హైదరాబాద్, చెన్నై ప్రజల బుల్లెట్ రైలు కల త్వరలో సాకారం కానుంది. ఇంటర్ సిటీ ప్రయాణాన్ని పునర్నిర్మించే ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్- చెన్నై హైస్పీడ్ రైలు మార్గానికి దక్షిణ మధ్య రైల్వే తమిళనాడు ప్రభుత్వానికి సమగ్ర ప్రాజెక్టు నివేదికలో చేర్చేందుకు తుది అలైన్‌మెంట్ సమర్పించింది. హైస్పీడ్ మార్గం కారిడార్‌కు సమగ్ర ప్రాజెక్టు నివేదికపై రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లభించిన తరువాత నెలలోపు ఖరారు చేస్తామని సీయూఎంటీఏ (చెన్నై యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ) సభ్య కార్యదర్శి ఐ.జయకుమార్ తెలిపారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు గతంలో గూడూరు మీదుగా ప్రణాళిక రూపొందించిన స్థానంలో తిరుపతిలో స్టేషన్‌ను చేర్చడానికి మార్పులు చేశామని ఆయన తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్-చెన్నై మధ్య ప్రయాణం 12 గంటలు సమయం పడుతోంది. నూతనంగా డిజైన్ చేసిన మార్గంతో వేగం పెరిగి 2.20 గంటల టైం తగ్గనుంది. కొత్త మార్గంలో రాష్ట్ర పరిధిలో చెన్నై సెంట్రల్, మీంజూరు సమీపంలోని చెన్నై రింగు రోడ్డులో నూతన స్టేషన్‌తో కలిపి 2 స్టేషన్లు ఉంటాయి. మొబిలిటీ, వాణిజ్య హబ్‌లు అందుబాటులోకి తేవడానికి రవాణా ఆధారిత అభివృద్ధి కోసం రైల్వేశాఖ ప్రతిస్టేషన్ చుట్టూ సుమారు 50 ఎకరాల స్థలాన్ని కోరింది.
ఇటీవల రవాణాశాఖకు రాసిన లేఖలో దక్షిణ మధ్య రైల్వే అలైన్‌మెంట్, స్టేషన్‌కు స్థలాలు త్వరగా ఖరారు చేయాలని, భూమిని సేకరించేందుకు సూత్రప్రాయ ఆమోదం పొందాలని, రాష్ట్రంలో దీర్ఘకాలిక మౌలిక సదుపాయాల మాస్టర్ ప్లాన్‌లో రైలు కారిడార్‌ను కూడా చేర్చాలని కోరింది. రాష్ట్రంలోని హైస్పీడ్ నెట్‌వర్క్ నిర్మాణంలో 12 కి.మీ వరకు సొరంగ మార్గం ఉండనుంది. స్థల సేకరణపై జాప్యాన్ని నివారించేందుకు రైల్వేశాఖలు రాష్ట్ర అధికారులతో కలిసి ఉమ్మడిగా క్షేత్ర సందర్శనలకు అభ్యర్థించారు. దక్షిణాదిన ప్రణాళికలో ఉన్న 2 హైస్పీడ్ మార్గాలలో ఒకటి చెన్నై-హైదరాబాద్, రెండోది హైదరాబాద్- బెంగళూరు కారిడార్. హైదరాబాద్, చెన్నై, అమరావతి, బెంగళూరు నగరాలను కలిపేలా సర్వే జరుగుతోందని ఇటీవల విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. తమిళనాడు రాష్ట్రంలో 61 కి.మీ విస్తీర్ణంలో 2 ప్రధాన స్టేషన్ల ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రభుత్వ కన్సల్టెన్సీ సంస్థ ’రైట్స్’ లిమిటెడ్ నిర్వహించిన సర్వేల ఆధారంగా ఆలైన్‌మెంట్ రూపొందించారు. ప్రతిపాదిత మార్గానికి 223.44 హెక్టార్ల భూమి అవసరం. అటవీ భూమి ఇందులో లేదని రైల్వే అధికారులు గుర్తించారు. ఆ మార్గం 65 రహదారులు, 21 హైటెన్షన్ విద్యుత్తు లైన్లు దాటనుంది.