న్యూఢిల్లీ: మరణ శిక్ష పడ్డ మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలనే బంగ్లాదేశ్ అభ్యర్థనపై భారతదేశం స్పందించింది. ఈ విషయాన్ని తాము పరిశీలిస్తున్నట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ బుధవారం తెలిపారు. అమానుష దాడుల అభియోగాల కేసులో గత వారం బంగ్లా నేత హసీనాకు అక్కటి ట్రిబ్యునల్ మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. హసీనా ఇప్పుడు భారత్‌లో తలదాచుకుంటున్నారు. బంగ్లాదేశ్ సముచిత ప్రయోజనాల కోణంలో ఆమె అప్పగింత విషయాన్ని పరిశీలించి, తెలియచేస్తామని విదేశాంగ శాఖ ప్రతినిధి వివరించారు.
జుడిషియల్, అంతర్గత న్యాయచట్టపరమైన కోణాలలో బంగ్లాదేశ్ డిమాండ్‌ను పరిశీలిస్తున్నట్లు జైస్వాల్ తెలిపారు.బంగ్లాదేశ్ ప్రయోజనాలకు భారత్ కట్టుబడి ఉంటుంది. శాంతి, ప్రజాస్వామ్యం, సమీకృత విధానం, స్థిరత్వం వంటి పలు కీలక విషయాలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ విషయంపై సంబంధితపక్షాలతో సంప్రదింపులు జరుగుతాయని వివరించారు.