రావు వివరించారు. వీటిలో రూ.40 వేల కోట్లు అప్పుగా తీసుకువచ్చినా రూ.10 వేలకోట్లు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడిగా పెట్టాలన్నారు రాష్ట్రంలో ఫీజు రీయంబర్స్ మెంట్, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు స్కాలర్ షిప్, ఉద్యోగుల డీఏ పెంపుదలపై ఫైర్ అయిన రేవంత్ రెడ్డి రూ.10 వేల కోట్లను ఎక్కడి నుంచి తీసుకు వస్తారని హరీష్ రావు ప్రశ్నించారు.